Showing posts with label ఆపాత మధుర చిత్రాల-సమాహారం. Show all posts
Showing posts with label ఆపాత మధుర చిత్రాల-సమాహారం. Show all posts

Tuesday, October 15, 2013

రసవత్తరం... ఈ ‘నర్తనశాల’

తెలుగు పౌరాణిక చిత్రాల్లో రసవత్తర చిత్రరాజంగా చెప్పుకునే ‘నర్తనశాల’కు నేటికి 50 ఏళ్లు. ఎందరో హేమాహేమీల బృహత్తర ప్రయత్నమిది.ఎన్నిసార్లు వీక్షించినా  తనివి తీరకపోవడమే ఈ సినిమాప్రత్యేకత. ఈ తరం సినిమాకీ ఓ ఇన్‌స్పిరేషన్ ‘నర్తనశాల’. ఆ మధ్యకాలంలో వచ్చిన ఫ్యాక్షన్ చిత్రాలు గమనిస్తే... ఒక ధీరోదాత్తుడైన కథానాయకుడు ఎక్కడో అనామకుడిలా తలదాచుకోవడం, ఆ తర్వాత అతని గతం వెల్లడి కావడం సక్సెస్‌ఫుల్ ఫార్ములాగా నిలిచింది. ఆ ఫార్ములాకు పుట్టిల్లు ఈ సినిమానే!

 ఎన్టీఆర్ ఆశ్చర్యంగా మొహం పెట్టారు. వెంటనే ఏం మాట్లాడాలో అర్థం కాలేదాయనకు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఇప్పటివరకూ ఆయనకు రాని ప్రతిపాదన అది. ఆయనకు ఎదురుగా నటి లక్ష్మీరాజ్యం, ఆమె భర్త శ్రీధర్‌రావు కూర్చుని ఉన్నారు. ‘నర్తనశాల’ పేరుతో సినిమా చేయాలనుకుంటున్నామని, కాల్షీట్లు కావాలని అడిగితే ఎన్టీఆర్ ఆనందంగా ఒప్పుకున్నారు. అయితే ఇక్కడ మెలిక ఏమిటంటే - అర్జునుడి పాత్రతో పాటు అటు ఆడా ఇటు మగా కాని బృహన్నల పాత్ర చేయాలట.

 రావణాసురుడిగా, భీష్ముడిగా చేయడమే సాహసం అనుకుంటే, పేడిగా నటించడం సాహసానికి పరాకాష్ట. అది ఏమాత్రం అటూ ఇటూ అయినా ప్రేక్షకులు తిరస్కరించడం ఖాయం. ఎన్టీఆర్ సందేహాస్పద వదనం చూడగానే లక్ష్మీరాజ్యంకు విషయం అవగతమైంది. ‘‘కళాదర్శకుడు టీవీయస్ శర్మగారు బృహన్నల పాత్రకు సంబంధించి స్కెచ్‌లు వేస్తున్నారు. అవి చూశాకనే మీ తుది నిర్ణయం వెల్లడించండి’’ అని చెప్పారామె. ఎన్టీఆర్ సరే అన్నారు. ఆయనకు లక్ష్మీరాజ్యంపై అపారమైన గౌరవం ఉంది. ‘శ్రీకృష్ణ తులాభారం’ (1935), ‘ఇల్లాలు’ (1940), ‘అపవాదు’ (1941), ‘పంతులమ్మ’ (1943) తదితర చిత్రాలతో కథానాయికగా ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు లక్ష్మీరాజ్యం. ఆమె భర్త శ్రీధర్‌రావు రెవిన్యూ ఇన్‌స్పెక్టర్. వీరిరువురూ కలిసి 1951లో రాజ్యం పిక్చర్స్ సంస్థను స్థాపించి ‘దాసి’ (1952), ‘హరిశ్చంద్ర’ (1956), ‘శ్రీకృష్ణలీలలు’ (1959) చిత్రాలు నిర్మించారు. ఆ సమయంలోనే ఒకాయన లక్ష్మీరాజ్యంకు మహాభారతంలోని విరాట పర్వంకు సంబంధించి ‘నర్తనశాల’ అనే పుస్తకాన్ని పంపించి, సినిమాగా తీస్తే బావుంటుందేమో అని సలహా ఇచ్చారు.

