Showing posts with label Tollywood Heros Biography. Show all posts
Showing posts with label Tollywood Heros Biography. Show all posts

Sunday, February 2, 2014

నాయికల నాయకుడు

Sakshi | Updated: February 02, 2014 00:56 (IST)

అక్కినేని తొలి దశలో నటించిన చిత్రాలతో ‘రొమాంటిక్ హీరో’ ఇమేజ్ ఏర్పడింది. ప్రేమ, విరహం, విషాదం... అంటే ఆయన ఓ ‘రోల్ మోడల్’ అయ్యారు. తన సినీ జీవితంలో అక్కినేని సరసన 76 మంది కథానాయికలు నటించడం ఓ రికార్డు!

 తొలి రోజుల్లో శాంతకుమారి, లక్ష్మీ రాజ్యం, ఎస్.వరలక్ష్మి, భానుమతి, అంజలీదేవి, సావిత్రి; ఆ తర్వాత షావుకారు జానకి, జమున, కృష్ణకుమారి, బి.సరోజాదేవి, రాజసులోచన, కాంచన, పద్మిని వంటివారు అక్కినేని సరసన  నటించారు.

 ‘మాయలోకం’లో ఆయన కంటే వయసులో పెద్దవారైన శాంతకుమారి, ఎమ్.వి.రాజమ్మల సరసన హీరోగా నటించారు ఏఎన్నార్. శాంతకుమారితో ప్రేమ సన్నివేశాలలో నటిస్తున్నప్పుడు కంగారుపడేవారట. అప్పుడు శాంతకుమారి అలాంటి సన్నివేశాలలో ప్రేమను పండించాలంటే... డైలాగులు ఎలా చెప్పాలో, శృంగారాన్ని ఎలా అభినయించాలో చెప్పి ఉన్న భయాన్ని పోగొట్టారు.

 భరణీ వారి తొలి చిత్రం ‘రత్నమాల’లో భానుమతి సరసన మొదటిసారిగా నటించారు అక్కినేని. ఆ చిత్రానికి దర్శకుడు భానుమతి భర్త రామకృష్ణ. భానుమతితో అక్కినేనికి చనువు ఏర్పడాలని - వాళ్లిద్దర్నీ కలిసి పరుగెత్తమని చెప్పి 16 మి.మీ. కెమెరాతో ఆ దృశ్యాలను తీసి చూపించేవారు. భానుమతిని ‘మేడమ్’ అని, రామకృష్ణను ‘గురువుగారూ’ అని పిలిచేవారు అక్కినేని. ‘చింతామణి’ తీయాలని సంకల్పించి, బిల్వమంగళుడి పాత్రను ధరించమని వాళ్లు కోరినప్పుడు అక్కినేని తిరస్కరించారు. ‘‘నేను చేయకపోవడం అలా ఉంచండి. చింతామణి మేడమ్‌గారు వేయదగ్గ పాత్ర కాదు. ఆ సినిమాను ‘డ్రాప్’ చేసుకోండి’’ అని కూడా సూచించారు సంస్థ పట్ల అభమానం కొద్దీ! ఆ తర్వాత భరణీ అధినేతలు ఎన్టీయార్‌తో ‘చింతామణి’ తీశారు. ఆ చిత్రం అపజయాన్ని చవిచూసింది.

 అక్కినేని హీరోయిన్లలో ప్రధానమైన నటీమణి అంజలీదేవి. ఒక బిడ్డ తల్లిగా చిత్రరంగ ప్రవేశం చేసి, ‘గొల్లభామ (1947)’ తో గ్లామర్ నటిగా సంచలనాన్ని సృష్టించారు. అంతవరకూ ‘వ్యాంప్’ పాత్రలు ధరించి, ‘శ్రీలక్ష్మమ్మ కథ’లో అక్కినేని సరసన సాధ్వి పాత్రలో మెప్పించారు. ఈ జంట ఆ రోజుల్లోనే ‘పరదేశి’లో వయసు మళ్లిన దంపతుల పాత్రల్లో కనిపించడం విశేషం. ‘ఇలవేలుపు’ చిత్రంలో మొదట ప్రేమికులై, ఆ తర్వాత నాయిక (అంజలీదేవి)ను, హీరో తల్లిగా చూడవలసి రావడం అప్పట్లో ‘యాంటీ సెంటిమెంట్’ అన్నారు. కానీ అక్కినేని, అంజలీదేవి ఆ చిత్రంలో అద్భుతంగా రాణించారు.

 అక్కినేని నట జీవితంలో మరో ప్రధానమైన నటీమణి సావిత్రి. ‘మూగమనసులు’లోని ‘ఈనాటి ఈ బంధమేనాటిదో’ పాటను గోదావరి నదిపై పడవలో చిత్రీకరిస్తున్నప్పుడు, సావిత్రి పట్టుతప్పి నదిలో పడిపోయారు. పడవను పట్టుకుని వేలాడుతున్న ఆమెను సమయస్ఫూర్తితో అక్కినేని చేయి పట్టుకుని పైకి లాగుతూ ఉంటే, ఈతగాళ్లు వచ్చి ఆ ఇద్దరినీ కాపాడటం జరిగింది. సావిత్రి ఎంతోమందికి చెప్పారు   ఏయన్నార్ రక్షించిన సంగతి! ‘సావిత్రి మనిషిగా గొప్పదా? నటిగా గొప్పదా? అనేది తేల్చుకోవడం కష్టం’ అంటారు అక్కినేని.

 ఆ తర్వాత వచ్చిన మరోతరం నటీమణులలో లక్ష్మి, శారద, జయలలిత, వాణిశ్రీ, భారతి - అనంతరం లత, జయచిత్ర, సుజాత, మంజుల, జయసుధ, జయప్రద వంటివారు అక్కినేని సరసన ఆకర్షణీయమైన పాత్రలు పోషించారు.

 ప్రేక్షకులకు ‘రాంగ్ మెసేజ్’ వెళ్లకూడదనేది అక్కినేని వాదం. యద్దనపూడి సులోచనారాణి నవల ‘విజేత’ ఆధారంగా ‘విచిత్ర బంధం’ తీస్తున్నప్పుడు, హీరో కథానాయిక (వాణిశ్రీ)ను ‘రేప్’ చేసే ఘట్టాన్ని ఎంతగానో వ్యతిరేకించారు. నిర్మాత దుక్కిపాటి, దర్శకుడు ఆదుర్తి - ఆయనను అతికష్టం మీద ఒప్పించారు. చిత్రీకరణ అయిన తర్వాత ‘‘ఓస్! రేప్ అంటే ఇదేనా? ఏమో అనుకుని భయపడ్డాను’’ అని వాణిశ్రీ నవ్వారు. ఎవరికీ ఇబ్బంది కలగని విధంగా చిత్రీకరించారు ఆదుర్తి. ప్రేమ సన్నివేశాలైనా, ఏ తరహా దృశ్యాలైనా ఆలోచింపజేసేలా, ఆహ్లాదాన్ని కలిగించేలా ఉండాలనేది అక్కినేని ధోరణి. అందుకనే ఏదీ ‘మోతాదు’కు మించకుండా ఉండాలని కోరుకుంటూ, ఆ మేరకు దర్శక నిర్మాతలు శ్రద్ధ వహించేలా చూసేవారు.
 ఆ మధ్య అక్కినేని నాయికలందరూ ఒకే వేదికపై చేరి, ఆయనను సత్కరించడం విశేషానందాన్ని కలిగించిన ఘట్టం!

వంద పడితే లక్ష వచ్చినట్టే ..!!

నువ్వు నాగేశ్వరరావు ఫేవరెట్టువా, ఎన్టీ రామారావు ఫేవరెట్టువా? కొత్తగా ఆ వూరికి బదిలీ అయి వచ్చిన ఉద్యోగుల పిల్లలు కావచ్చు; సమీప గ్రామాల్లో హైస్కూలు చదువు పూర్తి చేసుకొని కాలేజీలో చేరిన వారు కావచ్చు.. తొలి పరిచయం కాగానే ఎదురయ్యే మొదటి ప్రశ్న ఇదే. ‘‘నాకు ఇంట్రెస్ట్ లేదండీ..’’ అంటేనో, ‘‘నాకు ఇద్దరూ సమానమే’’ అంటేనో వాడు కచ్చితంగా అబద్ధమాడుతున్నాడనో, ఏమన్నా గొడవవుతుందని లౌక్యంగా తప్పించుకుంటున్నాడనో భావించే రోజులు. ఇవాళ్టికి 30 సంవత్సరాల క్రితం వరకూ పాతికేళ్ల పాటు తెలుగునాట విద్యార్థి లోకం పరిస్థితి ఇదీ..

