పొడుస్తున్న పొద్దుమీద: మలి తెలంగాణ ఉద్యమంలో సకల జనులనూ ఉప్పొంగించిన ఉద్యమగీతం ఇది. మా పాలన మాకేనని సగర్వంగా చెబుతూనే, విడిపోయి కలిసుందాం అన్న సందేశాన్ని కవితాత్మకంగా మోసుకెళ్లి, పువ్వులు పుప్పొడిలా విప్లవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని రంగరించిన చలనశీల గీతం ఇది.
కందుకూరి రమేష్ బాబు
తెలంగాణ ఉద్యమం మళ్లీ మొదలైన తరుణంలో భువనగిరిలో జరిగిన (1996)సదస్సుకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ సభ తిరిగి ప్రజాస్వామిక ఆకాంక్షలతో కూడిన తెలంగాణ కోసం ప్రభావశీలమైన ప్రయత్నం చేసింది. అనంతరం వరంగల్ సదస్సు. ఈ రెండు సదస్సుల్లోనూ గద్దర్ పాటలు విప్లవ సందేశాన్ని ఇస్తూనే సిసలైన తెలంగాణ వారసత్వ పోరు గీతికలను రచించేలా చేశాయి. అందులో అమ్మా తెలంగాణమా&ఆకలి కేకల గానమా ఒకటి. ఇది భువనగరి సదస్సుకు హైదరాబాద్ నుంచి గద్దర్ వస్తూ వస్తూ రాశిండు.
దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నట్టు ఇందులో కవి గద్దర్ అంతటి తెలంగాణ వర్తమానంలో ఆకలి కేకల గానాన్ని వినిపించే దుస్థితికి వచ్చిన వైనాన్ని ఆలపిస్తడు. మరొకటి దగాపడ్డ మా తెలంగాణమా& అన్న పాట. అది ఇంకోసారి రాశిండు. ఇందులో తీరొక్క రీతుల్లా మన వైభవం దెబ్బతిన్న రీతిని కళ్లకు కడతాడు. ఈ రెండే కాక నిర్దిష్టంగా తెలంగాణ అంశం చుట్టూ గద్దర్ మరి కొన్ని పాటలు రాసినప్పటికీ 2011లో తెలంగాణ ఉద్యమం ఉధతిమీద ఉండగా ఎత్తుకున్న పాట పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా... అశేష ప్రజారాశులకు ఉద్యమ ఆలాపం అయింది. పాట వినబడంగనే శిశువు నుంచి ముసలి వరకూ ఆడిపాడే స్థాయికి తెచ్చింది. చిత్రమేమిటంటే, ఇది శంకర్ దర్శకత్వంలో వచ్చిన జైబోలో తెలంగాణ అన్న సినిమాకోసం రాసిన పాట. దీని చిత్రీకరణ కూడా కేవలం ఒక్క రోజులోనే పూర్తవడమూ విశేషమే.
2011లో ఈ సినిమా విడుదలైంది మొదలు ఇప్పటికీ ఈ పాట ప్రజలకు గొప్ప ఊపునిస్తది. యూ ట్యూబ్‌లో బహుళ ఆదరణ పొందిన పాటల్లో ఇది నంబర్ వన్ అంటే అతిశయోక్తి కాదు. 5 నిమిషాల 51 సెకండ్లు నిడివిగల ఈ పాట నిజానికి ఉద్యమ గీతమైనప్పటికీ ప్రభుత్వం నంది పురస్కారం ప్రకటించడం అంటే అప్పటికే పాలకులు తెలంగాణ ఏర్పాటు ఇక అనివార్యమే అని గుర్తించినట్టయింది. పొడుస్తున్న పొద్దును అంగీకరించినట్లే అయింది.