 లక్ష్మీరాజ్యంకు ఆ ఆలోచన చాలా బావుందనిపించింది. నిజానికి విరాట పర్వం నేపథ్యంలో పెద్దగా సినిమాలు కూడా రాలేదు. 1918లో నటరాజ మొదలియార్ ‘కీచక వధ’ అనే మూకీ తీశారు. 1937లో ‘విజయదశమి’ పేరుతో ఓ టాకీ వచ్చింది. అంతకు మించి ఇంకెవరూ సినిమాలు చేయలేదు. దానికి తోడు తెలుగు నాట విరాట పర్వానికి ఓ సెంటిమెంట్ కూడా ఉంది. ఈ విరాట పర్వం చదివితే వానలు కురుస్తాయనేది తెలుగు ప్రజల్లో ఎప్పటినుంచో పాతకుపోయిన నమ్మకం. అందుకే ‘నర్తనశాల’ను తెరకెక్కించడానికి లక్ష్మీరాజ్యం, శ్రీధర్‌రావు సంకల్పించారు. సముద్రాల రాఘవాచార్యులు (సీనియర్) స్క్రిప్టు మొత్తం సిద్ధం చేశారు.

 బృహన్నలగా ఎన్టీఆర్ ఓకే అంటే సినిమా మొదలు పెట్టేయొచ్చును. కళాదర్శకుడు శర్మ రంగంలోకి దిగి రకరకాల స్కెచ్‌లు వేశారు. ఒకసారి అమలాపురం వెళ్లినప్పుడు అక్కడి స్థూపం మీద ఉన్న ఓ పేడి శిల్పాన్ని ప్రేరణగా తీసుకుని స్కెచ్ వేశారు. దానికి కేరళ ప్రాంతంలోని స్త్రీల శిరోజాలంకరణను జత చేశారు. ఈ స్కెచ్‌లు చూశాక ఎన్టీఆర్‌కు ఓ నమ్మకం వచ్చింది. ప్రసిద్ధ రూపశిల్పి హరిబాబు ఆధ్వర్యంలో నాలుగు గంటలు శ్రమించి గెటప్ వేసుకున్నారు. తన గురువైన కేవీ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ గెటప్ చూపించారు. ఆయన పచ్చజెండా ఊపడంతో బృహన్నలగా చేయడానికి ఎన్టీఆర్ అంగీకారం తెలిపారు.

 దర్శకత్వ బాధ్యతలు కమలాకర కామేశ్వరరావు తీసుకున్నారు. ఆయనకిదే తొలి పౌరాణిక చిత్రం. ద్రౌపదిగా సావిత్రి, కీచకునిగా ఎస్వీ రంగారావు, ధర్మరాజుగా మిక్కిలినేని, భీమునిగా దండమూడి రాజగోపాల్, దుర్యోధనునిగా ధూళిపాళ, దుశ్శాసనునిగా కైకాల సత్యనారాయణ, విరాటరాజుగా ముక్కామల, సుధేష్ణగా సంధ్య, ఉత్తరగా ఎల్.విజయలక్ష్మి, అభిమన్యునిగా శోభన్‌బాబు, శ్రీకృష్ణునిగా కాంతారావు, ఉత్తర కుమారునిగా రేలంగిని ఎంపిక చేశారు. మద్రాసులోని వాహినీ, భరణీ స్టూడియోల్లో చిత్రీకరణ జరిపారు. గూడూరు సమీప ప్రాంతంలో మాత్రం యుద్ధ సన్నివేశాలు తీశారు. గోగ్రహణ ఘట్టం కోసం ఏకంగా 5 వేల పశువులను రప్పించడం విశేషం. ఈ పతాక సన్నివేశాల కోసం రెండు కెమేరాలను ఉపయోగించారు. సుమారు 4 లక్షల రూపాయల ఖర్చుతో సినిమా సిద్ధమైంది.

