Showing posts with label Lyricists Biography. Show all posts
Showing posts with label Lyricists Biography. Show all posts

Wednesday, May 21, 2014

తేనెపాటల పూదోట

‘ఆరేసుకోబోయి పారేసు’కున్న అల్లరి పాటకు (‘అడవిరాముడు’ - 1977) తెలుగు ప్రేక్షకులతో ఈలలు, కేరింతలు, కేకలు వేయించిన ఘనత వేటూరి సుందరరామమూర్తిది. అదే సినిమాలో ఆయన ‘కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి’ వేసిన వైనం ఆ స్థాయి గుర్తింపునకు నోచుకుందా అంటే సందేహమే. జనామోదం అలానే ఉంటుంది మరి. ‘నిన్న మొన్న తుళ్లి తుళ్లి తూనీగల్లే ఎగిరిన పిల్లదానికొచ్చింది కళ, పెళ్లికళ’ అంటూ సుతారంగా, సున్నితంగా సంపెంగ రెక్కలతో సరాగమాడిన గీతర్షి ఆయన. 1974లో గీత రచయితగా పరిచయమైనా, ఆయన ఘన సినీ యానం మాత్రం అలా 1977లో ప్రారంభమైంది.

 ఒక్కసారి వెనక్కి చూస్తే, 1978లో వచ్చిన ‘సిరిసిరి మువ్వ’ సుందరరామమూర్తి ప్రతిభకు నిలువెత్తు అద్దమైంది. ఆ తరువాత మూడు దశాబ్దాల పాటు ఆయన పాటల తేరు ఊరేగడానికి ఆ సినిమా ఓ రహదారి అయింది. పడికట్టు పదాల దొంతరలు వదిలేసి, ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక... ఏరు దారెటు పోతుందో ఎవరినీ అడగక...’ అంటూ ఒకింత వేదాంతంతో వేటూరి తానేమిటో ఆవిష్కరించుకున్నారు. ఇక అంతే... పదేళ్ల పాటు ఎన్నెన్ని సినిమాలకు ఆయన సింగిల్‌కార్డు గేయ రచయితగా నిలిచారో లెక్క లేదు. చక్రవర్తి, ఇళయరాజా, కీరవాణి, రాజ్‌కోటి... ఎందరో సంగీత దర్శకులు ఏరి కోరి ఆయనే కావాలని తమ బాణీలకు పాటలు రాయించుకున్నారు. కె. విశ్వనాథ్ నుంచి కె. రాఘవేంద్రరావు, ఎ. కోదండరామిరెడ్డి, ఇవాళ్టి శేఖర్ కమ్ముల, గుణశేఖర్‌ల దాకా ఎందరో దర్శకులకు ఆయన హాట్‌ఫేవరెట్. మూడు దశాబ్దాలకు పైగా ఆయన కలం అందించిన పాటలు దాదాపు 5,000 పైనే ఉంటాయని ఓ అంకెల అంచనా.

 ‘రాయక నిర్మాతలను ఏడిపించే’ గుణం ఆయనకు అసలుండేది కాదు. 1970లలో సినిమా నిర్మాణంలో పెరిగిన వేగం, వ్యాపారాత్మక పాటల కోసం నిర్మాతలు రోజులూ వారాలూ ఎదురుచూసే ధోరణికి స్వస్తి చెప్పింది. అనుకున్నది తడవుగా సన్నివేశానికి అతికే పాటలు, ఇచ్చిన ట్యూన్‌కు అనుగుణంగా చెక్కిన పద సముదాయం గుబాళించే పాటలు వెంట వెంటనే రాయాల్సి వచ్చిన సంక్లిష్ట సంధిలో తన కోసం సిద్ధమైన సింహాసనాన్ని వేటూరి సరైన సమయంలో అధిరోహించారు.
 ట్యూన్ వినిపిస్తే అరగంటలో ఆయన ఫోనులోనే పాట వినిపించేవారని చెప్పుకుంటారు. ‘శంకరాభరణం’ లాంటి క్లాసిక్స్‌కి, ‘వేటగాడు’, ‘జగదేకవీరుడు - అతిలోకసుందరి’ వంటి ఫక్తు ఫార్ములా సినిమాలకు సమాంతరంగా సాహితీ గౌరవం కలిగిన పాటలు రాస్తూ, ఆయన తన ప్రతిభను ప్రపంచానికి స్పష్టం చేశారు. ‘ఓంకారనాదాను సంధానమౌ గానమే శంకరాభరణము...’ అని ఒక చేత్తో రాస్తున్న కాలంలోనే ‘ఆకుచాటు పిందె తడిసె... కోక మాటు పిల్ల తడిసె’ అంటూ యువతరానికి చక్కిలిగిలి పెట్టే పాటలు మరో చేత్తో రాసి చలాయించుకున్నారు. ‘అచ్చెరువున... విచ్చిన కన్నులతో’ రసహృదయుల్ని తన్మయానికి లోను చేశారు. అలవోకగా, అతి సుందరంగా మాటలతో ప్రయోగాలు చేసి పాటలల్లిన మాంత్రికుడు ఆయన.

 మైనా పిట్టలు ‘జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన’ సోయగాన్ని ఆయన ‘సితార’లో అక్షరబద్ధం చేస్తే ఇళయరాజా స్వరమాలిక కూర్చి అజరామరం చేశారు.
 ‘వానకారు కోయిలనై /తెల్లవారి వెన్నెలనై / ఈ ఎడారి దారులలో / ఎడద నేను పరిచానని/కడిమి వోలె నిలిచానని’ అంటూ ఆయన లిఖించిన ‘మేఘసందేశం’ ఎన్నేళ్లు గడిచినా ఆ పరిమళాన్ని పోగొట్టుకోదు.
 ‘కలలారని పసిపాప / తలవాల్చిన ఒడిలో
 తడినీడలు పడనీకే / ఈ దేవత గుడిలో’అని లేబ్రాయపు ప్రియురాలికి ఆయన చేరవేసిన ‘గీతాంజలి’ ఎన్నటికీ సుమదళ సుకుమారమే.

