Sunday, January 27, 2013

జానపద జగన్మోహనుడు- విఠలాచార్య

‘జురాసిక్ పార్క్’లో రాక్షస బల్లుల్ని చూసి స్పీల్‌బర్గ్‌కి సాహో అన్నాం.‘అవతార్’లో పండోర గ్రహ వాసుల్ని తిలకించి జేమ్స్ కేమరూన్‌కి హేట్సాఫ్ చెప్పాం. వాళ్లకంటే హైటెక్ కెమెరాలున్నాయ్! అడ్వాన్స్ గ్రాఫిక్సులున్నాయ్!!
మిలియన్ డాలర్ల బడ్జెట్‌లున్నాయ్!!! విఠలాచార్య దగ్గర ఇవేవీ లేవు. ఓ మిఛెల్ కెమెరా... రెండు, మూడు సెట్లు...
50, 60 వర్కింగ్ డేసు... మూణ్ణాలుగు లక్షల బడ్జెట్టు... వీటితోనే వెండితెరపై ఓ మంత్రనగరి సృష్టించిపారేశాడు. మంత్రాలూ మంత్రాంగాలు... పరకాయ ప్రవేశాలు... గుర్రపు స్వారీలు... కత్తి ఫైటింగులు... వింత పక్షులు, జంతువులు... పుర్రెలు అస్థిపంజరాలు... అబ్బో విఠలాచార్య సినిమా చూస్తుంటే మనకంటూ ఓ కొత్తలోకం తయారుగా ఉన్నట్టుంటుంది. ఎన్నేళ్లు గడిచినా విఠలాచార్య సినిమా మనల్ని ఊరించే, ఊయలూగించే ఓ మహేంద్రజాలం.
ఈ నెల 28న ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం...
 

అరిసికరైలో విఠలాచార్య చాలా ఫేమస్. అరిసికరై అంటే కర్ణాటకలో చిన్న తిరుపతిలాంటిది. అక్కడి నుంచి అసలు తిరుపతికి భూమిలోంచి సొరంగమార్గం ఉందని నమ్మిక. అక్కడ విఠలాచార్యకో ఉడిపి హోటల్ ఉంది. తాలింఖానా ఉంది. ఆ హోటల్లో టిఫిన్ తింటే ఇక భోంచేయనవసరం లేదు. తాలింఖానా వస్తాదుల అడ్డా. రమణారెడ్డి లాంటోణ్ణి కూడా రాజనాలలా తయారు చేస్తారక్కడ. అది విఠలాచార్య సొంత ఊరేంకాదు. వాళ్లది ఉడిపి పక్కనున్న బెల్లి అనే పల్లెటూరు. విఠలాచార్యకు చదువు అబ్బలేదు కానీ, లోకజ్ఞానం బోలెడు. స్నేహితులతో కూర్చుని ఎప్పుడూ కథలూ కాకరకాయలూ. మంత్రాలూ తంత్రాలూ సాహసాలూ కలగలసిన రాజుల కథలన్నీ చదివేసి తానే రాజకుమారుడైపోయినట్టు ఒకటే కలలు. 

విఠలాచార్య తొమ్మిదేళ్ల వయసులో హోటల్లో పనిచేశాడు. తర్వాత దాన్నే కొనిపారేశాడు. ఓ పక్క బిజినెస్‌లో బిజీగా ఉంటూనే, మరో పక్క నాటకాల్లో వేషాలు, కత్తిసాములు, కుస్తీ పట్లు. ఏదైనా కుస్తీ పోటీకి వెళ్తే విఠలాచార్య ట్రూప్ ఖాళీ చేతులతో వచ్చేది కాదు. అదే సమయంలో స్వాతంత్య్రోద్యమం ఊపందుకుంది. గాంధీజీ పిలుపు మేరకు కుర్రాళ్లంతా రామదండుల్లా కదలసాగారు. వాళ్లల్లో విఠలాచార్య కూడా ఉన్నాడు. లాఠీ దెబ్బలు తిన్నాడు. జైలుకి కూడా వెళ్లాడు. ఆ ఊళ్లోనే బ్రూక్ బాండ్ ఏజెన్సీ నడిపే శంకర్‌సింగ్, విఠలాచార్యకు మంచి దోస్త్. శంకర్‌సింగ్‌కి సినిమా ఫీల్డ్‌తో టచ్ ఉంది. శంకర్‌సింగ్, విఠలాచార్య ఇంకొంతమంది కలిసి మైసూర్‌లో రెండు టూరింగ్ టాకీసులు అద్దెకు తీసుకున్నారు. ఏ సినిమాకి గల్లాపెట్టె నిండుతుంది, ఏ సీన్‌కి విజిల్స్ పడుతున్నాయన్నది విఠలాచార్యకు అర్థమవుతోంది. జెమినీ వారి జానపదాలొస్తే థియేటర్ హౌస్‌ఫుల్. అసలే జానపద కథలు ఔపోసన పట్టిన విఠలాచార్యకు జానపద సినిమాలంటే ప్రేమ మొదలైపోయింది.