 1963 అక్టోబరు 11న 26 కేంద్రాల్లో ‘నర్తనశాల’ విడుదలై, 19 కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శితమైంది. హైదరాబాద్, విజయవాడల్లో 200 రోజులు ఆడింది. బెంగాలీ, ఒరియా భాషల్లో అనువదిస్తే, అక్కడా ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ లేకపోతే ఈ సినిమానే లేదు. ఆయన ఇంతకుముందు చేసిన పౌరాణిక పాత్రలన్నీ ఒకెత్తు అయితే, ఈ బృహన్నల మాత్రం చాలా చాలా ప్రత్యేకం. ఓ పక్క పురుషత్వం, మరో పక్క స్త్రీ లాలిత్యాన్ని కలగలుపుతూ ఆయన చూపిన అభినయం ఓ పాఠ్యాంశమే. అసలీ పాత్ర కోసం అంతటి స్టార్ హీరో శ్రమించిన తీరే అబ్బురంగా అనిపిస్తుంది.

బృహన్నల అంటే ఉత్తరకు నాట్యం నేర్పే నాట్యాచార్యుడు. ఉత్తరగా ఎల్.విజయలక్ష్మి చేస్తున్నారంటే, ఆమెకు ధీటుగా నృత్యం చేయగలిగాలి. అందుకోసం నెల రోజులు నృత్య దర్శకులు వెంపటి (పెద) సత్యం దగ్గర నృత్యంలో శిక్షణ తీసుకున్నారు. ఎన్టీఆర్ అంత శ్రద్ధ చూపారు కాబట్టే ఆ పాత్ర అంతలా రక్తి కట్టింది. ఇక ఈ సినిమాకు వెన్నెముకలాంటి పాత్ర ఎస్వీ రంగారావుది. సినిమాలో ఆయన పాత్ర నిడివి చిన్నదే అయినా, ఉన్నంత సేపు దడదడలాడించేశారు. మిగిలిన తారల ప్రతిభ కూడా ఉన్నత ప్రమాణాల్లో సాగింది. తొలితరం సూపర్‌స్టార్ కాంచనమాల చాలా ఏళ్ల విరామం తర్వాత ఇందులో అతిథి పాత్రలో కొన్ని క్షణాలు కనిపించారు. ఆమె ఆఖరి సినిమా ఇదే.

 సముద్రాల సీనియర్ కలం ఈ చిత్రానికి బలం. సుసర్ల దక్షిణామూర్తి స్వరజీవితంలో మణిమకుటాయమానంగా నిలిచే సినిమా ఇదే. ‘జనని శివ కామిని’, ‘సలలిత రాగ సుధారససారం’, ‘దరికి రాబోకు రాబోకు రాజా’, ‘నరవరా ఓ కురువరా’, ‘ఎవరి కోసం ఈ మందహాసం’, ‘సఖియా వివరించవే’ పాటలన్నీ అమృతంలో ముంచి తేల్చిన రసగుళికలు. ఎం.ఏ.రెహమాన్ ఛాయాగ్రహణ సామర్థ్యం, ఎస్.పి.ఎస్. వీరప్ప ఎడిటింగ్ పనితనం, టీవీఎస్ శర్మ కళాదర్శక నైపుణ్యం... జనం గుండెల్లో ‘నర్తనశాల’ చిరస్థాయిగా నిలిచిపోవడానికి ప్రధాన దినుసులుగా ఉపకరించాయి.

 ఈ సినిమానొక దృశ్యకావ్యంగా, కళాఖండంలా తీర్చిదిద్దడంలో కమలాకర కామేశ్వరరావు చేసిన కృషి అపూర్వం. ఆయన పౌరాణిక చిత్రబ్రహ్మగా పేరు తెచ్చుకోవడానికి ఈ సినిమానే తొలి మెట్టు. 1963లో జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్రంగా రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికైంది. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు సినిమా ఇదే.