 ‘ఎన్నెల్లుతేవే/ ఎదమీటిపోవే’
 అంటూ ‘పంతులమ్మ’కు ఆయన శ్రుతి చేసిన పున్నాగపూల సన్నాయి సినీ సంగీత ప్రియుల వీనులకు విందు చేస్తూనే ఉంటుంది. అంతర్లీనంగా ‘వీణ వేణువైన మధురిమ’లా పల్లవిస్తూనే ఉంటుంది.
 ఆయనకే తెలిసిన ‘ఎడారి కోయిల’లు, ‘తెల్లారని రేయి’లు కోకొల్లలు. కడలి తరంగమంత జీవన విషాదాన్ని ‘బ్రతుకంటే మృతి కంటే చేదైన ఒక తీపి పాట...’ అంటూ సంక్షిప్తీకరించడం సుందరరామమూర్తి కంటే వేరెవరికి తెలుసు? ‘వేణువై వచ్చాను భువనానికి... గాలినై పోతాను గగనానికి’ అన్న జీవన క్రోడీకరణ ఆయనకే సాధ్యం.
 వెరసి ఒక గంధర్వ కవిత్వపు కుంచె భువిపై దిగి, 1936 నుండి 2010 దాకా 74 ఏళ్ల పాటు ‘వేదం’లా, ‘అణువణువున నాదం’లా, ‘పంచప్రాణాల నాట్యవినోదం’లా విలసిల్లి, ‘నిర్వాణ సోపానమధిరోహించి’ంది. అక్షరాలా అమృతమూర్తి వేటూరి సుందరరామమూర్తి.

(సందర్భం  May21- వేటూరి సుందరరామమూర్తి వర్ధంతి )

Monday, September 2, 2013

జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు

జననం : 7-7-1959,

జన్మస్థలం : విజయవాడ

తల్లిదండ్రులు : లక్ష్మీనరసమ్మ, సుబ్బారావు

చదువు : భాషాప్రవీణ, ఎం.ఏ. (తెలుగు)

భార్య : శేషుకుమారి

సంతానం : కవలలు (లక్ష్మీ సువర్ణ, లక్ష్మీ అన్నపూర్ణ), కుమారుడు (మాణిక్య తేజ)

తొలిచిత్రం-పాట : రౌడీపోలీసు (1987) -

ఇది వరమా శాపమా... ఇది నీకు న్యాయమా

ప్రస్తుత సినిమా-పాట : నిర్భయ భారతం (2013) - శుభము సుఖము సృష్టికి మూలము... శృంగారమే మోక్షము ధర్మశృంగారమే మోక్షము.

సినిమా పాటల్లో అనేక ప్రయోగాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకస్థానాన్ని ఏర్పరచుకున్నారు జొన్నవిత్తుల. ఇప్పటివరకు సుమారు 600 పాటలు రచించారు.

ఇతరవిషయాలు : 10 శతకాలు రచించారు. అవి శ్రీరామ లింగేశ్వర, బతుకమ్మ, తెలుగమ్మ, సింగరేణి, తెలుగుభాష, నైమిశ వెంకటేశ, రామబాణం, కూచిపూడి, రామప్ప, శ్రీరామలింగేశ్వర (ఆంగ్లం) శతకాలు. తెలుగుభాష గొప్పదనాన్ని చాటి చె పుతూ ‘తెలుగు శంఖారావం’ పేరుతో 56 తెలుగు గీతాలు రాశారు. సప్తస్వరాలను తీసుకొని దానితో పాటను రాసిన తొలి తెలుగుకవి. సప్తస్వరాలకు అర్థాలు ఉండవని చాలామంది అనుకుంటారు. కాని అవి కేవలం అక్షరాలు మాత్రమే కాదని స్వరాలకు కూడా అర్థాలు ఉంటాయని నిరూపించారు జొన్నవిత్తుల. స్వరాలను అర్థవంతంగా కూర్చి ఈ పాటను రూపొందించారు.

సరిగమపదని... ఈ ఏడు అక్షరాలను రాగం తప్పకుండా పదాలు తయారుచేయడం ఆషామాషీ విషయం కాదు. స్వరాలను పదాలుగా మార్చి భాషతో చెడుగుడు ఆడుకున్నారు ఈ పాటలో. ఉదాహరణకు... సాగనీ, పదమనీ, దాగనీ, నీ దానినీ, నిగనిగ, మానిని, దా మరి, సరిదానిని... వీటిని చూస్తే, పైకి స్వరాల కూర్పులాగే అనిపిస్తుంది. సరిగా అర్థం చేసుకుంటే అందులో దాగి ఉన్న పదం స్పష్టంగా అర్థం అవుతుంది. ఇది సినీ సంగీత సాహిత్యంలో సరికొత్త ప్రయోగం.

Sunday, December 2, 2012

నాకున్న వైకల్యం...నాలో కసి పెంచింది... అనంత్ శ్రీరామ్

కార్కుతో ఓపెన్ చేసి తాగేందుకు కాదు మార్కులు
ఫోర్కుతో పొడిచి తినడానికి పనికిరావు మార్కులు
స్పార్కు ఏదైనా ఎవరిలోనైనా ఉంటే దాన్ని గుర్తించడానికి ఉపయోగపడే స్కేలు మీద ఉండే మార్కింగులే మార్కులు.
అందుకే ప్రహ్లాదుళ్లా చదువుల్లోని సారాన్నే చదివారాయన.
తన మార్కు కనపడేలా కళారంగంలో కుదురుకున్నారు.
సోడాబుడ్డి కళ్లద్దాలంటూ ఎగతాళి చేశారు కొందరు ఫ్రెండ్స్.
కళ్లద్దాల మందం పెరుగుతుందంటే పవరూ పెరిగిందని కదా అర్థం.
అంటే తనకు పవరెక్కువని భాష్యం చెప్పుకున్నారాయన.
అక్షరాలు సాఫీగా సాగితే అది మాట.
మాట మెలికలు తిరిగితే అది పాట.
అవును... వైవిధ్యం ఎప్పుడూ వర్కవుటువుతుంది.
ఆ వైభవానికి సమాజం సాగిలపడుతుంది.
అనంత్ శ్రీరామ్‌లోని మెలికలు తిరిగిన అభిప్రాయాలను అక్షరాలా ఆవిష్కరించే అక్షరాలే ఆయనలోని ‘అదర్‌సైడ్’.