చాలా సరళమైన పదాలు, చిన్న చిన్న మాటలతో, గతంలో గద్దర్ పాటలో వినని సరికొత్త డిక్షన్‌తో కూడిన ఈ పాట భలె భలె&అంటూనే తెలంగాణ నడిచి వచ్చిన సంక్షిష్టమైన దారులను తెలియజెబుతుంది. త్యాగాలను కీర్తిస్తుంది. ఒక కొత్త పొడుపు కోసం, ప్రజలంతా ఎదిరిచూస్తున్న నూతన ఉషోదయం కోసం అన్నట్టు ప్రారంభమై మహోత్తేజాన్ని కలిగిస్తూ ఆర్ద్రంగా ముగుస్తుంది. ఒక కొత్త కాలం సాకారమైన వేళ పాట మహత్మ్యం గురించి స్వయంగా గద్దర్ చెప్పేదీ వినవలసిందే!
తానంటాడు, తెలంగాణ సాధనలో అవకాశవాద ఎన్నికల ఎత్తుగడ ఉంది. అదే సమయంలో ఉద్యమ ఎత్తుగడలూ ఉన్నయని! ఈ రెంటి వల్ల వచ్చిందే ఇవ్వాళ్టి తెలంగాణ. అయితే, తనది ఏ పంథానో అందరికీ తెలిసిందే. అందుకే యుద్ధానికి వెళ్లేముందు శంఖం ఉదుతామే! అట్లాంటి విప్లవశంఖం ఈ పాట- అనడం అతిశయోక్తి కాదు. దర్శకుడు శంకర్ ఈ పాటలో నాలుగైదు లైన్లు తొలగించాడుగానీ, అందులో అడవితల్లి గుండెలోన రగల్‌జెండ రాగమా.. సింగరేణి గనుల్లో పేలుతున్న శబ్దమా.. అని కూడా ఉంటుంది. ఇట్లా ఈ పాట తనదైన జెండాను, ఎజెండానూ సమున్నతంగా నిలుపుతూనే ఉంది.
పాట ప్రారంభంలోనే& అదిగో ఆ కొండల నడుమ తొంగి చూసే ఎర్రని భగవంతుడెవరు? అని ప్రశ్నిస్తాడు గద్దర్. విప్లవ శక్తులని సూర్యుడితో పోలుస్తూ, పొడుస్తున్న పొద్దుతో కాలం నడుస్తున్న వైనాన్ని చెబుతూ, ప్రజా చేతననీ, విప్లవోన్ముఖమైన ప్రజారాశులను స్ఫురణలోకి తెస్తూ పాట మొదలెడతాడు.
సూర్యుడిని ముద్దాడిన భూతల్లి చిన్నారి బిడ్డకు జన్మనిచ్చింది అంటూ, ఈ కొత్త శిశువుకు కారణం భూమి ఇరుసుగా సూర్యుడి తేజంగా జనించిన మేలవింపేనని నొక్కి చెబుతూ సాగుతాడు కవి. నువు త్యాగాల తల్లివి అని కీర్తిస్తూ కైగడతాడు గద్దర్.
చిదిమేసిన పువ్వులను, త్యాగాల గుర్తులను గుర్తుచేస్తూ మా భూములు మావేనని మర్లబడ్డ గానాన్ని యాది చేస్తడు. ఇక్కడ కవి ఉపయోగించినతిరగబడటమూ, మర్లబడటమూ అన్న పదాలు ఎంతో కాన్షియస్‌గా చెప్పడాన్ని బట్టి ఈ పొడిచే పొద్దు వెనకాల సుదీర్ఘమైన పోరాటం ఉన్నదని, అది వ్యక్తులుగాను, సంఘటితంగానూ సాగిందన్న చారిత్రక సత్యాన్ని తెలియజెబుతడు.
ముందు భూమి గురించి చెబుతడు. తర్వాత నీళ్ల గురించి చెబుతడు. గోదారి, కష్ణమ్మలను ప్రజల జీవనాధారాన్ని ప్రస్తావిస్తూ, మా నీళ్లు&భలె&భలె..భలె..మా నీళ్లు మాకేనని కత్తుల కోలాటమా&కన్నీటి గానమా అని నీళ్లు మళ్లిన వర్తమానాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలతో పాటను మమేకం చేస్తడు. రేపటి పొడిచే పొద్దులోన ప్రజలంతా తప్తిదీరా ఆనందించే, కన్నీటితో పరవశమొందే స్థితినీ కళ్లకు కడతాడు.