టూరింగ్ టాకీస్ వ్యాపారం లాభాలు తీసుకురావడంతో ఈ మిత్ర బృందం కన్ను సినిమా నిర్మాణంపై పడింది. ‘మహాత్మ పిక్చర్స్’ పెట్టి మొదట కన్నడంలో ‘కృష్ణలీల’ తీశారు. పెద్ద హిట్టు. అదే జోరు మీద ‘భక్త రామదాస’ తీస్తే గూబ గుయ్‌మంది. డబ్బులన్నీ పోయాయి. జీప్ మిగిలింది. దాంతోనే మళ్లీ బతుకు ప్రయాణం మొదలుపెట్టాలి. మైసూర్ రైల్వేస్టేషన్ నుంచి అరిసికరైకు టాక్సీలా తిప్పారు. కాసేపు శంకర్‌సింగ్ డ్రైవర్ అయితే, విఠలాచార్య కండక్టర్. ఇంకాసేపు విఠలాచార్య డ్రైవ్ చేస్తే, శంకర్‌సింగ్ డబ్బులు వసూలు చేసేవాడు. ఏ పిచ్చి అయినా వదులుతుందేమో కానీ, సినిమా పిచ్చి మాత్రం జీవితాంతం వదలదంటారు. జేబులో కాసులు గలగలలాడడం మొదలు కాగానే మళ్లీ వీళ్లల్లో సినిమా టిమటిమలు మొదలయ్యాయి. ఈసారి జానపదాన్ని నమ్ముకున్నారు. వాళ్లు తీసిన ‘నాగ కన్నిగె’ సినిమా కాసుల వర్షం కురిపించింది.

ఈ మూడు సినిమాల అనుభవంతో ఈసారి విఠలాచార్యనే డెరైక్షన్ చేశారు. సినిమా పేరు ‘జగన్మోహిని’ (1953). కన్నడంలో తొలి సిల్వర్ జూబ్లీ. అయితే డెరైక్టర్‌గా విఠలాచార్య తన పేరు వేసుకోకుండా శంకర్‌సింగ్ పేరు పెట్టారు. ఆ తర్వాత చాలా సినిమాలు తీశారు. బోలెడంత పేరు ప్రఖ్యాతులు. అయితే ఓ వివాదం వల్ల విఠలాచార్య మళ్లీ కన్నడ సినిమా తీయకూడదని ఒట్టు పెట్టుకున్నారు. కొంతమంది కన్నడ జర్నలిస్టులు ఈయన మీద వరుసగా విమర్శల బాణాలు ఎక్కుపెడుతుండేవారు. దాంతో ఆయనకు ఒళ్లు మండి జర్నలిస్టుల బాగోతాలమీద ఓ వ్యంగ్య చిత్రం తీశారు. వాళ్లేమో కోర్టుకెక్కారు. సినిమా ఫ్లాపయినా, కోర్టులో విఠలాచార్య సక్సెసయ్యారు. దాంతో వాళ్లు రాజీకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు కన్నడ సినిమాలు చేయాలన్న ఆసక్తి చచ్చిపోయింది. దానికి తోడు తన జాతకంలో పరభాషలో సినిమాలు చేస్తేనే ఫలితం అని రాసి పెట్టి ఉంది. దాంతో తన మకాం మొత్తం మద్రాసుకు మార్చేశారు.

1955... విఠల్ ప్రొడక్షన్స్ బేనర్‌లో ‘కన్యాదానం’ సినిమా. తెలుగులో విఠలాచార్యకు తొలి ప్రయత్నం. కాంతారావు హీరో. ‘షావుకారు’ జానకి హీరోయిన్. అప్పటికి విఠలాచార్యకు తెలుగు ఒక్క ముక్క కూడా రాదు. షూటింగ్ మొదలయ్యేలోపు తెలుగు నేర్చేకోవాలని పట్టు పట్టాడాయన. సాధించాడు కూడా. అయితే ‘కన్యాదానం’ ఆయనకు లాభించలేదు. తర్వాత ‘వద్దంటే పెళ్లి’. అదీ ఫలించలేదు. అప్పుడు ఆయనకు తన ఒరలో ఉన్న బ్రహ్మాస్త్రం గుర్తుకొచ్చింది. అదే ‘జానపదం’.