పాట రాయాలంటే మీకు ఉత్ప్రేరకంగా నిలిచేది ఏది? స్మోక్, డ్రింక్... చాలామంది రచయితలు అవి లేకుండా రాయరని అనుకుంటూ ఉంటారు?

అనంత్ శ్రీరామ్: మా తాతయ్య లాయరండీ. ఆయన తాగేవారట. ఆ కారణంగా మా కుటుంబం చాలా నష్టపోయిందని విన్నాను. అలాగే మా మేనమామ కూడా డ్రింక్ చేస్తారు. ఆయన్ను కూడా చాలాసార్లు గమనించాను. ఈ అనుభవాల వల్ల నాకు తెలిసిందేంటంటే. తాగిన మనిషి ఆ క్షణాల్లో విచక్షణను కోల్పోతాడు. అతను ఎంతటి ప్రజ్ఞావంతుడైనా తాగిన క్షణాల్లో అతని గొప్పనంతా సమాజం మరిచిపోతుంది. తిట్టడం మొదలుపెడుతుంది. అన్ని గొప్ప గుణాలను ఆభరణాలుగా చేసుకొని, కేవలం ఓ చిన్న దురలవాటు వల్ల సమాజానికి చులకన అవ్వడం అవసరమా? దాంతో మందునూ ఇతర ఏ వ్యసనాన్నీ దరి చేరనివ్వలేదు.

మరి పాట రాయడానికి కావలసిన మూడ్ కోసం ఏం చేస్తారు?

అనంత్ శ్రీరామ్: మంచి ఆలోచనల కోసం మొదట్లో పాట రాస్తున్నప్పుడు బబుల్‌గమ్ నమిలేవాణ్ని. అప్పుడెవరో శ్రేయోభిలాషులు చెప్పారు అది తింటే కేన్సర్ వస్తుందని. వెంటనే మానేశాను. అసలు ‘అలవాటు’ అనేది నెగిటీవ్‌దే ఎందుకు అయ్యుండాలి. పాజిటివ్ అలవాట్లను ఎందుకు అలవరచుకోకూడదు అనిపించింది. ఆ ఆలోచన రాగానే నాకు దొరికిన పరిష్కారం ‘మెడిటేషన్’. ఎప్పుడైనా ఒత్తిడి ఎక్కువైతే.. నాలుగైదు నిమిషాలు మెడిటేషన్ చేస్తా. అంతే ఒత్తిడంతా దూది పింజలా ఎగిరిపోతుంది. సిగెరెట్, మందు, పేకాటా వీటన్నింటికీ జనం అలవాటు పడేది కూడా ఒత్తిడి తగ్గించుకోడానికే. మెడిటేషన్ ద్వారా ఇప్పుడు అంతకంటే రిలాక్సేషన్, అంతకంటే కిక్కు నాకు దొరికింది. 

అసలు ఇంతటి సాహిత్యాభిలాష ఎలా అబ్బింది మీకు?

అనంత్ శ్రీరామ్: చిన్నప్పట్నుంచీ ఉందండీ. కారణం మా నాన్నగారే. ఆయన పద్యాలు బాగా పాడతారు. పద్యాలంటే... సంప్రదాయ పౌరాణిక పద్యాలు కాదు. జంధ్యాల పాపయ్యశాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ లాంటి వాళ్లు.. మన సంస్కృతి, సంప్రదాయాల గురించి, చరిత్ర ఔన్నిత్యం గురించి రాసిన పద్యాలవి. వాటిని ఆయన పాడుతూ ఉండేవారు. ఆస్వాదించే కొలదీ సాహితీ పరిమళాలు వాటినుంచి ఉద్భవిస్తూ ఉంటాయి. కాలక్రమంలో అవి నాపై చూపిన ప్రభావం అంతాఇంతా కాదు. 

మిమ్మల్ని బాగా ఇన్‌స్పైర్ చేసిన బుక్? 

అనంత్ శ్రీరామ్: ‘వేదం జీవన నాదం’. దాశరధి రంగాచార్య రాసిన బుక్ అది. ఆ పుస్తకం గురించి పూర్తిగా విపులీకరించలేను కానీ.. కొన్ని విషయాలు మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతం చాలామంది తమ టాయిలెట్స్‌లో వెస్ట్రన్ కమోడ్‌లనే వాడుతున్నారు. అది మన భారతీయ విధానానికి విరుద్ధం. మన విధానంలో విరేచనం సాఫీగా అవ్వడానికి ఇచ్చిన ఆసనం ఎంత గొప్పదో చెప్పారు. మన తొడలు పొట్ట కండరాలను నొక్కిపడుతాయ్. తద్వారా పొట్ట కండరాలు వ్యాకోచించి సుఖ విరేచనం అవుతుంది. ఈ విషయం తెలీక టాయిలెట్‌లలో వెస్ట్రన్ కమోడ్‌లకు అలవాటు పడిపోతున్నాం. వాటిలో టాయిలెట్‌కి వెళితే కిడ్నీలు త్వరగా పాడవుతాయి. మన సైన్స్ ఎంత గొప్పదంటే... మగవాళ్లతో గర్భం దాల్పించారు. భరద్వాజ మహర్షి చేసిన ప్రయోగమది. అయితే... అది ప్రకృతి విరుద్ధం కాబట్టి ఆ ప్రక్రియకు అప్పుడే స్వస్తి పలికారు. టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియ ఓ పాతికేళ్ల కిందట వచ్చింది. కానీ మన చరిత్రలో కౌరవులు ఎవరు? టెస్ట్ ట్యూబ్ బేబీలు కారా? విశ్చిన్నమైన పిండాన్ని భద్రపరచి కౌరవుల జన్మకు కారకుడవ్వలేదా వ్యాసుడు. అయితే... ప్రకృతి విరుద్ధంగా పుట్టారు కాబట్టి కౌరవులు దుర్మార్గులయ్యారు. అందుకే ఆ ప్రక్రియకు అప్పుడే మంగళం పలికారు మనవాళ్లు. విజ్ఞానం అసలు ఎప్పుడు పుట్టింది? ఎలా అభివృద్ధి చెందింది? భారతీయ విజ్ఞానం ఎంతగొప్పది? ఈ విశేషాలన్నీ ‘వేదం జీవన నాదం’ పుస్తకంలో ఉంటాయ్. అలాగే గీత రచయితగా జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి పద్యాలు నాకు ఇన్‌స్పిరేషన్ అని చెప్పొచ్చు. 