అదిగో ఆ ప్రకతిని చూడు..అలా అలుముకుంటుంది&అదిగో పావురాల జంట&నేనెప్పుడూ విడిపోనంటది&పువ్వులు పుప్పొడిలా పవిత్ర బంధమా& పరమాత్ముని రూపమా అంటూ ప్రేమను&విడిపోనంటున్న ప్రేమను (ఆ సినిమాలో ఆంధ్రపిల్ల తెలంగాణ పిలగాడితో ప్రేమలో పడుతుంది.ఆ జంటను చూపిస్తూ). విడిపోయి కలిసుందాం అన్న సినిమా సందేశానికి తగ్గ చరణాలతో గద్దర్ ఈ పాటను ఒక్కసారి భౌతిక అస్తిత్వాన్ని గుర్తుచేస్తూనే పారమాత్మిక స్థితిని, అలౌకిక ఆనందాన్ని పొందే విధానాన్ని మహత్తరంగా ఆవిష్కరిస్తడు.
గడచిన తెలంగాణ పీడనను, అణచివేతను చెప్పడానికి, మన భూమిని, నీళ్లను, ప్రాణుల్ని, సర్వస్వాన్ని చెరబట్టిన ఒక్కొక్కరినీ& రాజులు, దొరలు, వలస దొరలు అంటూ పరపీడనకు గురిచేసిన వాళ్లందరినీ ఎండగడతడు. దొరవారి గడుల్లో నలిగిపోయిన న్యాయమా అంటూ తెలంగాణలో స్థానీయ ఆధిపత్యాలను ప్రస్తావిస్తూనే, ఆంధ్ర వలస పాలనకు ఆరిపోయిన దీపమా అంటూ స్వయంగా ఉద్యమంలో తూటాలు తీసుకున్న గద్దర్ రాజ్యహింసను వేలెత్తి చూపుతూ ఆర్ధ్రగీతం పాడుతడు.
ఆఖరుగా మా పాలన మాకేనని మండుతున్న గోళమా అంటూ మరోసారి ఇంతెత్తున ఎగిరి, ఉగ్ర నరసింహుణ్ని గుర్తుచేస్తూ అసాధారణమైన ఉత్తేజాన్ని పంచుతూ ఆ వెంటనే తగ్గి అమరవీరుల స్వప్నమా&అమర వీరుల స్వప్నమా అని గొంతు జీరబోతుండగా ఒక విషాద విలాపంతో త్యాగధనులకు నీరాజనం పలుకుతూ పాటను నిలిపివేస్తాడు. ఒక్క మాటలో ఇదొక ఉద్విగ్న, ఉత్తేజ మహోగ్ర సందేశాన్ని వినిపించే గేయం. అదే సమయంలో ప్రేమ, కరుణలు నిండుగ మూర్తీభవించిన గానం. విడిపోయి కలిసుందాం అని చాటిన కొత్త పొద్దు పొడుపు గానం.
మలిదశ ఉద్యమంలో పీడన గురించి రాసిన గద్దర్ పాత పాటలతో పోలిస్తే ఇది నూతన గేయం. క్రాంతి దర్శనం. ఇందులో సంబురం ఉంది. సంతోషం ఉంది. విడిపోవడంలోని విషాదమూ ఉంది. ఒక్క మాటలో పాపులర్ మీడియా ఐన సినిమా మాధ్యమం ద్వారా కోట్లాది ప్రజల చెంతకు వెళ్లి అలా అందర్నీ కన్విన్స్ చేసిన, మలిదశ ఉద్యమంలో అతి కీలకమైన విభజన గేయం, విప్లవ గేయం ఇది.