కాంతారావు, రాజనాలతో తీసిన ‘జయ విజయ’ బాగా ఆడింది. ఇక అక్కడ నుంచీ ఒక్కో జానపదం ఎక్కుపెడుతూ ఉంటే బాక్సాఫీస్‌కి గురి తప్పేది కాదు. తెలుగులో అంతకుముందు జానపదాలు వచ్చాయి. అవో తరహా. విఠలాచార్య స్కూలే వేరు. అంతా మాస్ స్టయిల్. నో లాజిక్స్.. ఓన్లీ మేజిక్స్. ఒకే తాను ముక్కల్లా అనిపించే కథలు. స్టార్ల హంగామా అస్సల్లేదు. పరిమితమైన బడ్జెట్. అయినా జనాలు విఠలాచార్య సినిమా అంటే విరగబడి చూశారు. ‘విఠలాచార్య’ అంటేనే తిరుగులేని బ్రాండ్.

అగ్నికి వాయువు తోడైనట్టుగా విఠలాచార్యకు ఎన్టీఆర్ కలిశాడు. ఇక ప్రభంజనం మొదలయ్యింది. అప్పటికి ఎన్టీఆర్‌కున్న మాస్ ఇమేజ్‌ని విఠలాచార్య ఇంకెక్కడికో తీసుకెళ్లిపోయాడు. చిత్రవిచిత్రమైన కథలు, రకరకాల మారువేషాలు, ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు... మాస్ జనానికి పండగే పండగ. ఒకటా, రెండా... ఇద్దరూ కలిసి 16 సినిమాలు చేశారు. ఒకదాన్ని మించి మరొకటి. వీరిద్దరూ కలిసి చేసిన తొలి సినిమా ‘బందిపోటు’ ఓ ట్రెండ్‌సెట్టర్. హాలీవుడ్‌లో పాపులర్ అయిన రాబిన్‌హుడ్ తరహా హీరోయిజాన్ని ఇందులో ఎన్టీఆర్ పాత్రకు ఆపాదించారు. ఆ తర్వాత ‘అగ్గిపిడుగు’. ఇద్దరు ఎన్టీఆర్లతో చెడుగుడు ఆడించేశారు. ‘మంగమ్మ శపథం’లో ఎన్టీఆర్‌తో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయించారు. ఒక హీరో తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్ చేయడం ఇదే ప్రథమం. కాంతారావుతో కూడా విఠలాచార్య ఎక్కువ సినిమాలు చేశారు. కాంతారావుక్కూడా మాస్ ఫాలోయింగ్ వచ్చింది ఆ సినిమాలతోనే. 

రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. జానపదాలపై జనాలకు మొహం మొత్తసాగింది. డిష్యుం డిష్యుం సినిమాలతో ప్రేక్షకులకు కొత్త రుచులు దొరకసాగాయి. ఇప్పుడు తనేం చేయాలి? రూటు మార్చాలా? ఎన్టీఆర్‌తో ‘నిన్నే పెళ్లాడతా’ తీశాడు. ఫలితం దక్కలేదు. ఏయన్నార్‌తో ‘బీదలపాట్లు’. జనానికి ఈ పాట్లు కూడా నచ్చలేదు. ఎవ్వరు మారినా విఠలాచార్య మారకూడదన్నారు ప్రేక్షకులు. ఆ కామెంట్లు ఆయన చెవినా పడ్డాయి. మళ్లీ తన కత్తులకి పదును పెట్టాడు. సీసాలో దాచిపెట్టిన భూతాలను బయటికి తీశాడు. అలా పుట్టిందే ‘జగన్మోహిని’. శృంగార నర్తకి జయమాలిని లీడ్ రోల్. నరసింహరాజు హీరో. ఒకప్పుడు తను తీసిన సినిమానే. మళ్లీ రీమేక్ అన్న మాట. 