Sakshi | Updated: October 11, 2013 00:29 (IST)
(source : Eenadu October 11, 2013 )

Sunday, May 5, 2013

'శారద'కు 40 ఏళ్లు


ప్రముఖ దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్, హీరో శోభన్‌బాబు కాంబినేషన్‌లో ఎనిమిది చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. ఇవన్నీ ఆర్ధిక విజయాన్ని సాధించడం గమనార్హం. వాటిల్లో 'శారద' చిత్రానికి ఉన్న స్థానం ప్రత్యేకం. కథాబలంతో పాటు, గుండెల్ని పిండేసే సెంటిమెంట్ ఉన్న ఈ చిత్రం విజయం సాధించింది. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో 'శారద' టాప్ గ్రాసర్‌గా నిలిచింది.
ఈ సినిమాతోనే నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన క్రాంతికుమార్ తదనంతర కాలంలో అభిరుచి కలిగిన నిర్మాతగా, మహిళా పక్షపాతిగా పేరు తెచ్చుకోవడానికి 'శారద' మంచి వేదికగా నిలిచింది. అలాగే టైటిల్ పాత్రను ఊర్వశి శారద పోషించిన ఈ చిత్రం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పిన ఓ మంచి చిత్రంగా చెప్పాలి. టైటిల్ హీరోయిన్ పరంగా ఉన్నప్పటికీ కథను నడిపించేది శోభన్‌బాబు పోషించిన రెండు పాత్రలే. ఇవి రెండూ డాక్టర్ రోల్స్ కావడం విశేషం. అలాగే అంతవరకూ కరడు గట్టిన విలన్ వేషాలతో ప్రేక్షకుల్ని భయపెడుతున్న సత్యనారాయణ ఈ సినిమాలో శారద అన్న పాత్రను అనితర సాధ్యమైనరీతిలో పోషించి వారిచేతే కన్నీళ్లు పెట్టించారు. ఆయనతో ఈ తరహా పాత్రను చేయించాలన్న దర్శకుని ఆలోచనని ప్రేక్షకులు అభినందించి, ఆ పాత్రని అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. 'శారద' చిత్రం విడుదలై నేటికి సరిగ్గా 40 ఏళ్లు.

ఈ సందర్భంగా ఈ చిత్రం విశేషాలు మీకోసం...
అన్నపూర్ణ సినీఎంటర్‌ప్రైజెస్‌లో క్రాంతికుమార్, వీరమాచినేని హనుమాన్‌ప్రసాద్, ఆయన బావమరిది రా«ఘవరావు (టైటిల్స్‌లో నిర్మాతగా ఈయన పేరే ఉంటుంది) పార్టనర్స్. 50 వేల రూపాయల పెట్టుబడితో ఈ కొత్త కంపెనీ ప్రారంభమైంది. ఆ డబ్బుతోనే సినిమా తీయవచ్చనే నమ్మకం వీళ్లకు కలగడానికి కారణం... 'నీడలేని ఆడది' చిత్రం. అంతా కొత్తవారితో, పూర్తిగా అవుట్‌డోర్‌లో, నాలుగు లక్షల రూపాయల బడ్జెట్‌తో తయారైన ఈ చిత్రం పంపిణాదారులకు రూపాయికి రూపాయి లాభం తెచ్చింది. కథ కోసం అన్వేషిస్తున్న తరుణంలో ఎడిటర్ అంకిరెడ్డి ఓ కన్నడ సినిమా గురించి చెప్పారు. 'యావద జన్మ మైత్రి'( ఎన్ని జన్మలబంధం) అనే ఆ కన్నడ చిత్రం అప్పుడు నిర్మాణంలో ఉంది.