అసలు మీరేం చదివారు?

అనంత్ శ్రీరామ్: ఇంజనీరింగ్ డిస్‌కంటిన్యూ చేశాను. 

ఎందుకు?

అనంత్ శ్రీరామ్: ఇష్టం లేదు. మన విద్యావ్యవస్థ పరమ అసమర్థమైన వ్యవస్థ. ముఖ్యంగా మన రాష్ట్ర విద్యావ్యవస్థ. మరొక్కసారి చెబుతున్నాను వినండి.. మన రాష్ట్ర విద్యావ్యవస్థ పరమ అసమర్థమైన, స్వార్థపూరితమైనది. 

ఎందుకంత ఆవేశం?

అనంత్ శ్రీరామ్: మార్కులకు తప్ప మనసులకు విలువివ్వని విద్యావిధానాలు. విజయాలకు తప్ప విజ్ఞతలకు విలువివ్వని విద్యాసంస్థలు మన విద్యా వ్యవస్థను నడిపిస్తున్నాయి. అందుకే అంత ఆవేశం. 

మీ ఆవేశానికి కారణం వివరంగా చెబుతారా?

అనంత్ శ్రీరామ్: తప్పకుండా... ముందు నాకు టెన్త్ క్లాస్‌లో జరిగిన కొన్ని అనుభవాలు చెబుతాను. హిందీ సబ్జెక్ట్‌కి వచ్చేసరికి ‘వీజీఎస్’ అని ఓ గైడ్ ఉండేది. దాన్నే ఎక్కువ మంది విద్యార్థులు చదివేవారు. అధ్యాపకులు కూడా విద్యార్థులకు ఆ గైడ్‌నే సూచించేవారు. నాకు మాత్రం హిందీ గైడ్ ‘సుకుమార్’ బాగా నచ్చింది. అందుకే ఆ గైడ్‌ని అనుసరించి పరీక్షలు రాశాను. అయితే... నాకు హిందీలో 42 మార్కులే వచ్చాయి. మిగతా సబ్జెక్టుల్లో మాత్రం 85కి పైగానే వచ్చాయి. దీంతో నాకు స్కూల్ ఫస్ట్ పోయింది. దాంతో రీ వాల్యుయేషన్ కోసం పోరాడాను. చివరికి రీ కౌంటింగ్ పెట్టారు. దాంట్లో కేవలం బిట్ పేపర్‌కే 25కి 24 మార్కులొచ్చాయి. కొశ్చన్ పేపర్‌కి మాత్రం 18 మార్కులే వేశారు. నాకు జరిగిన అన్యాయంపై వాళ్లను నిలదీస్తే... వాళ్లు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? (ఆ గైడ్‌లో నేను చదివిన) సమాధానాలు చిన్నవిగా ఉన్నాయట. నా అక్షరాలే చిన్నవిగా ఉంటాయి. అది నా పాపమా. సమాధానాలు సరైనవా? కావా? అని మాత్రమే వాళ్లు చూడాలి. కానీ సమాధానాలు జానాబెత్తలతో కొలిచి 42 మార్కులు ఇచ్చారు. ఇంత కష్టపడి చదివిన తర్వాత కూడా నాకు రావాల్సిన మార్కులు రాకుండా చేసిన ఈ విద్యావ్యవస్థను నేనెందుకు గౌరవించాలి. ఇంటర్ నేను ‘గీతాంజలి రెసిడెన్షియల్ కాలేజ్’లో చదివాను. వారానికి ఓ పరీక్ష పెట్టేవారు. వారం వారం పరీక్షలంటే... ఏదో ఒకవారం ఎవడికో ఒకడికి ఒంట్లో బావుండదు. ఆ ఒంట్లో బాగుండని వాడికి తక్కువ మార్కులొస్తే.. వాడ్ని అందరి ముందు అవమానంగా మాట్లాడేవారు. చివరకు విద్యార్థులు కూడా ఈ విధానానికి ప్రభావితం అయిపోయారు. మార్కులు తినేద్దాం, మార్కుల్ని తాగేద్దాం అన్నట్టుగా వుండేది ఇలా కడలిలాంటి ఆ కళాశాలలో ఓ కొబ్బరి తెడ్డులా సంస్కృతం మాస్టారు కోటేశ్వరరావుగారు కనిపించారు. ఆయన మాత్రం నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు. అందరూ స్కోరింగ్ కోసం సాంస్క్రిట్ తీసుకునేవారు. నేను మాత్రం ప్రేమించి తీసుకున్నాను. మాస్టారు చెప్పే కాళిదాసు కవితలు, ‘సుధీక్షణాదేవి చూపులతోనే తాగింది’ అనే భావాలు నాలో భావుకతను పెంచాయి.

ఇంజనీరింగ్‌లో ఏం జరిగింది?.... 

అనంత్ శ్రీరామ్: ఇంజనీరింగ్ కాలేజ్‌లో మన ఆసక్తితో ఎవరికీ పనిలేదు. దేనికి డబ్బొస్తే దానికే విలువ. వాళ్ల దృష్టిలో గొప్ప పెళ్లికొడుకు, గొప్ప పెళ్లి కూతురు ఎవరంటే... ఎంబీబీఎస్, బీటెక్ చేసిన వాళ్లే. అలా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు. పైగా కళలు కూడు పెడతాయా? అని ఎప్పటికప్పుడు నిరుత్సాహానికి గురిచేసేవారు. అప్పుడే నాకు కసి పెరిగింది. ‘ర్యాంకులు మీకు గొప్పేమో... కళ నాకు గొప్ప’ అని అప్పుడే వారితో వాదించాను. ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు ఉపయోగపడదని నిర్ణయించుకున్నాను. కళలు మనిషిని మహనీయుడ్ని చేస్తాయని నిరూపించాలనుకున్నాను. 

మరిప్పుడు గేయరచయితగా మీరు ఓ మంచి హోదాలో ఉన్నారు. అప్పుడు మిమ్మల్ని రగిలించిన వాళ్ళెవరైనా మీకు తారసపడటం జరిగిందా?