7 లక్షల బడ్జెట్. 30 రోజుల్లోనే అవలీలగా తీసిపారేశాడు. ఈ సినిమా రిలీజ్‌కి ముందే మూడు భారీ జానపదాలు (ఎన్టీఆర్ ‘రాజపుత్ర రహస్యం’, ‘సింహబలుడు’, కృష్ణ ‘సింహగర్జన’) ఢామ్ అన్నాయి. అయినా విఠలాచార్య డోంట్‌కేర్. ‘జగన్మోహిని’ చూసి జనం వెర్రెత్తిపోయారు. పొట్టేలు మనుషులను ఢీ కొనడం, పులితో తలపడడం, పాము-గద్దల పోరాటం, పాముని మెడలో వేసుకుని పొట్టేలు పరిగెత్తడం, సారథితో దెయ్యాలు ఆటాడుకోవడంలాంటివి చూసి పెద్దాళ్లు కూడా చిన్నపిల్లలైపోయారు. ఇదే ఆయన ఆఖరి సూపర్ హిట్. ఆ తర్వాత ఏవో సినిమాలు చేశారు కానీ, ఏవీ విఠలాచార్య స్థాయిలో లేవు. ఓ పక్క పెరిగిన వయసు, ఇంకోపక్క అనారోగ్యం, మరోపక్క పరిశ్రమలో మారిన పరిస్థితులు మెల్లిగా ఆయనకు రిటైర్‌మెంట్ ఇచ్చేశాయి. కాదు... కాదు... రిటైర్డ్ హర్ట్ చేశాయి.

33 ఏళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 60కు పైగా సినిమాలు చేశారు. వీటిల్లో తెలుగు సినిమాలే సుమారు 40 వరకూ ఉన్నాయి. విఠలాచార్య సినిమాల్లోని మాయలు, మంత్రాల గురించి చెప్పుకుంటే పెద్ద హిస్టరీనే అవుతుంది. ఆయన సినిమా కథలు చూస్తే ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా అనిపిస్తాయి. కానీ, వాటికి బలమైన మూలాలే ఉన్నాయి. కాశీమజిలీ కథలు, అరేబియన్ నైట్స్, కాశ్మీర రాజకుమార కథలు, చైనీస్ ఫోక్ స్టోరీస్, రష్యన్ ఫోక్ టేల్స్... ఇలాంటివన్నీ ఆఘ్రాణించేసి కథలు సృష్టించేవాడు. ‘చందమామ’ పుట్టుక దగ్గరనుంచీ కన్నడ, తెలుగు ప్రతులన్నీ బైండ్ చేయించి పెట్టుకున్నాడు. వాటిల్లోని బొమ్మలతోటే పాత్రల మీసాలు, విగ్గులు, దుస్తులు చేయించేవాడు. 

ఆయన తీసే స్పీడు చూస్తే పూరి జగన్నాథ్ కూడా పనికి రాడేమో! ఒక్క రోజులో పది సీన్లు తీయాలనుకుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ తీసేయాల్సిందే. సినిమా మొత్తానికి ఒకటే సెట్టు. దాన్నే అటూ ఇటూ మార్చేసి రకరకాల యాంగిల్స్‌లో షూట్ చేసేవాడు. కాసేపు అదే రాజదర్బార్. ఇంకాసేపు అదే విలన్ సమాలోచనా మందిరం. కాస్ట్యూమ్స్ కూడా దాదాపుగా అన్ని సినిమాలకు ఒకటే. కొంచెం అటూ ఇటూ మార్పులు చేసి వాడెయ్యడమే. రాజులకైనా, సైనికులకైనా అవే దుస్తులు, అవే కిరీటాలు. అంతకుముందు జానపద హీరోలకు పంచెకట్టే. విఠలాచార్య వచ్చాక రోమన్ తరహాలో స్కిన్ టైట్ నైలాన్ ప్యాంట్లు మొదలయ్యాయి.

డబ్బు దగ్గర విఠలాచార్య చాలా నిక్కచ్చి. ప్రొడక్షన్ మేనేజర్‌తో కాకుండా పారితోషికాలన్నీ తనే స్వయంగా మాట్లాడేవారు. మిగతావాళ్లకన్నా ఒక రూపాయి తక్కువిచ్చినా, చాలా ఫెర్‌ఫెక్ట్‌గా పువ్వుల్లో పెట్టి మరీ నెలవారీ జీతాలుగా అందించేవారు. విఠలాచార్య సినిమాలో ఛాన్సొచ్చిందంటే చిన్నా చితకా ఆర్టిస్టులకు కొన్ని నెలలు భరోసా. విఠలాచార్య తన సినిమాలకు ఎప్పుడూ ఫంక్షన్లు కూడా చేసేవారు కాదు. సినిమాకు 50 రోజుల టాక్ వస్తే 40 రోజులకు, 100 రోజుల టాక్ వస్తే 70 రోజులకు తీయించేసేవారు. మనీ మేనేజ్‌మెంటే కాదు టైమ్ మేనేజ్‌మెంట్‌లోనూ ఆయన పర్‌ఫెక్టే. మిన్ను విరిగి మీద పడ్డా నో టెన్షన్. ఓసారేమైందంటే - ఓ ప్రముఖ హీరో కాల్షీట్ ఇచ్చి షూటింగ్‌కి రాలేదు. 