కల్పన అందులో హీరోయిన్. గీతాసింగ్ అనే మహారాష్ట్రీయన్ దర్శకుడు. ఆయనే కథారచయిత. ఆ చిత్రకథ ఏమిటంటే.. ఓ కుగ్రామంలో ఓ యువతి ఉంటుంది. గ్రామంలో ఓ శుభకార్యం జరిగినా, ఎవరు ఏ ఊరు వెళుతున్నా ఆమె ఎదురురావాల్సిందే. అనా«థ అయినా ఆమెని ఊరివారంతా ఎంతో అభిమానిస్తుంటారు. యోగ్యుడైన ఓ డాక్టర్‌కిచ్చి ఆమె పెళ్లి జరిపిస్తారు. అయితే శోభనంరోజున అనుకోకుండా ఓ కేసుకి ఎటెండ్ కావడం కోసం నది దాటి వెళ్లిన ఆ డాక్టర్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతాడు. జరిగిన విషాదాన్ని ఆమె అన్న, ఊరి జనం గుండెల్లో దాచుకుని ఆమెకి జరిగిన సంఘటన గురించి చెప్పకుండా ఏమీ జరగనట్లే ప్రవర్తిస్తుంటారు. వైద్యం పనిమీద వెళ్లిన భర్త తిరిగి వస్తాడన్న ఆ యువతి నమ్మకాన్ని కాపాడటానికి ఆ ఊరంతా ఒకటవుతుంది. అంకిరెడ్డి చెప్పిన ఈ కథ హనుమాన్‌ప్రసాద్‌కి బాగా నచ్చింది. క్రాంతికుమార్, సంగీత దర్శకుడు చక్రవర్తిని వెంటబెట్టుకుని బెంగుళూరు వెళ్లి రైట్స్ కొన్నారు. ఈ కథ మనకి పనికిరాదని క్రాంతికుమార్ అభ్యంతరం చెప్పినా హనుమాన్‌ప్రసాద్ వినలేదు. సేఫ్ ప్రాజెక్ట్ అవుతుందని క్రాంతికుమార్‌ని ఒప్పించారాయన. హనుమాన్‌ప్రసాద్, దర్శకుడు కె.విశ్వనాథ్, రచయిత బొల్లిముంత శివరామకృష్ణ కలిసి కూర్చుని 'యావద జన్మ మైత్రి' చిత్రానికి నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేశారు.

క్లయిమాక్స్ గురించి సలహాలు
ఈ సినిమా కథ గురించి ఎంత చర్చ జరిగిందో, పతాక సన్నివేశం ఎలా ఉండాలన్న విషయం మీద కూడా తీవ్రమైన చర్చ జరిగింది. క్రాంతికుమార్ తనకు తెలిసిన దర్శకులకు సినిమా చూపించి, క్లయిమాక్స్ ఎలా ఉంటే బాగుంటుందో సలహాలు తీసుకున్నారు. శారదకి తను వితంతువు అని తెలిసిన తరువాత కూడా గతంలోలాగానే గ్రామ ప్రజల అభిమానం పొందుతూ, భర్త సమాధి దగ్గర కాలక్షేపం చేస్తూ కాలక్రమంలో తనువు చాలించినట్లు చూపించి కథను సుఖాంతం చేయమని చాలామంది సూచించారు.

అయితే హనుమాన్‌ప్రసాద్ దానికి అంగీకరించలేదు. 'భర్త మరణించిన విషయం తెలిసిన తరువాత కూడా శారద బతికి ఉండటంలో అర్ధం లేదు. దీని వల్ల ఆమె అన్న పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. ఆమె జీవితాన్ని ముగించాల్సిందే' అని ఆయన వాదించారు. ఈ పాయింట్ జనానికి పడితే సినిమా బ్రహ్మండంగా ఆడుతుంది, లేకపోయినా నాలుగు వారాల సినిమా అవుతుంది. మన పెట్టుబడికి నష్టం ఉండదని ఆయన వివరించడంతో మిగిలిన వాళ్లు ఒప్పుకున్నారు. పడవలో అన్నయ్యతో కలిసి వస్తున్న శారద అతని భుజాల మీదకి ఒరిగి కన్నుమూసినట్లుగా చిత్రీకరించి సినిమాని ముగించారు విశ్వనాథ్. ఈ ముగింపు ప్రతి ఒక్కరికీ నచ్చడంతో సినిమా ఘనవిజయం సాధించింది. 'శారద' విడుదలైనప్పుడు ఆంధ్రాలో పవర్‌కట్ అమలులో ఉండేది. అయినా చిత్రవిజయాన్ని అవేమీ ఆపలేకపోయాయి.