చివరగా, జై బోలో తెలంగాణ దర్శకుడు శంకర్‌ను ఈ పాట గురించిన స్పందన అడిగినప్పుడు ఈ పాటలో తనను ఆకట్టుకున్నది ప్రేమతత్వం అని చెప్పిండు. ఒకటని కాదు, పరిశీలిస్తే చాలా ఉన్నయని చెబుతూ, చరిత్ర, స్ఫూర్తి, గతం, వర్తమానం, భవిష్యత్తు, వీటన్నిటినీ మించి మానవీయకోణం, ప్రేమతత్వం, చైతన్యం ఉంది అని వివరించిండు. నిజానికి ఈ సినిమా రెగ్యులర్ ప్రేమ కథ కాదు. ఒక ప్రాంతపు ప్రేమని రిప్రజెంట్ చేసేలా హీరో హీరోయిన్లు ఉంటరు. అట్లా రెండు ప్రాంతాల గుర్తింపు, అస్తిత్వం, ప్రేమ, గౌరవాలతో కూడిన అంశం ఇతివత్తంగా వచ్చిన సినిమా. మరీ ముఖ్యంగా ఈ పాట కూడా ప్రేమికులు చావు బతుకుల్లో ఉండగా, ప్రాంతాలుగా విడిపోయి మనుషులుగా బతికుండాలని చెప్పే క్రమంలో వస్తుంది. సరిగ్గా అదే సమయంలో తెలంగాణ తల్లి కోమాలోకి వెళ్లే ఉద్విగ్న పరిస్థితి ఉంటుంది. అప్పుడు గద్దరన్న ఎంటరై ఆడుతడు, పాడుతడు అని ఉత్తేజంగా చెప్పిండు శంకర్.
తమిళంలో ఒక మాట ఉంది. స్క్రీన్ కిల్చిడ్వే అని! కథా రచయిత, దర్శకులు, సాంకేతిక సిబ్బంది కలసి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు, ఒక ఉద్వేగభరితమైన దశ్యం చేయాల్సి వచ్చినప్పుడు-అది తప్పకుండా అదిరిపోతుందని చెప్పుకునేటప్పుడు తెర చిరుగుతుంది అన్న అర్థంలో ఆ పదం వాడుతరు. అప్పటిదాకా కేవలం చర్చల్లోనే ఆ పదం విన్నాను. కానీ జైబోలో తెలంగాణ సినిమా ద్వారా గద్దరన్న తెరమీదికి ప్రవేశించగానే అంతకు మించిన ఉద్వేగం, ఉత్తేజం. దాంతో& స్క్రీన్ కిల్చిడ్వే అంటే ఏమిటో కళ్లారా చూసిన&ఎన్నో థియేటర్లలో చూసిన అని నిజంగానే ఉద్వేగంగా చెప్పిండు.
ఇట్లా. ఈ పాట మన కాలం పాట. భూమి, నీళ్లు, వనరులు, స్వయంపాలన, పరిష్కారాల గురించిన ఈ కవి తలంపు పాట. ఇంకా ఈ పాటపై గద్దర్ స్వయంగా చెప్పింది వింటే ఇంకా అదెంతటి లెవల్స్‌లో వ్యక్తీకరించబడిందో మనకు మరింత బాగా అర్థమవుతుంది.
గద్దర్‌పై హత్యాయత్నం జరిగి సరిగ్గా ఈ రోజుకు 17 ఏళ్లు. ఈ సందర్భంగా ఒంట్లో ఇప్పటికీ ఒక తూటాతో జీవన సమరం చేస్తూ, పోరాడే ప్రజల తరఫున ఉద్యమిస్తున్న యుద్ధనౌక పొడుస్తున్న పొద్దు గురించి చెబుతూనే ప్రకతి చలన సూత్రాలకు అనుగుణంగా తన పాట మారుతుందన్నడు.