అనంత్ శ్రీరామ్: అప్పుడు మాకు పాఠాలు చెప్పిన ఏ ఉపాధ్యాయులు ఇప్పుడు అక్కడ లేరు. ఎక్కడెక్కడ ఉన్నారో నాకే తెలీదు. అసలు మనల్ని పట్టించుకునే టైమ్ కూడా వాళ్లకు ఉండదు. ఇదంతా నా ఆత్మసంతృప్తికోసం చెబుతున్న విషయాలే. 

మరి మీ ఫ్రెండ్స్ కలుస్తుంటారా?

అనంత్ శ్రీరామ్: కాలేజ్ టైమ్‌లో వంశీ, వరుణ్, ప్రియాంక నా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్లందరూ అమెరికాలో ఉన్నా ఇప్పటికీ వారిని నేను వదిలిపెట్టలేదు. ఎప్పటికప్పుడు వారి యోగక్షేమాలను కనుక్కుంటూనే ఉంటాను. 

ఇటీవలే మీ పెళ్లయింది. జీవితం ఎలా ఉంది?

అనంత్ శ్రీరామ్: మొదట అసలు పెళ్లంటేనే భయపడేవాడ్ని. ఇంట్లో వాళ్లు చూస్తామన్నా వద్దనేసేవాడ్ని. అమ్మానాన్న మా ఊళ్లో ఉంటారు. ఇక్కడ మొన్నటిదాకా నేనొక్కడ్నే. హోటల్‌లో భోంచేసేవాడ్ని. దానికి తోడు ఇంటి అద్దె. ఖర్చు చాలా ఎక్కువ అయ్యేది. ‘తను దూర సందు లేదు. మెడకో డోలు’ అన్న చందాన, భార్య కూడా వస్తే ఇక ఆ భారం భరించడం కష్టం అని ముందు వద్దన్నాను. కానీ ఆమె వచ్చాక తెలిసింది నా అభిప్రాయం తప్పని. ఇప్పుడు నా ఖర్చులు 30 శాతం తగ్గిపోయాయి. ఇంటి భోజనం వల్ల డబ్బు చాలా ఆదా అవుతోంది. పైగా టైమ్ ప్రకారం భోజనం చేస్తుండటంతో నా ఆరోగ్యం కూడా బలపడింది. గతం కంటే వేగంగా పాటలు రాయగలుగుతున్నాను. 

దీన్ని బట్టి మీరు చాలా పొదుపరి అన్నమాట?

అనంత్ శ్రీరామ్: అలాంటిదేం లేదండీ... అవసరానికి తగ్గట్టు ఖర్చు కచ్ఛితంగా ఉంటుంది. 

మీ భార్యాభర్తల్లో ఎవరి డామినేషన్ ఎక్కువ? 

అనంత్ శ్రీరామ్: ఇంటి వరకు అయితే... ఆమే రాణి. అయితే.. నా వృత్తి విషయాల్లో మాత్రం అస్సలు జోక్యం చేసుకోదు. నేనూ అంతే... ఇంటి వ్యవహారాలన్నీ ఆమెకే వదిలేస్తా.

ఎంత కట్నం తీసుకున్నారూ? 

అనంత్ శ్రీరామ్: (నవ్వుతూ) అనవసరంగా అబద్ధాలాడటం నాకు ఇష్టం ఉండదండీ. నేను కట్నం తీసుకోలేదు. ఇది పచ్చినిజం. అసలు నా దృష్టిలో కట్నం తీసుకోవడం దుర్మార్గం. తమ కూతురికి వాళ్లు ఎంతిచ్చినా తప్పుకాదు. అయితే... మా అబ్బాయి అంత చదివాడు, ఇంత చదివాడు. ఇన్ని లక్షలిస్తే తప్ప మీ అమ్మాయిని చేసుకోం అనడం తప్పు అంటున్నాను. 

కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలని ఎందుకనిపించింది?

అనంత్ శ్రీరామ్: కట్నం తీసుకోవడం... వ్యభిచారం చేయడం నా దృష్టిలో ఒక్కటే. అందుకే తీసుకోలేదు. కట్నం తీసుకొని డాబుగా తిరిగే పెళ్లి కొడుకుల్ని నేను చాలామందిని చూశాను. ఒక జీవితాన్ని ఇద్దరు కలిసి పంచుకోవడమే పెళ్లి. మగాడి శక్తిసామర్థ్యాలు సంపాదనలో కనిపిస్తాయి. ఆడదాని శక్తి ఇంటిని చక్కదిద్దుకోవడంలో కనిపిస్తుంది. ఇలా రెండు బాధ్యతలను ఇద్దరూ సమానంగా పంచుకుంటున్నప్పుడు పర్టిక్యులర్‌గా అబ్బాయే ఎందుకు డబ్బులు తీసుకోవాలి? అనే ప్రశ్న తలెత్తింది. అందుకే ఆస్థిపాస్థుల గురించి పట్టించుకోకుండా, పెళ్లి ఖర్చు కూడా నేనే భరించి, నా భార్యను తెచ్చుకున్నాను.

మీ శ్రీమతికి మీరు రాసిన పాటల్లో ఏ పాటంటే ఇష్టం?

అనంత్ శ్రీరామ్: ఆమెకు ఫిమేల్ సోలోసాంగ్స్ అంటే ఇష్టం. ‘మిస్టర్‌పర్‌ఫెక్ట్‌లో ‘చలిచలిగా అల్లింది...’ పాటను బాగా ఎంజాయ్ చేస్తుంది. రీసెంట్‌గా ‘జీనియస్’ అనే సినిమాలో ఓ పాట రాశాను. ‘ఏవేవో కలలు...’ అనే పల్లవితో ఆ పాట సాగుతుంది. ఆ పాట కూడా ఆమెకు బాగా ఇష్టం. ‘అసలు అమ్మాయిల మనసులో భావాలు మీకెలా తెలుస్తాయి?’ అని అడుగుతుంటుంది నన్ను. 

అదే ప్రశ్న నేనూ అడుగుతున్నాను చెప్పండి?

