Monday, May 13, 2013

ఎవర్‌గ్రీన్.. మాయాబజార్

mayabazar

-వందేళ్ల భారతీయ సినీయవనికపై వన్నెతరగని తెలుగుచిత్రం
- అద్భుత కళాఖండంగా మొదటిస్థానం
- సీఎన్‌ఎన్-ఐబీఎన్ పోల్స్‌లో వెల్లడి
- రెండు, మూడు స్థానాల్లో మలయాళి చిత్రాలు
- ఆ తర్వాతి స్థానాల్లో బెంగాలీ, తమిళ్, బాలీవుడ్ సినిమాలు

మాయాబజార్.. 
నాటికి నేటికి ఏనాటికి వన్నెతరగని తెలుగుచిత్రం! అదో అపూర్వ కళాఖండం! 
వందేళ్ల భారతీయ సినీయవనికపై దానికి మరొకటి సాటిరాదని మరోసారి నిరూపితమైంది! 
దేశంలో అద్భుత కళాఖండంగా మొదటిస్థానంలో ‘మాయాబజార్’ నిలిచింది! 
వివిధ భాషల్లోని వంద చిత్రాలపై సీఎన్‌ఎన్-ఐబీఎన్ సంస్థ పోల్స్ నిర్వహించగా.. ఇది వెల్లడైంది. 56ఏళ్ల క్రితం విడుదలైన మాయాబజార్ చిత్రం ఇప్పటికీ అందరి మన్ననలు అందు కుంటోంది. భారతీయ సినిమా శతవసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎన్‌ఎన్-ఐబీఎన్ సంస్థ ఇటీవల దేశంలోని వివిధ భాషల్లోని వంద చిత్రాలను ఎంపిక చేసి.. పోల్స్ నిర్వహించింది. వీటిల్లో అద్భుత చిత్రంగా మీరు దేనికి ఓటేస్తారని జనాన్ని ప్రశ్నించగా.. అనేక మంది ‘మాయాబజార్’ ను ఎంచుకున్నారు. మొదటి స్థానంలో నిలిపారు. రెండోస్థానంలో మలయాళి చిత్రం ‘మణిచివూతథాఝూ’, మూడోస్థానంలో మరో మలయాళి చిత్రం ‘ఒరు వడక్కన్ వీరగాథ’ నిలిచాయి. బెంగాలీ, తమిళ్, బాలీవుడ్ చిత్రాలు తరువాతి స్థానాలను సొంతం చేసుకున్నాయి. 1989లో వచ్చిన శివ చిత్రం(తెలుగు) ఏడో స్థానం కైవసం చేసుకుంది. మాభూమి, సాగరసంగమం, పాతాళభైరవి, శంకరాభరణం వంటి తెలుగు చిత్రాలు టాప్ 20లో చోటు దక్కించకున్నాయి.

మరపురాని కళాఖండం
1957 మార్చి 27.. బ్లాక్ అండ్ వైట్ తెరపై మరో బ్లాక్ అండ్ వైట్ చిత్రం! మాయాబజార్! విడుదలైంది. అప్పటివరకు అలా వచ్చి.. ఇలా చూసిపోయే ప్రేక్షకులే.. మాయాబజార్ కోసం క్యూలు కట్టారు. పది నుంచి వందసార్లు ఆ చిత్రాన్ని వీక్షించినవారు అప్పట్లోనే కొకొల్లలు. ఇప్పటికీ ఆ చిత్రం టీవీల్లో వస్తోందంటే ఇంటిల్లిపాది ముందస్తుగానే దాని ముందు వాలిపోతారు! చిత్రవూపముఖులైతే.. వీలున్నప్పుడల్లా ‘మాయాబజార్’ సీడీ వేసుకొని చూస్తుంటారు! అదీ.. ఆ కళాఖండం గొప్పతనం. కేవీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మాయాబజార్... భారతంలోని శశిరేఖాపరిణయ ఘట్టం మాత్రమే! కథ, కథనం, మాటలు, పాటలు, అభినయం.. దానికి వన్నెతెచ్చాయి.

ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్... ఎవరికివారే పోటీపడి నటించారు! వారికితానేమి తక్కువకానంటూ మహానటి సావిత్రి నటనసాగింది! ఆ చిత్రంలోని పింగళి మాటలు, పాటలు.. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట మనకు వినిపిస్తూనే ఉంటాయి. కొత్త పదాలకు, సరికొత్త పాటలకు, కడుపుబ్బా నవ్వించే హాస్యానికి.. ఆ చిత్రం బాటలు వేసింది. 2007లో 50ఏళ్లు పూర్తి చేసుకున్న మాయాబజార్ ఇటీవల రంగుల్లో కూడా విడుదలైంది. ‘లాహిరి.. లాహిరి.. లాహిరిలో..’, ‘చూపులు కలిసిన శుభవేళ.. ఎందుకు నీకీ కలవరము’, ‘వివాహ భోజనంబు.. వింతైన వంటకంబు..’, ‘సుందరి నీవంటి దివ్య స్వరూపము..’ ఈ పాటలు విననివారుంటారా?, అస్మదీయులు, తస్మదీయులు, హాయ్ హాయ్ నాయకా... మాటలు వినపడగానే ఆశ్చర్యంగా చూడనివారుంటారా? ఈ పాటలు.. ఈ మాటలు బొమ్మకట్టి తెరకెక్కింది ‘మాయాబజార్’లోనే!

No comments:

Post a Comment