ఇంకొకరైతే కంగారుపడిపోయి షూటింగ్ పేకప్ చెప్పేసేవారు. విఠలాచార్య మాత్రం తాపీగా ఆ సీన్ మార్చేసి హీరో పాత్రకు ముని శాపం ఇస్తే, పక్షిగా మారిపోయినట్టుగా షాట్ తీసిపారేశారు. ఇది తెలిసి ఆ హీరో కిమ్మనలేదు. మళ్లీ ఎప్పుడూ ఆయన దగ్గర అలాంటి వేషాలు వేయలేదు. మిగతా సాంకేతిక నిపుణుల సంగతి ఎలా ఉన్నా, కెమెరామేన్‌ని మాత్రం గట్టివాణ్ణే తీసుకునేవారు. ఎందుకంటే ఆయన సినిమాల్లో ట్రిక్‌వర్క్ ఎక్కువ. రవికాంత్ నగాయిచ్, హెచ్.ఎస్. వేణు లాంటి ఛాయాగ్రాహకులు విఠలాచార్య సినిమాల తోనే బాగా పాపులరయ్యారు. అగ్గిపిడుగు, జ్వాలాద్వీప రహస్యం లాంటి సినిమాల్లో కెమెరా వర్క్ ఇప్పుడు చూసినా అబ్బురంగా అనిపిస్తుంది.

విఠలాచార్య ఎప్పుడూ పెద్దపెద్ద మ్యూజిక్ డెరైక్టర్లను కూడా పెట్టుకోలేదు. తనకు అనువుగా ఉండేవాళ్లతోనే ఎక్కువ పనిచేసేవారు. రాజన్-నాగేంద్ర, విజయా కృష్ణమూర్తి లాంటి వాళ్లు ఆయనకు ఆస్థాన సంగీతదర్శకులు. విఠలాచార్య సినిమాల్లో పాటలూ బావుంటాయి. దేశవాళీ పాటలు, దేశీవాళీ నృత్యాలతో కొంచెం హంగామానే చేసేవారు.

తనకు సాయం చేసినవారి పట్ల చాలా కృతజ్ఞత చూపేవాడాయన. విజయా స్టూడియోలో తక్కువ అద్దెకు తనకు షూటింగ్ ఏర్పాట్లు చేయించారని నాగిరెడ్డి పట్ల ఎప్పుడూ కృతజ్ఞతగా మెలిగేవారు. అందుకే నాగిరెడ్డికి తన కన్నడ సినిమాల పరభాషా హక్కులన్నీ ఇచ్చేసేవారు. విజయావారు తీసిన గుండమ్మ కథకు మూలం విఠలాచార్య తీసిన కన్నడ సినిమా ‘మనే తుంబెద హెణ్ణు’. అలాగే ‘మాయాబజార్’ను కన్నడంలో చాలా తక్కువ ఖర్చుతో అనువాదం చేసిచ్చారు. విఠలాచార్య సినిమాలన్నీ తమిళం, హిందీల్లోకి డబ్ అయ్యేవి. అక్కడ కూడా ఆయనంటే మంచి క్రేజ్. థాయ్‌లాండ్, మలేసియా, సింగపూర్, బర్మా, దక్షిణాఫ్రికాల్లో కూడా బాగా ఆడేవి.

ఆయనది చాలా పెద్ద కుటుంబం. నలుగురు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు, పెద్దబ్బాయి బి.వి. శ్రీనివాస్‌ని ‘అగ్గిదొర’తో దర్శకునిగా పరిచయం చేశారు. అగ్గివీరుడు, నిన్నే పెళ్లాడుతా, రైతే రాజు సినిమాలు డెరైక్ట్ చేసిన బీవీ శ్రీనివాస్ పెద్దగా రాణించలేకపోయాడు. ఇంకో అబ్బాయి రాజన్ కూడా ఓ సినిమాకు దర్శకత్వం చేశారు గానీ, గుర్తింపు రాలేదు. చాలా మంది పిల్లలు విదేశాల్లో స్ధిరపడిపోయారు. మద్రాసు పురశవాకంలో విఠలాచార్యకు పెద్ద బంగ్లా ఉండేది. 