పాట సరే, తూటా గురించి కూడా ప్రస్తావించుకోవాలి. అవును మరి. ఈ రోజుకు సరిగ్గా అన్నపై హత్యాయత్నం జరిగి సరిగ్గా పదిహేడేళ్లు అవుతున్నది. గ్రీన్ టైగర్స్ దాడి అనంతరం నెలలోనే లేచిన ఈ ప్రజాకవి ననుగన్న తల్లులారా..తెలుగుతల్లి పల్లెల్లారా అంటూ, పాటనై వస్తున్నానమ్మో అని పునరంకితమై కూడా పదిహేడేళ్లు అవుతున్నది! చంపుకున్నా మీ దయ&సాదుకున్నా మీ దయ అని అప్పుడు అన్నడు. ప్రజల ఆకాంక్ష వల్లో ఏమో నిజంగానే అన్న బతికిండు. అదష్టం ఏమిటంటే జనం పాటపై తూటాల వర్షం కురవడానికీ తెలంగాణ ఒక ముఖ్య కారణమని అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో సకల జనుల స్వప్నమైన తెలంగాణ నిజంగానే సాకారమైంది. ఒక ప్రజాస్వామిక ఆకాంక్షలో ఓ అడుగు ముందుకు పడనే పడ్డది. ఇందులో తానూ క్రియాశీలం. దాడి జరగడానికి ఏ కారణమైతే ఉండిందో ఆ కారణం నిజంగానే నెరవేరింది. మలిదశ ఉద్యమంలో గద్దర్ కీలకంగా మారిండు. ఆడిండూ పాడిండూ. బహుశా ఆనాడు మళ్లీ పుట్టినంత పనైన గద్దర్‌కు తన వెన్నెముకను ఆనుకున్న తూటా నిజంగానే ఎస్కార్ట్ అయింది&బుల్లెట్ ఫ్రూఫే అయింది. తూటాతోనే లేచిన పాట గద్దర్. బహుశా అందువల్లే కావచ్చు, పొడుస్తున్న పొద్దు పాట కూడా అట్లా లేస్తది. ఊపేస్తది.
అయితే గద్దర్ విస్తతి పెద్దదే అయినా సూక్ష్మంగా చెప్పుకుంటే, తాను చిన్న నాటి నుంచే సింగర్, యువకుడిగా ఉన్నప్పుడు అల్లూరి సీతారామారాజు బుర్రకథ చెప్పడం మొదలు ఎమర్జెన్సీ ముందు తెలంగాణ ఉద్యమం వెనక పట్టు పట్టినప్పుడు చెన్నారెడ్డి ద్రోహం గురించి గొల్లసుద్దుల ఒగ్గు కథా చెప్పిండు. ఆనాటి నుంచి మలి దశ ఉద్యమం మొదలవడానికి ముందే తాను నిర్దిష్టంగా తెలంగాణ పీడనను, వైభవాన్ని రంగరించి పాటలెన్నో రాసిండు. అయితే, అవన్నీ ఒకెత్తూ, ఈ పాట ఒకెత్తు అని అన్నప్పుడూ, ఈ పాట చరిత్ర ప్రకతి చలన సూత్రాలను పట్టుకుని రాసింది అన్నడు. అందుకే అంత ఊపు అని వివరించిండు. నిజానికి ఈ పాట పల్లవే దాని గొప్పతనం అంటూ, పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా అన్న పల్లవి కాలంతో పాటు నడిచే వాడిదే చరిత్ర అని స్పష్టం చేసిందనీ వివరించిండు. అయితే, ఈ పల్లవితోనే తాను ఒక పాట గతంలో రాశిండట. ఓరుగల్లు గుండెలల్ల ఎగురుతున్న జెండలా అంటూ సాగే ఆ పాటలో తెలంగాణ జిల్లాలన్నీ వస్తయని, అయితే, సినిమాకు మళ్లీ ఈ పాట రాసినప్పుడు ఉద్యమ ఉధతిని గుర్తించి అందుకు తగ్గ ఆయుధాన్ని అందించేలా పాట మలిచినట్లుగా చెప్పిండు.
ప్రజల్లో గొప్ప సంబురాన్ని పంచే ఈ పాట ప్రజల్లోకి అంతగా చొచ్చుకుని పోవడానికి కారణం ఏమై ఉంటుందో చెప్పమని కోరినప్పుడు తాను మూడు ముక్కల్లో ఈ పాట విశిష్టతను ఇట్ల చెప్పిండు.