 కాస్త చదువుకున్న కుర్రాళ్లు నాగేశ్రావు, రామారావు అని; అసలు చదువుకోనివాళ్లు నాగ్గాడు, ఎన్టీవోడు అనీ; కాలేజీ చదువుకొచ్చాకా ఏయన్నార్, ఎన్టీఆర్ అనీ మాట్లాడేవారు వాళ్ల వాళ్ల అభిమానులు. సినిమాహాల్లో తెరమీద టైటిల్స్‌లో వాళ్ల పేరు పడిన దగ్గరా, పాటలొచ్చినప్పుడూ, ఫైటింగ్ చేస్తున్నప్పుడూ గొంతు చించుకుని జేజేలు, ఈలలు, చప్పట్లు, అరుపులు.. మాటలు, పాటలు కూడా వినపడనంతగా..!

 ఇద్దరు మిత్రులు.. నాగేశ్వర్రావు డబల్ ఫోజు. రాముడు భీముడు... ఎన్టీ రామారావు డబల్ ఫోజు. (రెండేళ్లు ఆలస్యం) బుద్ధిమంతుడు.. నాగేశ్వరరావు డబల్ ఫోజు. భలే తమ్ముడు.. ఎన్టీ రామారావు డబల్ ఫోజు (కొద్ది రోజుల తేడా). గోవుల గోపన్న.. నాగేశ్వరరావు డబల్ ఫోజు. తిక్క శంకరయ్య.. ఎన్టీ రామారావు డబల్ ఫోజు (రోజులే తేడా). సోలో చిత్రాలు సరే సరి.. ఇలా ద్విపాత్రాభినయ చిత్రాలు కూడా ఆయా నిర్మాతలు పోటీ పడి నిర్మించారు.

 ఏ సినిమా ఎక్కువ రోజులాడిందీ.. అనే దానిపై ఆ హీరో, హీరోయిన్లు, నిర్మాత, దర్శకుల కంటే ఎక్కువ ఆసక్తి...

 ఒరే.. ఎన్టీ రామారావు ఫేవరెట్లు నలుగురు చావదొబ్బుతున్నార్రా... నువ్వు అర్జంటుగా రారా బాబు అంటే వెళ్లాను.

 మనోడు...‘ఏమంటి రేమంటిరీ.. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే.. కాకూడదు.. (దాన వీరశూరకర్ణ) ఆ డైలాగు చెప్పమను మీ వాణ్ణి.. ఎన్టీఆర్ అభిమాని సవాల్.

 అంత పెద్ద పాఠం దేనికి....‘ల్లతా....’ (ప్రేమనగర్) అనమను.. అని నేను ఏఎన్నార్ తరపున ప్రతి సవాల్.
 వీరిద్దరి కొత్త సినిమా కాపీ విడుదల... ‘ఈ దిగువ కేంద్రాలలో..’ అన్న పేజీని దాచిపెట్టి ఏదైనా కొత్త సినిమా వచ్చే ముందు రోజు థియేటర్ల లిస్టు పేపర్లో చూసుకుంటూ, ఏ వూళ్లో మావోడి సినిమా ఎన్ని రోజులాడిందో లెక్కలేసే వాళ్లం.   ‘వంద’ పడ్డం కోసం కళ్లు కాయలు కాసేలా చూసేవాళ్లం. ‘వంద’ పడిందంటే చాలు మాకు లాటరీలో లక్ష వచ్చినట్టో, ఫస్ట్‌క్లాస్‌లో పరీక్ష పాసయినట్టో కాలరెగరేసే వాళ్లం.

 కాలేజీ బయట కేంటీన్లలో సిగరెట్లు లాగించేస్తూ వాదులాడుకుంటుంటే  మూడు పదులు దాటిన పెద్ద వాళ్లు ‘సుభాషితాలు’ చెప్పేవారు. మాక్కూడా ‘ముప్పై’లు దాటాక జ్ఞానోదయమయింది. ఇద్దరూ సినిమా పరిశ్రమకు రెండు కళ్లు అనీ, పోటీకి పర్యాయ పదాలనీ, వారికి వారే సాటి అనీ తెలిసొచ్చింది.
 ఇంత పోటాపోటీ వీరిద్దరి అభిమానులకే పరిమితం. ముందు తరంలోని నాగయ్య, సీహెచ్ నారాయణరావుల విషయంలో లేదని చెప్పేవారు. తర్వాత కృష్ణ, శోభన్‌బాబుల విషయంలో కూడా ఇంతగా లేదు.
 - లక్ష్మణ్

 ఆపరేషన్ సక్సెస్  - ఇంద్రుడు ‘సేఫ్’

 1974లో ఏయన్నార్‌కి అమెరికాలో గుండె ఆపరేషన్ అని తెలిసింది. అభిమానుల్లో కంగారు. ఇష్టదైవాలకు మొక్కుకున్నాం. మొత్తానికి ఆయన క్షేమంగా తిరిగొచ్చారు. ఒకవేళ నాగేశ్వర్రావు మరణిస్తే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వంటి దేవలోక సుందరీ మణులు తనను వదిలేసి నాగేశ్వర్రావు వెంట పడతారనీ, తన పదవికే మప్పు వస్తుందని భయపడి దేవేంద్రుడు బ్రహ్మ దేవుడితో ఏయన్నార్‌ని గండం గట్టెక్కించమని ప్రార్థించాడనీ, పూర్ణాయువు ప్రసాదించమని వేడుకున్నాడనీ, అందుకే ఆయన క్షేమంగా సంపూర్ణారోగ్యవంతుడై వచ్చాడనీ ఓ కథ అల్లుకుని మురిసిపోయాం. ఇద్దరిలో ఎవరు లేకపోయినా నటనలో ఇక పోటీ అన్నమాటకే అర్థం ఉండదంటూ ఎన్టీఆర్ అభిమానులు కూడా మాతో తొలిసారి ఏకీభవించారు.
Sakshi | Updated: February 02, 2014 01:06 (IST)

దర్శకుల హీరో అక్కినేని

‘అతడనేక యుద్ధములందారితేరిన వృద్ధమూర్తి’ అనే మాటలు అక్కినేనికి సరిగ్గా వర్తిస్తాయి. చిరకాలంగా తెలుగు సినీ అభిమానుల హృదయ పీఠాలనధిష్టించిన నటసమ్రాట్టు - దర్శకుల నటుడు అక్కినేని. దర్శకుల పట్ల ఆయనకు గల గౌరవ భావాన్ని అవలోకిస్తే, అనేక విషయాలు ఈ తరానికి స్ఫూర్తిదాయకంగా కనిపిస్తాయి.

కొంతకాలం క్రితం ‘ఫన్‌డే’ రెండవ వార్షికోత్సవం సందర్భంగా-‘తప్పక చూడాల్సిన 100 తెలుగు సినిమాలు’ జాబితా ప్రచురితమైంది. వాటిలో ఇరవైకి పైగా అక్కినేని నటించిన చిత్రాలే ఉన్నాయి. అవి చూడదగ్గవి మాత్రమే కాదు. ప్రజాదరణ పొందినవి ‘కూడా’! ఈ ‘కూడా’ ఎందుకంటే, విమర్శకులు చూడదగినవని చెబితే, అవి సాధారణంగా జనాదరణ పొంద(లే)ని చిత్రాలుగానే ఉంటాయని! కానీ ‘క్వాలిటీ’ని ప్రేక్షకులు విజయవంతం చేస్తారని ఈ ఎంపిక నిరూపించింది.

