Sunday, November 11, 2012

పవిత్ర ప్రేమకు చిహ్నం 'మా పల్లెలో గోపాలుడు'


ప్రస్తుతం 'యాక్షన్‌ కింగ్‌'గా పేరుగాంచిన అర్జున్‌ని తెలుగు తెరకు హీరోగా పరిచయం చేస్తూ కోడి రామకృష్ణ దర్శకత్వంలో, నిర్మాత యస్‌.గోపాలరెడ్డి భార్గవ ఆర్ట్స్‌ పతాకంపై రూపొందించిన చిత్రం 'మా పల్లెలో గోపాలుడు'. 'ముద్దమందారం' సినిమా ద్వారా పరిచయమై వెలుగులో కొచ్చిన పూర్ణిమ ఇందులో కథానాయికగా నటించింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో 'స్వప్న' సినిమా ద్వారా హీరోగా పరిచయం కాబడిన 'రాజా' ఇందులో నెగిటివ్‌ క్యారెక్టర్‌ పోషించారు. ఈ మూడు ప్రధాన పాత్రల మధ్య చిత్రకథ మొత్తం నడుస్తుంది.

సినిమా కథ విషయానికొస్తే - బొటానికల్‌ టూర్‌కి స్నేహితురాండ్రతో పాటు వచ్చిన పూర్ణిమను చూసి పడవ నడిపే అర్జున్‌ అభిమానం పెంచుకుంటాడు. ఆమెతో పెళ్ళయితే బాగుండునని కలలుకంటాడు. ఆమెకూడా ఇతడంటే అభిమానంగా ఉంటుంది. అయితే ప్రేమకోణంలో ఆలోచించదు. ఆమెకు రాజాతో పెళ్ళవుతుంది. మొదట నిరాశ చెందినా, ఆమె తన అంతస్థుకి తగ్గవాడిని చేసుకుందని సమాధానపడి వారింట్లోనే పనివాడిగా చేరతాడు అర్జున్‌. పూర్ణిమని పెళ్లిచేసుకున్న రాజా అక్రమ మార్గాలలో డబ్బుని సంపాదించే అవినీతిపరుడు. అతగాడి అన్యాయానికి పూర్ణిమ స్నేహితురాలు బలైపోతుంది. ఈ సంగతిని తెలుసుకున్న పూర్ణిమ అతడి పడకగదిలో అడుగుపెట్టనని శపథం చేస్తుంది. ''అయితే నువ్వు వంటింటికే పరిమితమై పో!'' అని దర్జాగా చంద్రికను ఇంటికి తెచ్చుకుని కాపురం చేస్తుంటాడు. చంద్రికతోపాటు వేశ్యావృత్తి చేసే ఆమె అక్క వై.విజయకూడా పట్నం వచ్చి వారింట్లో మకాం పెడుతుంది. పూర్ణిమను చంద్రిక, వై.విజయ నానా కష్టాలు పెడుతూ అవమానిస్తుంటారు. అర్జున్‌ ఇవన్నీ చూస్తూ మనసులో బాధపడుతుంటాడు. ఈలోగా కొడుకు అర్జున్‌ని చూడాలని వచ్చిన గొల్లపూడి మారుతీరావు ఈ వ్యవహారమంతా చూసి, వై.విజయ, చంద్రికలకు ఉద్వాసన చెప్పాలని ప్రయత్నిస్తాడు. ఆ కక్షతో సోదరీమణులిద్దరూ పూర్ణిమ, అర్జున్‌లకు అక్రమ సంబంధం అంటగట్టి రాజాకు చాడీలు చెబుతారు. దీంతో అతడు పూర్ణిమను కొడుతుంటే భరించలేక అడ్డుకుని, చితకబాదుతూ, ''తనకు పూర్ణిమపై ఉన్న ప్రేమ నిజమేనని, కానీ ఆమెతో ఈ విషయం ఎప్పుడూ చెప్పలేదని, ఆమె పవిత్రమైనదని'' చెబుతాడు. ఇది విన్న పూర్ణిమ ''ఇప్పుడు నేను చేస్తున్నపనిని లోకం, సమాజం హర్షించకపోవచ్చు. కానీ ఇదే సరియైన న్యాయం'' అంటూ అర్జున్‌తో చేయికలిపి ఆ ఇంటినుండి బయటకు వస్తుంది.

ఈ సినిమాలో మిగతా పాత్రల్లో గొల్లపూడి మారుతీరావు, వై.విజయ, చంద్రిక, కల్పనారారు, ఆలీ, జట్టు నరసింహంలు నటించారు. ఇది 1985లో విడుదలై బాగా విజయవంతంగా నడిచింది. ఇందుకు ప్రధాన కారణాలుగా, హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ పవిత్రంగా ఉండటం, క్లయిమాక్స్‌ సంచలనంగా రూపొందించటం, అర్జున్‌ కరాటే ఫైట్స్‌ అని చెప్పుకోవచ్చు. కె.వి.మహదేవన్‌ సంగీత సారధ్యంలో, డా.సి.నారాయణరెడ్డి రచించిన ''రాణీరాణమ్మ.. ఆనాటి నవ్వుల ఏవమ్మా!'' , ''నేను ఈలవేస్తే గోలకొండ అదిరిపడతది'' అనే పాటలు కూడా ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. వై.విజయ పులుసు ఎపిసోడ్‌ కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఇందులో ఆలీ చిన్నవాడిగా కనిపిస్తాడు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిచే విరచితమైన 'పుష్పవిలాపం'లోని పద్యాలతో ఈ సినిమా మొదలవుతుంది.
తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో అక్షరాల సెంటిమెంట్స్‌తో ఎక్కువ సినిమాలు తీసిన సంస్థల్లో మొదటిది జగపతి సంస్థ. తర్వాత భార్గవ ఆర్ట్స్‌ బ్యానర్‌ని చెప్పుకోవచ్చు. ఈ పతాకంపై వచ్చిన సినిమాలన్నీ 'మ'తో మొదలవుతాయి.అన్నీ విజయవంతం అయ్యాయి కూడా. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే భార్గవ ఆర్ట్స్‌ చిత్రమంటే, కోడి రామకృష్ణ దర్శకుడు, కె.వి.మహదేవన్‌, సి.నారాయణరెడ్డి, గణేష్‌పాత్రోల కలయిక ఎక్కువగా ఉండేది. అలాంటి సంస్థ ద్వారా వచ్చిన ఈ సినిమా విజయవంతం అవడంతోపాటు, మంచి సందేశాత్మక చిత్రంగా కూడా పేరుగాంచింది.

No comments:

Post a Comment