అనంత్ శ్రీరామ్: దానికి కారణం ఏంటంటే... నా కాలేజ్ టైమ్‌లో నా ఫ్రెండ్సందరూ లవర్సే. ఈ కారణంగా వాళ్లు ప్రేమించే అమ్మాయిలు కూడా నాకు ఫ్రెండ్స్ అయిపోయేవారు. ఆ అమ్మాయిలతో గడిపిన క్షణాలు ఫ్రెండ్స్ నాతో పంచుకునేవాళ్లు. అలాగే నా ఫ్రెండ్స్‌తో గడిపిన క్షణాలు ఆ అమ్మాయిలూ నాతో పంచుకునేవారు. నేనేమో న్యూట్రల్ పర్సన్‌లా ఉండేవాడ్ని. ఈ కారణంగా ప్రేమ గురించి వారికంటే నాకే ఎక్కువ అవగాహన పెరిగేది. ముఖ్యంగా అమ్మాయిల మనోభావాలు మాత్రం చాలా సున్నితంగా అనిపించేవి. ప్రేమ విషయంలో నేను గమనించిన గమ్మత్తు ఏంటంటే... అబ్బాయ్ అగ్రెసివ్ అయితే... అమ్మాయి సాఫ్ట్‌గా అనిపించేది. అబ్బాయ్ సాఫ్ట్ అయితే.. అమ్మాయి వాగుడుకాయ్ అయ్యుండేది. అబ్బాయి చాలా అందగాడైతే... అమ్మాయి ఓ మాదిరి అందగత్తె అయ్యుండేది. ఇలా వ్యతిరేక లక్షణాలున్న వారే జంటగా మారడం నేను గమనించాను. కలవని తీరైనా.. తలపులు వేరైనా.. పరిచయం బలపడిపోతుంది. ఆ మేజిక్ ఏంటో ఎవరికీ అర్థం కాదు... అదే ‘ప్రేమ’ అని నేను గ్రహించాను. నేనే గనుక ప్రేమిస్తే ఒకే అనుభవంతో సరి పెట్టుకోవలసివచ్చేది. అయిదారు ప్రేమకథలు చూశా కదా... అందుకనే ఇంత అవగాహన. 

నిజంగా మీరెవర్నీ ప్రేమించలేదా?

అనంత్ శ్రీరామ్: నా మొహం చూసి ఏ అమ్మాయి లవ్ చేస్తుందండీ. అమ్మాయిలు డైనమిక్‌గా ఉండేవాళ్లనే ఇష్టపడతారు. కాగితాలపై పాటలు రాసుకుంటూ తిరిగే నాలాంటివాణ్ని వాళ్లు లైక్ చేయరు. 

మీకు సైట్ ఎప్పట్నుంచి ఉంది?

అనంత్ శ్రీరామ్: బై బర్త్. నా మూడు నెలల వయసులో కుడి కన్నుకూ తొమ్మిదో నెలలో ఎడమ కన్నుకూ ఆపరేషన్లు జరిగాయి. 

మూడో నెలలో సైట్ అన్న విషయం ఎలా కనిపెట్టారు..? 

అనంత్ శ్రీరామ్: కళ్లు తేడాగా కదుపుతుంటే... వాళ్లకు అనుమానం వచ్చిందంట. 

ఈ సమస్య వల్ల మీరెప్పుడైనా ఇబ్బంది పడ్డారా?

అనంత్ శ్రీరామ్: శారీరక సమస్య ఉన్నవాళ్లు దురదృష్టవంతులు అంటుంటారు. నేను ఇంజనీరింగ్‌లో ఉన్నప్పుడు బ్లాక్‌బోర్డ్‌పై రాసే అక్షరాలు కనిపించేవి కావు. ‘సార్...నాకు రెండు కళ్లు కాస్త తేడా అండీ... ఎడమ కన్నుకు లేట్‌గా ఆపరేషన్ చేయడం వల్ల ఆ కంటితో చూడ్డం కష్టం అవుతుంది. కుడి కంటితో బాగా చూడగలను. కుడి నుంచి ఎడమకు కళ్లు తిప్పుతుంటే... బాధగా ఉంది. మేటర్‌ని బోర్డ్ మధ్యలో రాస్తారా’ అని అధ్యాపకుడ్ని బతిమాలితే... ఓ రెండుసార్లు నాకోసం రాశాడు. తర్వాత కుదరదని ఖరాకండీగా చెప్పేశాడు. చాలా బాధ అనిపించింది. ఫిజికల్‌గా నేను మైనస్ అన్న సంగతిని మరిచిపోయి, సైకలాజికల్‌గా నేనెక్కడ స్ట్రాంగో గ్రహించి ముందుకు సాగాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. 

చిన్నప్పుడు ఎవరైనా మీ కళ్లు చూసి ఎగతాళి చేసేవారా?

అనంత్ శ్రీరామ్: చాలామంది. ‘సోడాబుడ్డి అద్దాలు’ అని హేళన చేసేవారు. ఎవరు ఎన్ని అవమానాలు చేసినా పట్టించుకొనేవాడ్ని కాదు. ఎందుకంటే నాకు ఏడవడం అలవాటు లేదు. కన్నీళ్లు చాలా విలువైనవని నా అభిప్రాయం. నాలో కసి రేకెత్తించడానికి నాకున్న వైకల్యం కూడా ఒక కారణం అయ్యింది. అందుకే దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. 

మరి మీ ఆవిడ ఎలా ఫీలవుతారు?

అనంత్ శ్రీరామ్: నేను పెళ్లప్పుడే వాళ్ల ఫ్యామిలీ మొత్తానికి చెప్పాను. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం కరెక్ట్ కదా. 

ఏ గేమ్స్ అంటే ఇష్టం?

అనంత్ శ్రీరామ్: క్రికెట్. నేను మంచి బౌలర్‌ని, బ్యాటింగ్ అయితే రాదు. 

మీరు శాకాహారా? మాంసాహారా?

అనంత్ శ్రీరామ్: మా ఇంట్లో అందరూ మాంసాహారులే. నేను శాకాహారిని. చిన్నప్పుడు పెట్టడానికి ట్రై చేశారట. కానీ నా శరీరానికి అది పడేది కాదు. 

ఇన్ని అనుభవాలు చవిచూసిన అనంతశ్రీరామ్ లక్ష్యం ఏంటి?