 డెరైక్టర్స్ యాక్టర్
 అక్కినేనిని దర్శకుల నటుడిగా మనం ఎందుకు శ్లాఘించాలి? అక్కినేనికి తనలోని ‘మైనస్ పాయింట్స్’ ఏమిటో తెలుసు. ‘‘నాదేమీ ఆకర్షణీయమైన పెర్సనాలిటీ కాదు. పైగా నావి గుంట కళ్లు’’ అంటూ తనలోని ‘లోపాలను’ చెప్పేవారు. అవి ‘ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్’తో అనే మాటలు కావు.  శిలను అందమైన శిల్పంగా తీర్చిదిద్దుకోగలిగే గొప్పతనం చిత్ర పరిశ్రమకు ఉందని ఆయన దృఢ నమ్మకం.
 ‘శ్రీ సీతారామ జననం’లో కథానాయకుడిగా శ్రీరాముడి పాత్ర ధరించే అవకాశం ఇచ్చి, ఆ తర్వాత ‘బాలరాజు’ వంటి సూపర్ హిట్ చిత్రంతో అక్కినేనికి చిత్ర రంగంలో సుస్థిరమైన పునాదిని ఏర్పరచిన దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య. దగ్గరుండి పెళ్లి కూడా జరిపించి,  ఓ తండ్రిలా భవిష్యత్తుకు రూపురేఖలు దిద్దిన శ్రేయోభిలాషి. ‘‘ఒక నటుడిగా ఎలా ‘మౌల్డ్’ అవ్వాలి? తక్కినవారితో ఎలా మెలగాలి? వంటి పాఠాలన్నీ బలరామయ్యగారి ప్రతిభా సంస్థలో నేర్చుకున్నవే’’ అని స్నేహితులకు చెప్పేవారు అక్కినేని.
 ఆ తర్వాత ఆయనకు గూడవల్లి రామబ్రహ్మం తీసిన ‘మాయాలోకం’లో నటించే అవకాశం లభ్యమైంది. అందులో అక్కినేనిది శరాబందిరాజు పాత్ర. అందులో ఆయన కంటే వయసులో పెద్దవాడైన శాంతకుమారి, ఎం.వి.రాజమ్మ - భార్యలుగా నటించారు. అక్కినేని సంభాషణల్ని లాగినట్లుగా చెబుతూ ఉంటే, ‘‘ఏమిట్రా నాయనా, నాటకం ఫక్కీలో చెబుతున్నావు. మామూలుగా చెప్పు’’ అని రామబ్రహ్మం సరిదిద్దేవారట. ‘‘చిత్ర దర్శకుడికీ నటుడికీ మధ్య కావలసింది ఆత్మీయత. దర్శకుడు, నటుడు నాణానికి ఒకవైపు అయితే, రెండోవైపు ఉండాల్సింది ఆత్మీయత. ఆ రెండూ కలిసినప్పుడే, అది చెల్లుబడి అయ్యే నాణెంలా కనిపిస్తుంది’’ అంటారు అక్కినేని.

 ఆయన మొదటిసారి వేషం వేసింది పి.పుల్లయ్య తీసిన ‘ధర్మపత్ని (1943)’లో. పది మంది పిల్లల్లో ఒకడిగా! ఆ తర్వాత పి.పుల్లయ్య దర్శకత్వంలో అర్ధాంగి, జయభేరి, మురళీకృష్ణ, ప్రేమించి చూడు, ప్రాణమిత్రులు వంటి చిత్రాల్లో నటించారు. ఆయన చిత్రాల్లో నటించడమంటే హాయిగా ఉంటుందని, ఆయన చూపే ఆత్మీయతే అందుకు కారణమంటారు ఏయన్నార్.

 వరుసగా జానపదాలు, పౌరాణికాలు అన్నీ ఓ పద్నాలుగయ్యాయి. ‘జానపద కథానాయకుడు’ అనే ముద్ర శాశ్వతంగా పడిపోతే ఎలా?’ అనే సంఘర్షణ మొదలైంది. అప్పటికే కొందరు సాంఘికాలకు అక్కినేని పనికిరాడని తేల్చేశారు. సరిగ్గా అప్పుడే ‘సంసారం (1950)’లో నటించే అవకాశం అందిపుచ్చుకున్నారు. అందుకోసం పారితోషికాన్ని తగ్గించుకున్నారు(దర్శకుడు ఎల్.వి.ప్రసాద్). ‘సంసారం’ విజయవంతం కావటంతో - సాంఘికాల్లోనూ అక్కినేని రాణించగలడని రుజువైంది. ‘‘ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడు ఎల్.వి.ప్రసాద్’’ అంటారాయన.

 వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ‘దేవదాసు’గా అక్కినేని నటిస్తున్నారన్నప్పుడు చాలామంది సందేహాలను వ్యక్తం చేయగా, అదో ‘ఛాలెంజ్’గా తీసుకున్నారు. తనపై ‘ట్రాజెడీ హీరో’ ముద్ర పడకూడదని, విజయా ప్రొడక్షన్స్ ‘మిస్సమ్మ’(దర్శకుడు ఎల్వీ ప్రసాద్) తీస్తున్నప్పుడు, హాస్య ప్రధానమైన పాత్రను తనే పోషించడానికి ముందుకొచ్చారు. ఓ ‘బ్రాండ్’ పడకుండా  నటుడు ఎలా శ్రద్ధ తీసుకోవాలో, ఎలాంటి ‘అహం’ లేకుండా దర్శక నిర్మాతల వద్దకు వెళ్లి సరైన అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలో - ఇటువంటి ఉదాహరణలను బట్టి అర్థం చేసుకోవాలి.

 అక్కినేని విశేషంగా గౌరవించే దర్శకుల్లో కె.వి.రెడ్డి ఒకరు. ఆయన ‘క్వాలిటీ’ విషయంలో రాజీపడరని, దేని గురించైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారన్నది తెలిసిన విషయమే. అందుకే ‘దేవదాసు’ విడుదలైన తర్వాత కె.వి.ని కలుసుకున్నారు అక్కినేని. ‘‘నన్ను మీరు యాక్టర్‌గా అంగీకరిస్తారా?’’ అని ఆయనను డెరైక్టుగా అడిగేశారు. అప్పటికే ఆయన పలు విజయాలు సాధించిన హీరో. అయినా కె.వి. దృష్టిలో తన స్థానం ఏమిటో తెలుసుకోవాలన్నది ఆయన తపన. ‘‘యూ ఆర్ ఏ వండర్‌ఫుల్ స్టార్’’ అన్నారు కె.వి. (అప్పుడు కూడా ఆయన ‘స్టార్’ అన్నారే కాని, ‘యాక్టర్’ అనలేదు). అలా అనడమే గొప్ప కాంప్లిమెంట్.  కొన్నాళ్లకు ‘దొంగరాముడు’ ఆ ఇద్దరినీ కలిపింది. మరెన్నో విజయవంతమైన చిత్రాలు వెలువడటానికి నాంది పలికింది.

 ‘మల్లీశ్వరి’ వంటి కళాఖండాలంటే, అక్కినేనికి చాలా ఇష్టం. బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో ‘పూజాఫలం’లో నటించారు. ఉత్తమ స్థాయి చిత్రాల కళా విలువల గురించి ఎన్నో విషయాలు ఆయన వద్ద నుంచి తెలుసుకుంటూ ఉండేవారు అక్కినేని - వీలున్నప్పుడల్లా ఆయనను కలుసుకుంటూ.

 ‘లైలా మజ్ను’, ‘విప్రనారాయణ’, ‘బాటసారి’ చిత్రాలు ఆణిముత్యాల్లాంటివనీ, వాటికి దర్శకత్వం వహించిన పి.ఎస్.రామకృష్ణ - తనలో మనోధైర్యాన్ని పెంపొందింపజేశారనీ చెప్పేవారు అక్కినేని.
 కమలాకర కామేశ్వరరావు ‘కాళిదాసు’, ‘గుండమ్మ కథ’ - అక్కినేని చలనచిత్ర జీవితంలో ముఖ్యమైన చిత్రాలే. అలాగే కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన ‘కన్నతల్లి’, ‘ప్రేమనగర్’, ‘సెక్రెటరీ’ చిత్రాలూ!
 ‘టేకింగ్’లో కొత్త పుంతలు తొక్కిన ఆదుర్తి సుబ్బారావు - అక్కినేనిని విశేషంగా ఆకట్టుకున్న దర్శకుల్లో ఒకరు. వినోదమే కాదు... సమాజాన్ని కదిలించే చిత్రాలను విభిన్న ధోరణిలో తీయాలని ఆదుర్తి సంకల్పించినప్పుడు, తనూ భాగస్వామినవుతానని ముందుకొచ్చారు. దాని ఫలితమే - ‘సుడిగుండాలు’, ‘మరో ప్రపంచం’ చిత్రాలు.

 అక్కినేనితో అత్యధిక సంఖ్యలో చిత్రాలు రూపొందించిన దర్శకులు వి.మధుసూదనరావు, దాసరి నారాయణరావు. అక్కినేని 200వ చిత్రంగా దాసరి ‘మేఘసందేశం’ రూపొందించి, జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు. వి.బి.రాజేంద్రప్రసాద్ ‘దసరా బుల్లోడు, కె.విశ్వనాథ్ ‘ఆత్మగౌరవం’, బాపు ‘బుద్ధిమంతుడు’-  అక్కినేని తీపి జ్ఞాపకాల్లో కొన్ని. అక్కినేని నుంచి ఓ కొత్త నటుణ్ని ఆవిష్కరించిన ఖ్యాతి ‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రాన్ని డెరైక్టు చేసిన క్రాంతికుమార్‌కు దక్కుతుంది.