విఠలాచార్య జనరంజక చిత్రాలు
కన్యాదానం (1955)
జయవిజయ (1959)
అన్నా చెల్లెలు (1960)
మదనకామరాజుకథ (1962)
బందిపోటు (1963)
అగ్గిపిడుగు (1964)
నవగ్రహ పూజామహిమ (1964)
గురువును మించిన శిష్యుడు (1965)
మంగమ్మ శపథం (1965)
జ్వాలాద్వీప రహస్యం (1965)
పిడుగురాముడు (1966)
అగ్గిబరాటా (1966)
చిక్కడు-దొరకడు (1967)
గండికోట రహస్యం (1969)
కదలడు-వదలడు (1969)
ఆలీబాబా 40 దొంగలు (1970)
లక్ష్మీకటాక్షం (1970)
రాజకోట రహస్యం (1971)
ఖైదీ కన్నయ్య (1971)
జగన్మోహిని (1978) 



నటునిగా విఠలాచార్య 
విఠలాచార్యలో మంచి నటుడు కూడా ఉన్నారు. సినిమాల్లోకి రాకముందు రంగస్థలంపై అనేక వేషాలు వేశారు. కొన్ని కన్నడ సినిమాల్లో హాస్య పాత్రలు పోషించారు. 

ముందే తెలిసిన మరణం
విఠలాచార్యకు జ్యోతిష్యం మీద మంచి పట్టుంది. ‘‘అశ్వనీ నక్షత్రం రెండోపాదం, మేషరాశి, మూడోసారి ఏలిననాటి శని ప్రవేశించి జన్మ శని జరుగుతుండగా విఠలాచార్య అనే నేను చనిపోతాను’’ అని తన డైరీలో రాశారు. 1999 మే 28న అదే జరిగింది.

పైన ఆఫీసు, కింద కాపురం, చిన్నాచితకా ఎవరొచ్చినా కాఫీ ఇచ్చి పంపించేవారు. ఆ ఇంటి ఆవరణలోనే రాము అనే కపిల గోవుని పెంచుకునేవారు. రోజూ ఆ గోవుకి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి చుట్టూ ప్రదక్షిణ చేసేవారు. అది ముసలిదయ్యాక కూడా ప్రాణపదంగా చూసుకున్నారు. తన సినిమాల నెగిటివ్‌లన్నీ తన ఆఫీసులోనే ఏసీ రూమ్‌లో భద్రపరిచారు. వాటిని చూసేందుకు ఒక ఉద్యోగిని కూడా నియమించుకున్నారు. విఠల్ సంస్థలో పని చేసిన చాలా మంది ఆ తరువాత కాలంలో ఉచ్చస్థితికి చేరుకున్నారు. దర్శకులు ఎస్.డి.లాల్, వైకుంఠరామశర్మ, సిద్ధలింగయ్య, ఎడిటర్ మోహన్, మేకప్‌మేన్ ఏఎమ్ రత్నం లాంటి వాళ్లు ఆ సంస్థలో పని చేసిన వారే. 

‘‘ప్రస్తుతానికి జానపదం తెరమరుగైపోయి ఉండొచ్చును. కానీ ఎప్పటికైనా మళ్లీ జానపదానికి జీవం వస్తుంది. కొత్తతరం వాళ్లు కొత్త ఆలోచనలతో సరికొత్త భావాలతో మార్పులకనుగుణంగా తీస్తే జానపదానికి మళ్లీ పూర్వ వైభవం వస్తుంది’’ అని ఓ సందర్భంలో విఠలాచార్య అన్నారు. ఏమో.... ఆ రోజు వస్తుందేమో! వచ్చేసిందేమో కూడా! దర్శకుడు రాజమౌళి - ప్రభాస్‌తో చేస్తున్న సినిమా ఫక్తు జానపదం. ఆ సినిమాతోనైనా విఠలాచార్య మాట నిజమవుతుందేమో! ఆయన కల ఫలిస్తుందేమో! 
- పులగం చిన్నారాయణ
- బి. విఠలాచార్య


www.sakshi.com

No comments:

Post a Comment