అనంత్ శ్రీరామ్: నేను కళను శ్వాసిస్తానండీ.. నా లక్ష్యం కళాకారునిగా ఎదగడమే. ఇప్పటికీ నేను పూర్తి స్థాయి గేయరచయిత అయ్యానని భావించడం లేదు. ఎప్పుడైతే నా పాట ఎదుటివారిలో మార్పు తెచ్చిందో అప్పుడే నేను గీత రచయితగా ఎదిగినట్లు. నా లక్ష్యం కూడా అదే.
సంభాషణ: బుర్రా నరసింహ

కట్నం తీసుకోవడం... వ్యభిచారం చేయడం నా దృష్టిలో ఒక్కటే. అందుకే తీసుకోలేదు. ఒక జీవితాన్ని ఇద్దరు కలిసి పంచుకోవడమే పెళ్లి. మగాడి శక్తిసామర్థ్యాలు సంపాదనలో కనిపిస్తాయి... ఆడదాని శక్తి ఇంటిని చక్కదిద్దుకోవడంలో కనిపిస్తుంది. ఇలా రెండు బాధ్యతలను ఇద్దరూ సమానంగా పంచుకుంటున్నప్పుడు పర్టిక్యులర్‌గా అబ్బాయే ఎందుకు డబ్బులు తీసుకోవాలి? అనే ప్రశ్న తలెత్తింది. అందుకే ఆస్థిపాస్థుల గురించి పట్టించుకోకుండా, పెళ్లి ఖర్చు కూడా నేనే భరించి, నా భార్యను తెచ్చుకున్నాను. 
courtesy-www.sakshi.com

Monday, October 29, 2012

కొసరాజు రాఘవయ్య చౌదరి


పూర్తిపేరు : కొసరాజు రాఘవయ్య చౌదరి

జననం : 23-06-1905,

జన్మస్థలం : గుంటూరు జిల్లా బాపట్ల తాలుకా చింతాయపాలెం గ్రామం

తల్లిదండ్రులు : లక్ష్మీదేవమ్మ, సుబ్బయ్య

తోబుట్టువులు : అక్క (వెంకట గిరమ్మ), చెల్లెలు (అరవిందం)

భార్య : సీతారామమ్మ,సంతానం : కుమారుడు భానుప్రసాద్

తొలిచిత్రం-పాట : రైతుబిడ్డ (1939) - నిద్ర మేల్కొనరా తమ్ముడా...,
ఆఖరిచిత్రం - పాట : గురుబ్రహ్మ (1982) - వినరా ఆంధ్రకుమారా (బుర్రకథ),
పాటలు : 800కు పైగా,

ఇతరవిషయాలు : కొసరాజు చింతాయపాలెంలో పుట్టినా పెరిగిందంతా అప్పికట్ల గ్రామం. అక్కడ కొండముది నరసింహం పంతులు దగ్గర వ్యవసాయపు పనులు చేస్తూ ఆయన గురుకులంలో విద్యనభ్యసించారు. 1925-27 మధ్యకాలంలో ‘దేశాభిమాని’ పత్రికలో పనిచేశారు. 1931లో కర్షకోద్యమం ప్రారంభమైన సందర్భంగా తిరుత్తణి ప్రాంత రైతులను ఉత్తేజపరచడానికి ‘కడగండ్లు’ అనే గేయాలు రాశారు. 1932 ఆంధ్రప్రాంతం తుపానుకు గురైనపుడు, 1936లో తిరుత్తణిలో రైతుల సభ జరిగినపుడు రైతుల పక్షాన నిలబడి అందరిలో చైతన్యాన్ని కలిగించారు. ఆ సందర్భంగా అప్పటి పార్లమెంట్ స్పీకరు అనంతశయనం అయ్యంగార్ కొసరాజును ‘కవిరత్న’ బిరుదుతో సత్కరించారు. 1968లో ‘జానపద కవి సార్వభౌమ’, 1984లో రఘుపతి వెంకయ్య అవార్డు, 1985లో ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ... ఇలా ఎన్నో సత్కారాలను, పురస్కారాలను అందుకున్నారు.
కొసరాజు ముని మనమరాలైన కొసరాజు నయనతార ఈ మధ్యనే అన్నమయ్య కీర్తనలు ఆలపించి వాటిని సీడీ రూపంలో విడుదల చేశారు. కొసరాజు అన్ని రకాల పాటలను రాసినా... సంగీతాభిమానులకు మాత్రం జానపద గేయరచయితగానే గుర్తుండిపోయారు.

మరణం : 27-10-1986

Monday, October 22, 2012

బండారు దానయ్యకవి


కలం అందరూ పట్టగలరు.
అయితే పట్టినవారందరూ కవులు కాలేదు.
కానీ దానయ్య అయ్యారు.
ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి, పేదరికంలో పెరిగి, కసితో కలం పట్టిన ఆయన కవితలు రాశారు. రెండు వందలకు పైగా సినిమా పాటలు రాశారు. కానీ ఇప్పటికీ తగిన గుర్తింపు కోసం తపన పడుతూనే ఉన్నారు. తన ఒడిదుడుకుల ప్రస్థానం గురించి బండారు దానయ్యకవి చెప్పిన మాటలు... 


పేరులోనే కవి అని పెట్టుకున్నారెందుకు?
నేను రాసిన ‘సిగ్గు-లజ్జ’ కవితా సంకలనానికి మా గురువుగారు వేటూరి ముందు మాట రాశారు. అందులో ఆయన నన్ను ’కవి’ అని సంబోధించారు. అందుకే నా పేరులో కవిని చేర్చుకున్నాను.
మీరు వేటూరి శిష్యులా?

ఏకలవ్య శిష్యుణ్ని. చిన్నప్పట్నుంచీ ఎన్ని పాటలు విన్నా, వేటూరిగారు రాసిన పాటలే నచ్చేవి. ఆయన సాహిత్యం పట్ల విపరీతంగా పెరిగిన ఇష్టమే నేను పాటల రచయితను కావడానికి కారణం.