 దర్శకులను ఎవరైనా విమర్శిస్తే, ఆయనకు వెంటనే కోపం వస్తుంది. ఒకసారి ఓ గీత రచయిత - ‘తాను ‘డబుల్ మీనింగ్ పాటలు రాయడానికి సదరు దర్శకుడికి ‘టేస్ట్’ లేకపోవడమే కారణ’మని సభాముఖంగా చెబితే, అధ్యక్ష స్థానంలో ఉన్న అక్కినేని - ఆ రచయితను సభా ముఖంగానే చివాట్లు పెట్టారు. ‘అవకాశాలు ఇచ్చి పెంచి పోషిస్తున్న చిత్ర పరిశ్రమను, దర్శకులను ఎద్దేవా చేయడం భావ్యం కాద’న్నారు. దర్శకులంటే ఆయనకు అంత భక్తి!
 - బి.కె.ఈశ్వర్

మన ఇద్దరు!

Sakshi | Updated: February 02, 2014 00:59 (IST)

మహానటులు ఎమ్జీయార్, కరుణానిధిల ప్రగాఢ స్నేహం గురించి, దరిమిలా ఏర్పడిన రాజకీయ వైషమ్యం గురించి మణిరత్నం ‘ఇరువర్’ (ఇద్దరు) తీశారు. తెలుగునాట అలాంటి జంట ఒకదాన్ని తీసుకుని రసవత్తరమైన కథగా, సినిమాగా మలచాలంటే ఏయన్నార్ - ఎన్టీయార్‌ల పేర్లే తడతాయి. తమిళ జంట వంటి కథ కాదిది. దీనిలో స్నేహం ఉంది, స్పర్థ ఉంది, పోటాపోటీ గ్రూపులు నడిపే సామర్థ్యం ఉంది, మళ్లీ ఇద్దరూ కలిసి కొత్త తరాన్ని అదుపు చేసే ప్రయత్నమూ ఉంది, వేడి చల్లారాక చేతులు కలిపి మళ్లీ నటించడమూ ఉంది. కొన్ని విషయాల్లో పోలిక ఉంది, మరికొన్ని విషయాల్లో వైరుధ్యమూ ఉంది.

వినడానికి ఇప్పుడు అతిశయోక్తిగా అనిపిస్తుందేమో కానీ,  ఒకప్పుడు ఏఎన్నార్, ఎన్టీయార్ పోలికలున్న రికార్డింగ్ డ్యాన్సు ఆర్టిస్టులు బజార్లోకి వచ్చినా జనం గుమిగూడి ఆరాధనగా చూసేవారు. పెళ్లిచూపుల్లో సైతం అవతలివారు ‘నాగ్గాడి’ ఫ్యానో, ‘ఎమ్టీవోడి’ ఫ్యానో తేల్చుకున్నాకే సంభాషణ ముందుకు సాగేది.
ఏయన్నార్, ఎన్టీయార్ తెలుగు సినిమా రంగపు తొలి దశలోనే హీరోలయ్యారు. 1950ల నుండి 80ల వరకు మూడు దశాబ్దాలు ఏలారు. 1940-49 మధ్య ఏడాదికి సరాసరి 8 సినిమాలు వస్తే, 1950లో 16 వచ్చాయి. 1950-59 మధ్య ఏడాదికి సగటున 23 వచ్చాయి. ఆ దశకంలోనే స్వాతంత్య్రానంతర భారతదేశం రెక్కలు విప్పుకోసాగింది. విద్యుత్ సౌకర్యం గ్రామాలకు విస్తరించి, థియేటర్లు రాసాగాయి. 1980 వచ్చేసరికి ఏడాదికి 118 సినిమాలు వచ్చాయి. అంటే వారానికి రెండు కంటే ఎక్కువ సినిమాలన్నమాట. ఏయన్నార్, ఎన్టీయార్ కెరియర్లు ఈ బూమ్ పీరియడ్‌తో పెనవేసుకున్నాయి. వాళ్లకు ముందున్న హీరోలు నారాయణరావు, నాగయ్య, రాఘురామయ్య వంటివారు. వాళ్లకున్న స్టార్ స్టేటస్‌ను మించి వీళ్లకు వచ్చింది.

  1950ల తర్వాత పౌరాణిక, జానపద సినిమాలు తగ్గి సాంఘిక సినిమాలు రాసాగాయి. ప్రజలు తమ సమస్యలను వాటిలో చూసుకుని హీరోలతో మమేకమవసాగారు. వీళ్లల్లో ఏ ఒక్కరి ప్రస్తావన వచ్చినా, ఇంకోరితో పోలిక ఆటోమ్యాటిక్‌గా వచ్చేసేది. ‘‘రహస్యం’లో ఎన్టీయార్ వేసి ఉంటే హిట్టయ్యేది’... వంటివి నటన గురించైతే, ‘నాగేశ్వరరావు లౌక్యుడు, ఎన్టీయార్‌లా బోళా మనిషి కాడు’ అనే వ్యాఖ్యలు స్వభావం గురించి!
నాగేశ్వరరావు అంటే చటుక్కున గుర్తుకువచ్చేది భగ్న ప్రేమికుడు. ప్రేమించిన అమ్మాయి కోసం త్యాగం చేసి ఆమె జీవితంలోంచి తొలగిపోయే మంచివాడు. అందుకే ఆయన ఆ ఇమేజీలో మిడిల్ క్లాస్ ప్రేక్షకుల హృదయంలో నిలిచిపోయాడు. ముఖ్యంగా స్త్రీలు ఈ పాత్రను ఆరాధించి, ఈ అపర దేవదాసును వాళ్ల మనసులో ప్రతిష్టాపించుకున్నారు.

ఎన్టీ రామారావు కూడా విషాద నాయక పాత్రలు వేసినా నాగేశ్వరరావంత కన్విన్సింగ్‌గా వేయలేదు. ఉత్తరాదిన దిలీప్‌కుమార్, దక్షిణాదిన నాగేశ్వరరావు. మన మజ్నూ ఆయనే. సలీమూ ఆయనే. దాంతో ఆ ముద్ర ఎంత గాఢంగా పడిపోయిందంటే ఎన్టీయార్‌లో ఉన్న నట వైవిధ్యం ఏయన్నార్‌లో లేదని అనాలోచితంగా అనేసేటంతగా! కానీ ఆలోచిస్తే తొలి జానపదాల్లో అక్కినేనే హీరో! బాలరాజు, కీలుగుఱ్ఱం, మాయలమారి, స్వప్నసుందరి, సువర్ణసుందరి, స్త్రీ సాహసం, రత్నమాల, ముగ్గురు మరాఠీలు... సాంఘికాల్లో బాగా పాతుకున్నాక కూడా రహస్యం, వసంతసేనలలో వేశారు. చరిత్రాత్మక పాత్రల గురించి చెప్పుకుంటే, పల్నాటి యుద్ధం, అమర శిల్పి జక్కన, చాణక్య చంద్రగుప్త, రామదాసు... పౌరాణిక పాత్రలంటే - చెంచులక్ష్మి, మాయాబజారు, కృష్ణార్జున యుద్ధం. నవలా నాయకుడూ ఆయనే - చక్ర భ్రమణం, సెక్రటరీ, విజేత, ప్రేమనగర్... శరత్ పాత్రలు అత్యధికంగా ధరించిన తెలుగు నటుడూ ఆయనే - దేవదాసు, తోడికోడళ్లు, బాటసారి! భక్తుడి పాత్రల్లో అయితే నాగేశ్వరరావు తర్వాతే ఎవరైనా. విప్రనారాయణ, భక్త తుకారాం, కుంభార్, బుద్ధిమంతుడు... ఇలా.

 త్యాగమూర్తి పాత్రల్లో అక్కినేనికి  పేరు వచ్చినా కామెడీ అదరగొట్టేశాడు. మిస్సమ్మ, పెళ్లిసందడి, బుద్ధిమంతుడు, చక్రపాణి, పెళ్లినాటి ప్రమాణాలు, గుండమ్మకథ, ప్రేమించి చూడు, గృహలక్ష్మి, బ్రహ్మచారి, అందాలరాముడు... ఇలా అనేకం గుర్తుకువస్తాయి. కొంటెతనం, చిలిపితనం ఆయనలో భలే పలుకుతుంది.
 నాగేశ్వరరావు గురించి ఏం తెలిసినా తెలియకపోయినా ఓ విషయం మాత్రం అందరికీ తెలుసు. ఆయన డబ్బున్నవాడు కాడు, చదువుకున్నవాడు కాడు, పల్లెటూరివాడు. అలాంటివాడు ఇంత పైకి ఎలా వచ్చాడు? ఎవరైనా పైకి రావాలంటే తనను తాను సమీక్షించుకోవాలి. నాగేశ్వరరావు ఆ పనిని నిరంతరం చేసుకున్నారు. కెరియర్ పట్ల ప్లానింగ్, పాత్ర పోషణలో సంయమనం ఆయనలో అడుగడుగునా కనబడతాయి. సీనియర్ల వద్ద నేర్చుకుంటూనే, తనకు ప్రత్యర్థిగా ఎదిగిన ఎన్టీయార్‌తో ఎలా తలపడాలి, తలపడి ఎలా నిలదొక్కుకోవాలి అన్నది బాగా అధ్యయనం చేసి, అమలు చేశారు.