ఒకటి, మాట. అవును మాట. మొత్తంగా ఈ పాట చిన్న చిన్న మాటల్తోనే ఉంటది. అది తెలంగాణ మాట&రాగయుక్తమైన మాట&అదిగో చూడు&ఆ కొండల్లో.. అనంగనే అది మాట. కానీ దాన్ని రాగమయం చేసిన&
మాట తర్వాత శబ్దం. దాన్ని పేల్చిన. అవును. భలె&భలె..భలె&హ! అనంగనే ఒక తూటా పేలినట్టు భూమీ ఆకాశం మధ్య విస్తరించే ఒక మహా శబ్దాన్ని సష్టించడం. ఆ పనీ చేయడం వల్లే ఈ పాట ప్రజల్లో ఉప్పొంగడానికి కారణం అన్న విషయాన్నీ తెలియజెబుతున్నడు.
మూడోది చలన సూత్రం. అవును. పల్లవే అంతానూ. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అన్న. మాటలోనే నిరంతర తెలంగాణ ఉద్యమ చరితను చెప్పకనే చెబుతున్నదు. కాలంతో సాగిన చరిత్రగా,. ఎక్కడా ఆగలేదు. ఆ చలన సూత్రం చెప్పిన. అదే ఈ పాట విశిష్టత అన్నడు.
ఈ మూడూ- ప్రకతి చలన సూత్రంతో మిళితమై చెప్పిన. ప్రతి చలనంలో మార్పు ఉన్నది. మార్పులో అభివద్ధి&వికాసం&అది కొనసాగుతుంది. స్టాగ్నేట్ కాకుండా కాలంతోపాటు మారుతూనే ఉంటుంది. అందుకే పొడుస్తున్న పొద్దు ప్రతీకతో ఈ పాట రాసినట్లు వివరించిండు.
ఇంకో మాటా చెప్పాలి. ఈ మూడింటితో పాటూ మరో విషయాన్నీ ప్రస్తావించుకోవాలి. తాను రాశాడు. పాడాడు. ఆడాడు. అయితే, ఈ పాటను రాయడం, ఆడటమే కాదు, కవి స్వయంగా ఉద్యమంలో పాల్గొనడం, పార్టనర్ కావడం వల్ల ప్రజల్లో ఒక విశ్వాసం. అరె ఇదిరా పాటంటే అన్న నమ్మకం. దాంతో ప్రజల్లో అంతులేని విశ్వాసంతో కూడిన అభిమానం. అవన్నీ ఈ పాటను లేపినయి. ప్రజలు ఆడిపాడేలా చేస్తున్నయి.
ఇదిట్లా ఉంటే ఈ పాట ప్రాసాంగికత అంత తొందరగా పోదనీ అనిపిస్తున్నది. ఎందుకంటే, ఇందులో తానే అన్నట్టు ఒక చలన సూత్రం ఉంది. మా నీళ్లు మా భూములు, మా వనరులు, మా పాలన అన్నీ కావాలన్న ఆకాంక్ష ఉన్నది. తెలంగాణ రాష్ట్ర పొద్దు పొడుపువేళ ఈ పాట ఆగిపోతుందా? అంటే ఆగదనే అన్నడు గద్దర్. అయితే ఈ పాట మారుతుంది అన్నడు. అర్థం కాలేదంటే, ఉత్పత్తి నుంచి శబ్దం, అక్షరం, పదం, పాట పుట్టినయి. అట్లే చరిత్రలో ఉత్పతి ్తశక్తులు పోరాడి ఇంకేం సాధించుకుంటరో అవన్నీ జనం పాటలో ఉంటయి, పాటను పదును పెడతరు అన్నట్టు చెప్పిండు. తన పాటకు తానే పదును పెడుతున్న వైనాన్నీ చెప్పిండు.
అవును. తెలంగాణ వచ్చింది సరే. సాధించుకున్న దశ ముగిసింది. ఇక పని మొదలుగావాలె. మరి ఇప్పటిదాకా నిర్మాణమే లేదు. అంతా దోపిడీ నిర్మాణమే. ఇంకా పునర్నిర్మాణం ఎక్కడ? అందుకే పాత పాటనే మళ్లీ రాస్తున్న& అన్నడు.