మీ బ్యాగ్రౌండ్ ఏమిటి? కలమెప్పుడు పట్టారు?
మాది నల్లగొండ జిల్లా. మా అమ్మగారిది ఎల్లారెడ్డిగూడెం, నాన్నగారిది కీతవారి గూడెం. పెరిగిందంతా అమ్మ వాళ్ల ఊరిలోనే. బాగా అల్లరి చేసేవాణ్ని. నా ఆలోచనలు రాసి కవితలంటూ స్కూల్లో ఫ్రెండ్స్‌కి ఇచ్చేవాడిని. టీచర్లు తిట్టేవారు. కానీ మా తెలుగు మాస్టారు ఆచార్య నరసింహాచారి నన్ను ప్రోత్సహించి, వ్యాస రచన పోటీలకు పంపించేవారు. జిల్లా స్థాయిలో ప్రైజులు కూడా గెలుచు కున్నాను. పాటలు రాసి స్టేజీల మీద పాడే వాడిని. ఇంటర్ అయ్యాక నేను రాసిన ‘గృహ హత్యలు’ నాటకం రేడియోలో కూడా ప్రసారమయ్యింది.

సినిమాలకు రాయాలని ఎందుకనుకున్నారు?
మా నాన్న కూలిపని చేసేవారు. వచ్చిన కాస్తంత డబ్బుతోనే మమ్మల్ని పోషించే వారు. కానీ బంధువులు, స్నేహితులు మా పేదరికాన్ని అవహేళన చేసేవారు. పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెళ్లినా అమ్మానాన్నలు ఓ మూల నిలబడటం నన్ను చాలా బాధించేది. ఆ బాధలోంచే డబ్బు సంపాదించాలన్న కసి పుట్టింది. ఏదో ఒకరోజు నా ఇంటికి ఇన్ కమ్‌ట్యాక్స్ వాళ్లు, మీడియా రావాలి, ఆ స్థాయికి నేనెదగాలి అనుకున్నాను. దానికి సినిమాలు మంచి మార్గమని తోచడంతో డిగ్రీ అవ్వగానే హైదరాబాద్ వచ్చేశాను.

అవకాశం త్వరగానే వచ్చిందా?
లేదు. రెండేళ్లు పిచ్చిగా తిరిగాను. ఫలితం లేకపోవడంతో ఎమ్మే చేస్తూ ప్రయత్నాలు సాగించాను. ఓసారి రామానాయుడు స్టూడియోకి వెళ్తే, ఓ చెట్టుకింద కారులో వేటూరి కూర్చుని ఉన్నారు. పట్టలేని ఉద్వేగంతో వెళ్లి, ఆయన స్ఫూర్తితోనే రచయితను కావాలనుకుంట న్నానని చెప్పాను. తనను కలవడం వల్ల ఉపయోగం లేదని, ఓ దర్శకుడి దగ్గరకు పంపారు. అక్కడ అవకాశం దొరకలేదు కానీ, నా గురువు, దైవం వేటూరి ఇచ్చిన ప్రోత్సాహం నాలో ధైర్యాన్ని నింపింది.

మరి తొలిపాట ఎప్పుడు రాశారు?
ఓసారి ఒక ఆఫీసుకు వెళ్తే అక్కడ వెలి గొండ శ్రీనివాస్ ఉన్నారు. నా పాట విని వెంటనే ఒక నిర్మాతకు ఫోన్ చేసి చెప్పారు. దాంతో ‘నువ్వుంటే చాలు’కి రాసే చాన్‌‌స వచ్చింది. తర్వాత ‘వియ్యాలవారి కయ్యాలు’కి రాశాను. అప్పడో విచిత్రం జరిగింది. ‘సూర్యుడే సరే అన్నాడే’ పాటకు రెండు వెర్షన్స్ రాసిచ్చాను. నా పాట సెలెక్ట య్యింది. కానీ ఆ పాట పల్లవి మాత్రమే నాది, చరణాలు వేటూరి గారివి. ఆయన కూడా పాట రాశారట. కానీ నా పల్లవి బాగుందని అదే ఉంచమన్నారట. ‘పాటకు తన పేరే వేయండి, పల్లవే కదా పాటకు మకుటం’ అన్నారట. అంత గొప్పవారు! నాకైతే ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయి.

ఇంతవరకూ ఎన్ని పాటలు రాశారు?
రెండు వందలకు పైనే రాశాను. ఎవడిగోల వాడిదే, మహానంది, విక్రమార్కుడు, దొంగోడు, వీర, ఢమరుకం... ఇలా. ప్రస్తుతం కెవ్వు-కేక, దేవదాసు స్టైల్ మార్చాడు, ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలకు పని చేస్తున్నాను.

మీకు తగిన గుర్తింపు వచ్చిందంటారా?
లేదనే చెప్పాలి. అవకాశాలు బాగున్నా గుర్తింపు అంతగా రాలేదు. మెల్లగా వస్తుందేమో మరి. బస్సు లోనో, రైల్లోనో ప్రయాణించేవారు త్వరగా గమ్యం చేరు కుంటారు. కాలినడకన వెళ్లేవారు కాస్త ఆలస్యంగా చేరుకుంటారు. నేను కాలి నడకన వెళ్తున్నాను. కాని ఆలస్యమైనా గమ్యం చేరుకునే తీరతాను.

మీ తెలుగుతల్లి ఫౌండేషన్ గురించి చెప్పండి?
తెలుగు భాషను కాపాడాలి, తెలుగువారి మధ్య సయోధ్యను కుదర్చాలి అన్న ఉద్దే శంతో ఈ ఫౌండేషన్‌ను స్థాపించాను. దీని ద్వారా సేవా కార్యక్రమాల్ని కూడా చేస్తు న్నాను. నెలకు రెండుసార్లు అనాథాశ్ర మాలకు వెళ్లి ఆహారం, దుస్తులు ఇస్తుం టాను. మా జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను పోగొట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నాను.

భవిష్యత్ ప్రణాళికలు?
నా ఫౌండేషన్ సేవల్ని విస్తరించాలి. గొప్ప పాటలు రాయాలి. ప్రస్తుతం బతకాలి కాబట్టి రాస్తున్నాను కానీ తృప్తి లేదు. మంచి కాలం వస్తుంది. తెలుగు సినిమాలో సాహిత్యపు విలువ పెరుగుతుంది. ఆ రోజుకోసం ఎదురు చూస్తున్నాను.