 సినీరంగ ప్రవేశం చేసే నాటికి ఎన్టీయార్‌కు 26 యేళ్లు. ఏయన్నార్ కంటే ఏడాదిన్నర పెద్దయినా (1944 సీతారామ జననం నుండి లెక్కవేస్తే) ఐదేళ్లు వెనుకగా సినీరంగంలో ప్రవేశించారు. అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన నాగేశ్వరరావుని ఉలిక్కిపడేలా చేసిన రామారావు అర్హతలేమిటి? మంచి రూపం, మంచి శరీర సౌష్టవం, మంచి వాచికం, మంచి చదువు... అన్నీ మంచిలే! ఎన్నో లోపాలు అధిగమిస్తూ నాగేశ్వరరావు తన ప్రస్థానం సాగించారు. రామారావుకి ఆ బాధలు లేవు. హీ వాజ్ ఏ బోర్న్ హీరో! వస్తూవస్తూనే ఆయన హీరో అయిపోయారు. ఎన్టీయార్‌ని కలవడానికి వస్తూండగా దూరం నుండి చూసి బీఏ సుబ్బారావు, ‘‘ఇతను నా సినిమా హీరో అయితే ఎంత బాగుణ్ను’’ అనుకున్నారు. ఈయన దగ్గరకు వచ్చిన ఎన్టీయార్, ‘నేను ఫలానా’ అనగానే ‘అయితే నువ్వే నా హీరోవి’ అన్నారు. మేకప్ టెస్ట్ లేదు, వాయిస్ టెస్ట్ లేదు, వెయ్యి నూట పదహార్లు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసేసుకున్నారు.

 పాత్రలో జీవించడం అనే పదబంధం ఎన్టీయార్ విషయంలో అతికినట్టుగా మరెవరి విషయంలోనూ నప్పదు. ఏయన్నార్ ఎప్పుడూ అంటారు - ‘మనం పాత్రలో పూర్తిగా లీనం కాకూడదు. లీనమైనట్టు - నటించాలంతే! లేకపోతే తూకం తప్పుతాం. మనం వేరేగా ఉండి మన పాత్ర గమనాన్ని గమనించాలి’ అని. కానీ ఎన్టీయార్ పద్ధతి అది కాదు. ‘పల్లెటూరి పిల్ల’లో కోడెదూడతో పోట్లాడే దృశ్యంలో ఒడుపు తెలియక కుడిచేతి మణికట్టు విరగకొట్టుకున్నారు. ఈ లక్షణమే ఏయన్నార్‌ను, ఎన్టీయార్‌ను విడదీసి చూపుతుంది. ఎన్టీయార్ పౌరాణిక పాత్రల్లో చూపిన సంయమనం మామూలప్పుడు చూపలేదు. హీ వాజ్ ఆల్వేస్ ప్లేయింగ్ టూ ది గ్యాలరీ. ఇలాంటి వాళ్లని స్వాష్‌బక్లింగ్ హీరోస్ అంటారు. హీరోయిన్‌ను గాఢంగా హత్తుకోవడం, కత్తిని ముద్దు పెట్టుకోవడం, మారువేషం వేస్తూ వేస్తూ మధ్యలో మీసం పీకి ‘నేనేరా’ అన్నట్టు ప్రేక్షకులకేసి చూసి కన్నుకొట్టడం, విలన్‌ను చావగొట్టి చెవులు మూసి హాల్లో ఈలలు వేయించడం - ఇవన్నీ ఇలాంటి హీరోల లక్షణాలు. ఇవి చూస్తూ ప్రేక్షకుడు మైమరచిపోతాడు. వీటిలో హీరో మొరటుగా ఉంటాడు. హావభావాలు ప్రస్ఫుటంగా వ్యక్తం చేస్తాడు. చదువురానివాడికి కూడా అర్థమయ్యే రీతిలో హిస్ట్రియానిక్స్ ప్రదర్శిస్తాడు. అందువల్ల మధ్యతరగతివాళ్లు ముఖ్యంగా మధ్యతరగతి మహిళలు ఇలాంటి హీరోను ఆమోదించరు. నేల తరగతి వనితలు మాత్రం ఆరాధిస్తారు. ఎందుకంటే ఇతను ఎప్పుడూ మంచివాడిగానే ఉంటాడు. మోటు సరసాలాడతాడు. త్యాగాలు చేసి పారిపోకుండా కోరినదాన్ని పోరాడి దక్కించుకుంటాడు. తమిళంలో ఎమ్జీయార్ ఇటువంటి పాత్రలే వేశారు. ఆయనను గొప్ప నటుడిగా విమర్శకులు అంగీకరించకపోవచ్చు. కానీ పాటకజనం అతన్ని నెత్తిమీద పెట్టుకున్నారు.

 ‘బాలరాజు’తో స్టార్‌డమ్ వచ్చి కీలుగుర్రం, రక్ష రేఖ, శ్రీలక్ష్మమ్మ కథ, స్వప్నసుందరిలతో స్థిరపడినా, జానపదాలనే నమ్ముకోకుండా సాంఘికాల్లో కూడా వేస్తేనే భవిష్యత్తు ఉంటుందని నాగేశ్వరరావు ముందుగానే గ్రహించారు. అదీ ఆయన ఘనత. అప్పటికే ఎన్టీయార్ రంగప్రవేశం చేశారు. ఆయన విగ్రహం, వాచికం చూడబోతే అలాంటి పాత్రలకు సరిగ్గా సూటవుతాడనిపిస్తోంది. తను దేనికి బాగా సూటవుతాడా అని ఆలోచిస్తే సాంఘికాల దారి పట్టడమే మంచిదనిపించి ఉంటుంది. సాంఘికాలకు పనికిరాడు అన్న టాక్ వచ్చినా ఆ పాత్రలకు తగ్గట్టుగా మేకప్, దుస్తులు వేయించుకుని స్టిల్స్ తీయించుకుని నిర్మాతలకు చూపారు. సగం పారితోషికానికే ‘సంసారం’లో వేశారు. ఆ సినిమా హిట్ అయింది. ‘దేవదాసు’ తర్వాత సాంఘికాలంటే ఏయన్నారే తగును అనే పేరు వచ్చేసింది. రామారావును పౌరాణికాలు, జానపదాల్లో బాగా గుర్తుపెట్టుకున్నా ఆయన వేసిన వాటిల్లో సాంఘికాలే ఎక్కువ. వాటిలో పెళ్లిచేసి చూడు, మిస్సమ్మ, వద్దంటే డబ్బు, తిక్క శంకరయ్య వంటి కామెడీలు, చిరంజీవులు, ఇంటికి దీపం ఇల్లాలే, రక్తసంబంధం, ఆత్మబంధువు వంటి ట్రాజెడీలు ఉన్నాయి.

 ఎన్టీయార్‌ని తెలుగువారు ఎప్పటికీ మర్చిపోలేనట్టు చేసినవి పౌరాణికాలే! ఆయన పౌరాణిక పాత్రల నిర్వహణ గురించి ‘న భూతో... ఇప్పట్లో న భవిష్యతి’ అని చెప్పగలం. నాగేశ్వరరావు వేసిన పాత్రలు ఆ తరువాత శోభన్‌బాబు వేశారు, తర్వాత నాగార్జున వేశారు, జగపతిబాబు వేశారు. ఏదో ఒక స్థాయిలో, ఎంతో కొంత దూరంలో ఆయన స్థానానికి చేరువగా వచ్చారు. కానీ ఎన్టీయార్ పౌరాణిక పాత్రల దగ్గరికి వచ్చేసరికి ఆయనలా ఒప్పించినవారు అరుదు. అరుదు అని ఎందుకనాలంటే కాంతారావూ కృష్ణుడు వేషం వేశారు, హరనాథూ వేశారు. బాగానే చేశారు. ‘సంపూర్ణ రామాయణం’లో శోభన్‌బాబూ వేసి నప్పించారు. రావణుడిగా, దుర్యోధనుడిగా, కీచకుడిగా ఎస్వీ రంగారావు గొప్పగా రాణించారు. అయితే ఎన్టీ రామారావు ఒక్కరే అన్ని రకాల పౌరాణిక పాత్రల్లోనూ నప్పారు. అది తెలిసిన ఏయన్నార్ పౌరాణికాల్లో భారీ పర్సనాలిటీ అవసరం లేని, గుక్క తిప్పుకోకుండా డైలాగులు చెప్పనక్కరలేని పాత్రలే ఎంచుకున్నారు. దుర్యోధనుడు లాంటివి వేసి హైరాన పడలేదు, పెట్టలేదు.