పాత పాటను రాయడమా? అవును. ఇంకా గద్దర్ శకం ఒడవలేదు. ఇంకా తన పాత్ర ఉన్నది. నాడు తూటాలు తగిలినా బతికింది అందుకే కావచ్చు. బహుశా అందువల్లే, పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలామా అన్న ఈ పాటకు, ఇప్పటి భౌగోళిక తెలంగాణ సాక్షాత్కారం అవుతున్న కాలానికి మళ్లీ కొనసాగింపును తానే రచిస్తున్నట్టు చెప్పి ఆశ్చర్యపరిచిండు. నిర్మాణం అంటే ఇదే అన్నట్టు చెప్పిండు. ఆనాడు&తన తల్లిపై 1972లో రాసిన సిరిమల్లె చెట్టుకింద లచ్చుమమ్మో&లచ్చుమమ్మా అన్న పాటను రివర్స్‌లో రాస్తున్నట్టు చెప్పిండు.
తెలంగాణ వచ్చింది లచ్చుమమ్మో&మ నకేమి తెచ్చినాదో లచ్చుమమ్మా అని రాస్తున్నట్టు చెప్పిండు. చిత్రమేమిటంటే, ఇప్పడు పొడుస్తున్న పొద్దు పాట లచ్చుమమ్మకు ఆసరా అవుతున్నది. అను పల్లవి అవుతున్నదిని కూడా తెలిపిండు.
విశేషం ఏమిటంటే, ఈ పాటను ప్రజాస్వామిక స్ఫూర్తితోనే రచిస్తున్నడు. ఇవ్వాళ్టి చారిత్రక సమయాన్ని దష్టిలో పెట్టుకుని పోదాం పద జనసేనలో అని అనకుండా, తన తల్లి లచ్చుమమ్మ ఇన్నేండ్లుగా ఓపిక పట్టిన కలలు తీరుతయా? అని మాత్రమే ప్రశ్నస్తున్నడు. అవి చిన్న చిన్న కోరికలే. ఆ తల్లి తనకొక అంచు చీర కావాలంటున్నది. ఉప్పు పప్పుల ధర తగ్గాలంటున్నది. ఇవిగూడా సఫలం కాకపోతే ఇంకెందుకు తెలంగాణ? అంటూ తాను తన తల్లి పాట రాస్తున్నట్టు చెబుతున్నడు గద్దర్. ఈ పాటలో నెత్తంత నెరిసినాది లచ్చుమమ్మా&రైకంత చిరిగినాది లచ్చుమమ్మా అంటూ పునర్నిర్మాణం అని అందరూ అంటుంటే, తాను మాత్రం సిసలైన నిర్మాణ కవితను, పాటను కైగడుతున్నడు గద్దర్. చిన్న చిన్న కోరికలే అంటున్నడుగానీ, ఇదొక పెద్ద విషయమే. ఈ పాట ఒక్కటి పాడితే చాలు, తాను అనుకున్నోడు రాజు అవతడని గద్దర్ నమ్మకంగా చెబుతున్నడు. అవును మరి. ఇది తల్లిపాట. తెలంగాణ తల్లిపాట. సద్ది గట్టుకుని వచ్చి ఉద్యమానికి సన్నద్ధమైన బిడ్డలకు ముద్దులిచ్చి పోయే తల్లి పాట అని చిన్నగా పాడి వినిపించిండు గద్దరన్న.
ఇదీ తన అంతరంగం. ఇంకా బయటకు రాని పాటల రణరంగం. పొడుస్తున్న పొద్దు రిలవెన్స్‌ను తిరిగి చరిత్రపైకి తెస్తున్న కొత్త పాట. మన కాలం పాట.
పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా
పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా
పోరు తెలంగాణమా
అదిగో ఆ కొండల నడుమ తొంగి చూసే
ఎర్రని భగవంతుడెవడు? సూర్యుడు
ఆ ఉదయించే సూర్యునితో పొడుస్తున్న పొద్దుతో
పోటీపడి నడుస్తుంది కాలం
అలా కాలంతో నడిచిన వాడే కదిలిపోతాడు
ఓ పొడుస్తున్న పొద్దు వందనం వందనం
ఆ.... పొడుస్తున్న భలె భలె భలె....
పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా
పోరు తెలంగాణమా.. పోరు తెలంగాణమా..
కోట్లాది ప్రాణమా& భలె భలె భలె....
పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా
పోరు తెలంగాణమా&పోరు తెలంగాణమా..
కోట్లాది ప్రాణమా.. కోట్లాది ప్రాణమా
ఓ భూతల్లి సూర్యుడిని ముద్దాడిన భూతల్లి
అదిగో చిన్నారి బిడ్డల్ని జన్మనిచ్చింది
అమ్మ.. నీవు త్యాగాల తల్లివి త్యాగాల గుర్తువు
భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు
చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు
హ..మా భూములు మాకేనని.. భలె భలె భలె భలె.... హ..
మా భూములు మాకేనని మర్లబడ్డ గానమా..
తిరగబడ్డ రాగమా.. మర్లబడ్డ గానమా
తిరగబడ్డ రాగమా...
పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా
భలె భలె భలె భలె
పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా
పోరు తెలంగాణమా& పోరు తెలంగాణమా..
కోట్లాది ప్రాణమా..
అమ్మ గోదావరి నీ ఒడ్డున జీవించే
కోట్లాది ప్రజలకు జీవనాధారము
అమ్మ కష్ణమ్మా&కిల కిల నవ్వే కష్ణమ్మ
అమ్మా మీకు వందనం..
గోదావరి అలలమీద కోటి కళల గానమా
కష్ణమ్మ పరుగులకు నురుగుల హారమా
హ..మా నీళ్లు భలె భలె భలె భలె.. హ
మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా..
కన్నీటి గానమా& కత్తుల కోలాటమా..
కన్నీటి గానమా..
పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా..
భలె భలె భలె.. భలె భలె భలె..
పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా
పోరు తెలంగాణమా& పోరు తెలంగాణమా..
కోట్లాది ప్రాణమా&
అడవి తల్లి గుండెలోన
రగల్ జెండా రాగమా
సింగరేణి గనులల్లో
పేలుతున్న శబ్ధమా
తరలిపాయె వనరులల్లో
తల్లడిల్లె ప్రాణమా
నిలువున దోయబడ్డ తల్లీ తెలంగాణమా
తల్వారుల గానమా... పోరు తెలంగాణమా
అదిగో ఆ ప్రకతిని చూడు అలా అలుముకుంటుంది
ఆ కొమ్మలు గాలితో ముద్దాడుతాయి
ఆ పువ్వులు అలా ఆడుతాయి
అదిగో పావురాల జంట నేనెప్పుడు విడిపోనంటది
విడిపోయిన బంధమా.. చెదిరిపోయిన స్నేహమా..
విరబూసిన గీతమా.. ఎదల నిండ గాయమా.. హ..
పువ్వులు పుప్పొడిలా భలె భలె భలె భలె
పువ్వు పుప్పొడిలా పవిత్ర బంధమా..
పరమాత్ముని రూపమా..
పవిత్ర బంధమా& పరమాత్ముని రూపమా&
పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా
భలె భలె భలె.. భలె భలె భలె...
పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా&
పోరు తెలంగాణమా&పోరు తెలంగాణమా
కోట్లాది ప్రాణమా..
అదిగో రాజులు దొరలు వలసదొరలు
భూమిని నీళ్లని ప్రాణుల్ని సర్వస్వాన్ని చెరబట్టారు
రాజల ఖడ్గాల కింద తెగిపోయిన శిరస్సులు
రాజరికం కత్తిమీద నెత్తుర్ల గాయమా..
దొరవారి గడులల్లో..భలె భలె భలె
దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా..
ఆంధ్రవలస తూటాలకు ఆరిపోయిన దీపమా...హ..
మా పాలన.. భలె భలె భలె భలె హహ....
మా పాలన మాకేనని మండుతున్న గోళమా..
అమరవీరుల స్వప్నమా.. మండుతున్న గోళమా..
అమరవీరుల స్వప్నమా..
మండుతున్న గోళమా.. అమరవీరుల స్వప్నమా..
అమరవీరుల స్వప్నమా.. అమరవీరుల స్వప్నమా.. అమరవీరుల స్వప్నమా..
గద్దర్
No comments:
Post a Comment