  ‘మాయాబజారు’లో అభిమన్యుడిది ఆహార్యం మార్పు తప్ప సాంఘిక సినిమాల్లో రొమాంటిక్ టైపు రోలే! కొంటెగా మాట్లాడే ‘భూకైలాస్’లో నారదుడి పాత్ర, రసికత్వమే ప్రధానంగా - చెంచులక్ష్మి, కృష్ణ మాయ, శ్రీకృష్ణార్జున యుద్ధం... ఇలాంటివే వేశారు. రామారావు ఎన్ని పాత్రలు వేసినా అన్నీ రాజసం ఉన్నవే. నాగేశ్వరరావు బ్రాహ్మణ పాత్రలు, కవి పాత్రలు వేసి చక్కగా ఒప్పించారు. రామారావు వేయలేదు, వేసినా నప్పేది కాదేమో! ‘శ్రీనాథుడు’ బ్రాహ్మణుడే కానీ రాజసం జాస్తి. కవి పాత్రలన్నీ ఏయన్నార్ వేసినవే - జయదేవ, కాళిదాసు, క్షేత్రయ్య, తెనాలి రామకృష్ణ.


ఏయన్నార్, ఎన్టీయార్ తమకు నప్పిన పాత్రలను ఎలా ఎంచుకునేవారో ఒక్క ఉదాహరణ. ‘తెనాలి రామకృష్ణ’లో వారిద్దరూ పాత్రలు తారుమారు చేసుకుని ఉంటే సినిమా ఆడి ఉండేది కాదు. ఈ ఎరిక ఏయన్నార్‌కు బాగా ఉంది. ‘చాణక్య-చంద్రగుప్త’ తీస్తూ ఎన్టీయార్ ‘బ్రదర్! నువ్వు చంద్రగుప్తుడు, నేను చాణుక్యుడు వేద్దామా?’ అని అడిగితే నాగేశ్వరరావు - చాలా కాలిక్యులేటెడ్ కదా - ‘వద్దులే, ఇలాగే కానీ’ అన్నారట. వినోదా వారి ‘కన్యాశుల్కం’లో గిరీశం పాత్ర ఇస్తే నాగేశ్వరరావు వద్దనేశారు విలనిక్ షేడ్ ఉందని. ఎన్టీయార్ వేసేశారు. అలాగే ‘చింతామణి’లో వేశ్యకు విటుడిగా బిల్వమంగళుడి పాత్ర. ఏయన్నార్ వద్దన్నారు, ఎన్టీయార్ సరేనన్నారు. ఆయనకు అన్ని రకాల పాత్రలు వేయాలన్న తపన ఎక్కువ. ‘రాజు పేద’లో తాగుబోతు పాత్ర, ‘భీష్మ’లో ముసలి పాత్ర, ‘కలిసి వుంటే కలదు సుఖం’లో అవిటివాడి పాత్ర, ‘నర్తనశాల’లో ఆడంగి పాత్ర... నాగేశ్వరరావుకు పాత్రల ఎంపికపై కచ్చితమైన లెక్కలున్నాయి. 1971లో ‘దసరాబుల్లోడు’ రిలీజైంది. నాగేశ్వరరావు హఠాత్తుగా కుర్రవేషాలేస్తూ స్టెప్పులు మొదలెట్టారు. అది ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్.

 ఎన్టీయార్ విషయంలో ఈ పీరియడ్ నటుడిగా ఆయన స్థాయి తగ్గించింది. 1972 నాటికి ఆయన ‘బడిపంతులు’లో అద్భుతంగా నటించారు. 49 యేళ్లకే శరీరం భారీగా పెరిగిపోయింది. నాగేశ్వరరావులా ఆయన శరీరాన్ని అదుపులో పెట్టుకోలేదు. అప్పుడు కనుక ఆయన రిటైరై ఎప్పుడో అప్పుడొకటీ ఇప్పుడొకటీ వేస్తూ ఉంటే హుందాగా ఉండి ఉండేది. కానీ అప్పుడాయన  విన్నింగ్ స్ట్రీక్‌లో ఉన్నాడు. జంజీర్, దీవార్, యాదోంకీ బారాత్ వంటి అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర హిందీ సినిమాల తెలుగు వెర్షన్లలో వేయడం మొదలెట్టాడు. వల్గారిటీ చేరింది. స్టెప్స్ వేయడం మొదలైంది. నాగేశ్వరరావు వేస్తే భరించగలిగాం కానీ ఈయన వేస్తే బాబోయ్ అనిపించింది. పెద్ద పొట్ట, దాన్ని దాచుకోవడానికి కోటు, కింద బెల్‌బాటమ్ పాంట్. ఈ ధోరణిలో సాగుతూండగానే అడవిరాముడు  సూపర్ డూపర్ హిట్. అక్కణ్నుంచి యమగోల, వేటగాడు, డ్రైవర్ రాముడు, ఆటగాడు, సూపర్‌మ్యాన్ - చిత్రం ఏమిటంటే, ఇవన్నీ హిట్ అయ్యాయి. అప్పట్లో ఈయన తీసిన పౌరాణికాలన్నీ పరాజయం పాలయ్యాయి. రామారావు యువతరానికి చేరువైంది ఈ సినిమాల ద్వారానే. వాళ్లే ఆయనకు రాజకీయాల్లో ఓట్ బ్యాంక్ అయ్యారు. చివరికి వచ్చేసరికి బొబ్బిలిపులి, కొండవీటి సింహం - ఇవన్నీ అప్పటి మూడ్‌లో హిట్ కావచ్చు కానీ నటుడిగా ఆయన స్థాయిని దిగజార్చాయని వ్యాసకర్త వ్యక్తిగత అభిప్రాయం.

  ఎన్టీయార్ దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా ఉన్నత స్థానంలో ఉండగానే తప్పుకుని తన ఆధిక్యతను చాటుకున్నారు. ఏయన్నార్ నటజీవితం చాలా ఏళ్లు సాగింది. అయితే మూసపాత్రలు రాకుండా చూసుకున్నారు. అదీ కెరియర్ ప్లానింగంటే! గ్లామర్ తగ్గాక ఆయన అత్యున్నతమైన నటన కనబరిచినది సీతారామయ్యగారి మనవరాలు (1992)లో. 50 ఏళ్లలో, 231 సినిమాల ద్వారా నేర్చుకున్నది ‘అన్‌లెర్న్’ చేసుకుని ఫ్రెష్‌గా వేశారాయన.

 ఎన్టీయార్‌లాగే ఏయన్నార్ కూడా నిర్మాతగా మారారు, స్టూడియో కట్టారు. కానీ దర్శకుడిగా మారలేదు. ఎన్టీయార్‌కి ముందు నుండీ అభ్యుదయ భావాలున్నాయి. సాంఘిక ప్రయోజనం ఉన్న సినిమాలు తీయాలి అనుకుని, సినిమా రంగానికి వచ్చిన 3, 4 యేళ్లలోనే ‘పిచ్చిపుల్లయ్య’, ‘తోడు దొంగలు (దానిలో 60 ఏళ్ల పాత్ర) వంటి మంచి సినిమాలు తీశారు. అదే నాగేశ్వరరావైతే నిర్మాతగా తొలి చిత్రం జానపద సినిమా! రంగానికి వచ్చిన పాతికేళ్లకు ‘సుడిగుండాలు’, ‘మరోప్రపంచం’ తీశారు. ఎన్టీయార్ తీసిన తొలి రెండు సినిమాలు దెబ్బతిన్నాయి. చాలా నిరాశకు లోనై, కత్తి పడితే తప్ప తన సంస్థ నిలదొక్కుకోదని గ్రహించాడు. ‘జయసింహ’తో ఎన్‌ఏటీ సంస్థ నిలబడి అనేక మంచి సినిమాలు తీసింది కానీ అన్నీ కమర్షియల్సే! ఆర్ట్ సినిమాల జోలికి పోలేదు.

 ఎన్టీయార్, ఏయన్నార్ ఇరువురి వారసులూ సినీరంగంలో వెలుగుతున్నారు. ఎన్టీయార్ రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ సంచలనం సృష్టించారు. ఏయన్నార్ సినీరంగాన్ని వదలలేదు. మద్రాసు నుండి హైదరాబాద్‌కు చిత్రపరిశ్రమను తరలించడంలో హీరోయిజం ప్రదర్శించినది నాగేశ్వరరావే. ఆ విషయంలో ఈయన క్యాంపుకు, ఎన్టీయార్ మద్రాసు క్యాంపుకు ఎలాంటి గొడవలుండేవో, మధ్యలో ఆర్టిస్టులు ఎలా నలిగేవారో గుమ్మడి ఆత్మకథ చదివితే తెలుస్తుంది. వ్యక్తిగతంగా ఈ ఇద్దరు నటులు బహిరంగంగా దూషించుకున్నది లేదు. కుటుంబాల పరంగా సత్సంబంధాలు పాటించారు.

 తెలుగుజాతికి సంబంధించినంతవరకూ వీరిద్దరూ మ్యాటినీ ఐడాల్స్ మాత్రమే కాదు, సోషల్స్ ఐకాన్స్ కూడా! చాలామంది నాటక కళాకారులు రంగస్థలంపైకి తాగి వచ్చి ప్రదర్శన రసాభాస చేసేవారు. జీవిత చరమాంకంలో డబ్బు లేక అల్లాడేవారు. వేదికపై వాళ్ల నటనను మెచ్చేవారు కూడా విడిగా వారితో కలవడానికి ఇచ్చగించేవారు కారు. సినిమా రంగం నాటక రంగానికి కొనసాగింపు కాబట్టి సినిమావాళ్లు కూడా ఇలాగే ఉంటారని జనం అనుకునేవారు. అందుకే దగ్గరి బంధువులు కూడా సినిమా నటులకు పిల్లనిచ్చేవారు కారు. క్రమేపీ ఈ ఇమేజీ మారడానికి కారణం ఏయన్నార్, ఎన్టీయార్‌లే.  వాళ్లు తమ వ్యక్తిగత జీవితాలపై మచ్చ రాకుండా చూసుకోగలిగారు. ఎన్టీయార్ సినిమా రంగానికి వచ్చేటప్పటికే వివాహితుడు. వచ్చాక కూడా భార్యను విడిచి పెట్టలేదు. సాధారణ గృహస్తులాగే పిల్లల్ని కనడం, వాళ్లకు విద్యాబుద్ధులు చెప్పించడం, పెళ్లిళ్లు పేరంటాలు చేయించడం అవీ జరిపారు. ఏయన్నార్‌కు సినిమాలకు వచ్చాకనే పెళ్లయింది. సినిమాల్లో గ్లామర్ బాయ్‌గా ఉన్నా, ఇంటి దగ్గర మామూలు ఇంటాయనలాగానే ఉన్నారు. పిల్లల చదువుల గురించి హైదరాబాద్‌కి తరలి రావడం, తెలిసిన కుటుంబాల నుంచి అల్లుళ్లను తెచ్చుకోవడం, మీ ఇంటి పక్క పెద్దమనిషి ఎలా చేస్తాడో అలాగే చేశారు. భార్య పేర స్టూడియో కట్టారు. ఆవిడ చివరి ఐదేళ్లూ మంచాన పడితే జాగ్రత్తగా చూసుకున్నారు.

 ఏఎన్నార్, ఎన్టీయార్ ఇద్దరూ సాంస్కృతిక సభలకు, కాలేజీలకు, బంధువుల ఇళ్లల్లో ఫంక్షన్లకు వచ్చినప్పుడు మామూలు తెలుగు పెద్దమనిషి తరహాలో పంచెకట్టుతోనే వచ్చారు. రంగు రంగు డ్రెస్సులన్నీ ఉద్యోగ ధర్మంగా వేసుకున్నవే తప్ప విడిగా మేము హుందాగా ఉండేవాళ్లమేనని చాటిచెప్పారు. వారికి భాషపై గల పట్టు కూడా ప్రత్యేకించి ప్రస్తావించాలి. వారి తెలుగు ఉచ్ఛారణ శుద్ధంగా ఉండటం వలన, చక్కటి పదసంపద ఉండటం వలన వారు మనల్ని ప్రభావితం చేయగలిగారు. మన పాలిట వీళ్లు గ్లామరస్ టీచర్స్. ప్రేక్షకులకే కాదు. తర్వాత సినీరంగానికి వచ్చిన నటీనటులకు కూడా.
 - ఎమ్బీయస్ ప్రసాద్

 ఏయన్నార్, ఎన్టీయార్ తమకు నప్పిన పాత్రలను ఎలా ఎంచుకునేవారో ఒక్క
 ఉదాహరణ. ‘చాణక్య-చంద్రగుప్త’ తీస్తూ ఎన్టీయార్ ‘బ్రదర్! నువ్వు చంద్రగుప్తుడు, నేను చాణుక్యుడు వేద్దామా?’ అని అడిగితే నాగేశ్వరరావు - చాలా కాలిక్యులేటెడ్ కదా - ‘వద్దులే, ఇలాగే కానీ’ అన్నారట.

  ఎన్టీయార్ దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా ఉన్నత స్థానంలో ఉండగానే తప్పుకున్నారు. ఏయన్నార్ నటజీవితం చాలా ఏళ్లు సాగింది.

 తెలుగుజాతికి సంబంధించినంతవరకూ వీరిద్దరూ మ్యాటినీ ఐడాల్స్ మాత్రమే కాదు, సోషల్స్ ఐకాన్స్ కూడా!ఫంక్షన్లకు వచ్చినప్పుడు మామూలు తెలుగు పెద్దమనిషి తరహాలో పంచెకట్టుతోనే వచ్చారు. రంగు రంగు డ్రెస్సులన్నీ ఉద్యోగ ధర్మంగావేసుకున్నవే తప్ప విడిగా మేము హుందాగా ఉండేవాళ్లమేనని చాటిచెప్పారు.

Wednesday, January 22, 2014

శిఖరం ఒరిగింది... అక్కినేని అస్తమించారు...

 ప్తి తెలుగువాడికీ శరాఘాతం ఈ మాట. కానీ తప్పదు. గుండెను దిటవు చేసుకోక తప్పదు. ‘కన్నీళ్లకే బతికించే శక్తి ఉంటే.. అవి ఏనాడో కరువైపోయేవి’ అన్నాడు ఆయనే ఓ సినిమాలో. అందుకని వాటిని ఆపగలమా? కట్టలుతెగిన విషాదానికి అడ్డుకట్ట వేయగలమా? ఏడు దశాబ్దాల పాటు తన నటనతో రంజిపంజేసి.. ప్రేక్షకుల్ని రుణగ్రస్తుణ్ణి చేశాడాయన. ఆయన పంచిన ఆనందాన్ని మరిచిపోవడం తేలికైన విషయం కానేకాదు. మనిషి అనేవాడు ఎలా బతకాలో ఆయన పాత్రలు చెప్పాయి. ఎలా బతక్కూడదో ఆయన పాత్రలు చెప్పాయి. సంఘాన్ని సంస్కరించేంత గొప్ప పాత్రలు పోషించిన ఘనత ఆయనది. ఈ వయసులో కూడా మూడు తరాలకు చెందిన తన కుటుంబ సభ్యులతో కలిసి నటించిన నవ యువకుడు అక్కినేని. కుటుంబసభ్యులతో కలిసి ఆయన నటించిన చివరి సినిమా ‘మనం’ త్వరలోనే విడుదల కానుంది.

దటీజ్ అక్కినేని...
ఎన్నెన్ని ప్రేమ కావ్యాలు, ఎన్నెన్ని కుటుంబ గాధలు, ఎన్నెన్ని ఆధ్యాత్మికానందాలు, ఎన్నెన్ని పురాణపాత్రలు.. ఒకానొక దశలో తెరపై మానవ బంధాలన్నింటిలో అక్కినేనినే చూసుకుంది ప్రేక్షకలోకం. ప్రేమికుడంటే అక్కినేని. కొడుకంటే అక్కినేని. భర్త, అన్న, తమ్ముడు, మరిది, తండ్రి, తాత.. ఇలా అన్ని బంధాల్లో అక్కినేనినే చూసుకున్నారు. తెలుగుతెరపై అజరామరమైన సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రలతో రంజింపజేసి ‘నటసామ్రాట్’ బిరుదుని సార్థకం చేసుకున్నారాయన...
పట్టుదలకు పర్యాయపదం అక్కినేని...
కార్యదీక్షను ఇంటిపేరుగా మార్చుకున్న నిత్య కృషీవలుడు అక్కినేని..
నిరంతరం నటననే శ్వాసించిన అభినయ నటరాజు అక్కినేని...
చెన్నపట్టణంలో వేళ్లూనుకుపోయిన.. మన సినిమాను తెలుగునేలకు తరలించిన అభినవ భగీరథుడు అక్కినేని...
82 ఏళ్ల తెలుగు సినిమాతో.. 72ఏళ్ల పాటు ప్రయాణించి తెలుగు సినీ సహోదరుడు అక్కినేని...
అక్కినేని జీవన ప్రస్థానంలో ఎన్నో మలుపులు. ఎన్నో ఒడిదుడుకులు.
హీరోగా నిలదొక్కుకోడానికి ఆయన చేసిన సాహసాలు ఎన్నో. విమర్శించిన వారితోనే పొగిడించుకున్న దీక్షాదక్షుడు అక్కినేని
అక్కినేని బాల్యం
కృష్ణాజిల్లా గుడివాడ తాలూకాలోని వెంకటరాఘవపురంలో (ప్రస్తుతం రామాపూరం) 1924 సెప్టెంబర్ 20న పున్నమ్మ, వెంకటరత్నం దంపతులకు జన్మించారు అక్కినేని నాగేశ్వరరావు. నిజానికి అక్కినేని కుటుంబంలో కళాకారులు లేరు. కళ అనేది దైవదత్తంగా ఆయనకు అబ్బింది. చిన్నతనం నుంచే నాటకల్లో వేషాలు వేసేవారాయన. అక్కినేని ధరించిన తొలి పాత్ర ‘నారదుడు’. వెంకటరాఘవపురంలో పిల్లలందరూ కలిసి వేసిన ‘సత్యహరిశ్చంద్ర’ నాటకంలో పట్టుబట్టి అక్కినేనితో నారద పాత్రను వేయించారు. కారణం ఆ ఊళ్లో ఆయన మంచి పాటగాడు కావడమే. ఆ తర్వాత ఏఎన్నార్ నటించిన పాత్ర చంద్రమంతి. తర్వాత ‘కనకతార’ అనే నాటకంలో తారగా నటించారు. అప్పట్నుంచీ నాటకాల్లో స్త్రీ వేషాలు విరివిగా రావడం మొదలయ్యాయి. ‘సత్యహరిశ్చంద్ర’ నాటకంలో మాతంగకన్య, ‘భక్తకుచేల’ నాటకంలో మోహిని, ‘సారంగధర’ నాటకంలో చెలికత్తె పాత్ర ఇలా ఖాళీ లేకుండా నాటకాలు వేస్తూ ఉండేవారు. రంగస్థల కళాకారునిగా అక్కినేని తొలి పారితోషికం అర్థరూపాయి. ఆ స్థాయి నుంచి అయిదొందలు తీసుకునే స్థాయికి ఎదిగారు. అమ్మ, అన్న ప్రోత్సాహం వల్లే రంగస్థలంపై రాణించగలిగానని చెబుతూ ఉండేవారు అక్కినేని. అప్పట్లో అక్కినేని కుటుంబానికి ఓ పాతిక ఎకరాలు పొలం ఉండేది. అందుకే ఆయన్ను అందరూ చిన్నదొర అంటుండేవారు. కలిగిన కుటుంబంలో పుట్టినా... డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారాయన. ప్రతి ఏడాదీ కుప్పనూర్పిళ్ల సమయంలో... పొలంలో కష్టపడితే ఓ పావలా వచ్చేది. ఆ డబ్బుతో దాపుడు చొక్కా కొనుక్కునేవారు. భజనల్లో గెంతడాలు, కోలాటాలు ఆయనకు చాలా ఇష్టం. ఆ విధంగా చిన్నతనం నుంచే అక్కినేనికి తాళజ్ఞానం అలవడింది. ఇప్పుడు నడుస్తున్న డాన్స్‌ల ట్రెండ్‌కి బీజం అక్కడ పడిందనమాట.

విఫలమైన తొలి సినీ అవకాశం
1940లో వచ్చిన ‘ధర్మపత్ని’ అక్కినేని తొలి సినిమా అని అందరికీ తెలిసిందే. కానీ నిజానికి ఆ సినిమాకంటే ముందే అక్కినేనికి సినీ అవకాశం వచ్చింది. ఆ సినిమా పేరు ‘తల్లిప్రేమ’. జ్యోతి సిన్హా దర్శకుడు. కథ రిత్యా అందులో ఓ పధ్నాలుగేళ్ల కుర్రాడి పాత్ర ఉంది. దానికి అక్కినేనిని ఎంపిక చేసి మద్రాసు తీసుకెళ్లారు ప్రముఖ నిర్మాత కడారు నాగభూషణం. షూటింగ్ జరుగుతోంది. కానీ ఆయన పాత్ర మాత్రం రావడం లేదు. అలా నాలుగు నెలలు అక్కడే ఉన్నారు అక్కినేని. తన పాత్ర ఎప్పుడొస్తుందో అని ఆయన ఎదురు చూస్తున్న సమయంలో... కథలో లెంగ్త్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ పాత్రను తీసేశామని బాంబు పేల్చారు. నాలుగు నెలలు అక్కడే ఉన్నందుకు వంద రూపాయలు ఇచ్చి అక్కినేనిని పంపించారు. కానీ ఆయన వెంకటరాఘవపురానికి నిరాశతో రాలేదు. సీఎస్‌ఆర్ ఆంజనేయశాస్త్రి, కన్నాంబ లాంటి మేటి నటుల్ని చూశానని ఆనందంతో ఆయన వెనుదిరిగారు. ‘దేవదాసు’ నిర్మాత డీఎల్ నారాయణను అక్కినేని తొలిసారి కలిసింది అప్పుడే. ఆ టైమ్‌లో డీఎల్ ప్రొడక్షన్ మేనేజర్. ఉత్తరకాలంలో అక్కినేని హీరో అవుతారని, ఆయనతో డీఎల్ ‘దేవదాసు’ లాంటి అజరామర ప్రేమ కావ్యాన్ని తీస్తారనేది కాలానికి మాత్రమే తెలిసిన భవిష్యవాణి.

తొలిసినిమా ‘ధర్మపత్ని’
పి.పుల్లయ్య దర్శకత్వంలో ‘ధర్మపత్ని’ సినిమా షూటింగ్ కొల్హాపూరులో మొదలైంది. అందులోని ఓ పిల్లాడి వేషం కోసం అక్కినేని తీసుకున్నారు. అయితే... అప్పటికే ఆయన వయసు 16 ఏళ్లు. దాంతో... ఆ వేషానికి పెద్దవాడైపోయాడనే ఉద్దేశంతో అక్కినేనికి గుంపులో గోవింద లాంటి వేషం ఇచ్చారు పుల్లయ్య. ఆ సినిమాలోని పిల్లలపై తీసిన ఓ పాటలో అక్కినేని కనిపిస్తారు. అందులో అక్కినేనికి ఒక్క డైలాగు లేకపోయినా... తొలిసారి తెరపై కనిపించారు. సో... ఆ విధంగా చూసుకుంటే అక్కినేని తొలి సినిమా ధర్మపత్నే.

నట ప్రస్థానం...
ముగ్గురు మరాఠీలు(1946) మాయాలోకం(1945) చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న అక్కినేనికి ‘బాలరాజు’(1948) చిత్రం స్టార్‌ని చేసింది. ఆ వెంటనే వచ్చిన మరో జానపదం ‘కీలుగుర్రం’(1949) ఆయన్ను నంబర్‌వన్‌ని చేసింది. దేవదాసు(1953), అనార్కలి(1955), బాటసారి(1961), మూగమనసులు(1964), మనసేమందిరం,(1966), ప్రేమనగర్(1971), దేవదాసు పళ్లీపుట్టాడు(1978), ప్రేమాభిషేకం(1981), ప్రేమమందిరం(1981), అమరజీవి(1983)... ఇలా చెప్పుకుంటూ పోతే... ఎన్నో ప్రేమకథలు. దక్షిణాదిన ఇన్ని ప్రేమకథల్లో నటించిన హీరో మరొకరు లేరు. అందులోనూ పాత్ర పాత్రకూ వ్యత్యాసం. అక్కినేని భక్తునిగా పేరుతెచ్చిన చిత్రాలు విప్రనారాయణ(1954), భక్తజయదేవ(1961), భక్తతుకారం(1973), మహాకవి క్షేత్రయ్య(1976), చక్రధారి(1977), శ్రీరామదాసు(2006). ఇక అక్కినేని నటించిన సాంఘిక చిత్రాల గురించి చెప్పడమంటే సాహసమే!