నంది అవార్డుల్లో హ్యాట్రిక్
1971లో 'చెల్లెలి కాపురం', 1972లో 'కాలం మారింది', '1973లో 'శారద'... ఇలా వరుసగా మూడేళ్ల నంది అవార్డులు పొంది హ్యాట్రిక్ సాధించారు కె.విశ్వనాథ్, శోభన్‌బాబు. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేయడానికి చేయడానికి చాలామంది ముందుకి రావడంతో రూ.75 వేలకు హక్కులు అమ్మారు.

మ్యూజికల్ హిట్
సంగీత దర్శకుడు చక్రవర్తి స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నాయి. 'రేపల్లె వేచేను.. వేణువు వే చెను', 'శారదా.. నను చేరగా', 'కన్నె వధువుగా మారెది' వంటి పాటలు ఇప్పటికీ వినిపిస్తునే ఉంటాయి.

ఈ సినిమాలో అన్ని పాజిటవ్ పాత్రలే. సత్యనారాయణ, రావు గోపాలరావు, జయంతి, అల్లు రామలింగయ్య, రాజబాబు, సారధి, బేబి డాలీ తదితరులు ఈ చిత్రంలో నటించారు.

Friday, May 3, 2013

చిరంజీవి కెరీర్‌లో ‘యమ’ క్రేజీ మూవీ

పిల్లల మనసుల్ని గెలిచే హీరో సూపర్‌స్టార్ అవుతాడు. భారతీయ సినిమా చరిత్రలో ‘నంబర్‌వన్ హీరో’ అనిపించుకున్న వారందరి ఇమేజ్‌లనూ ఒక్కసారి పరికిస్తే, అందులో నిజం ఎంత ఉందో అర్థమవుతుంది. ఎన్టీఆర్, ఎమ్జీయార్, కన్నడ రాజ్‌కుమార్, అమితాబ్, రజనీకాంత్, చిరంజీవి... వీరు హవా సాగించిన కాలాల్లో పిల్లల దృష్టిలో వీరే హీమ్యాన్లు, వీరే సూపర్‌మ్యాన్లు, వీరే స్పైడర్‌మ్యాన్లు. వాళ్లు ఎంచుకున్న పాత్రలు కావచ్చు, నటించిన సినిమాలు కావచ్చు, తెరపై వాళ్లు చేసిన సాహసాలు కావచ్చు... అవన్నీ పిల్లల దృష్టిలో వారిని మానవాతీతుల్ని చేశాయి.

ఇక చిరంజీవి విషయానికొస్తే... ఓ ఖైదీ, ఓ అడవిదొంగ, ఓ యముడికి మొగుడు, ఓ పసివాడి ప్రాణం, ఓ జగదేకవీరుడు అతిలోక సుందరి... ఈ సినిమాలన్నీ పిల్లల్ని విపరీతంగా అలరించినవే. వీటిల్లో ‘యముడికి మొగుడు’ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే... ఆ సినిమా వచ్చి నేటికి పాతికేళ్లయ్యింది. ఇన్నేళ్లు అవుతున్నా... జనరేషన్లు మారిపోతున్నా... నేటికీ ‘యముడికి మొగుడు’ అంటే ప్రేక్షకుల్లో యమక్రేజ్. ఆ క్రేజ్‌కి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని సినిమాలు కేవలం కొందరి జీవితాల్లో వెలుగులు నింపడానికే అన్నట్లు తయారవుతాయి. అలా తయారైన సినిమానే ‘యముడికి మొగుడు’. ఈ సినిమాకు ముందు ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన నటుడు సుధాకర్ విలన్ పాత్రలు చేసేవారు. అలాంటి సుధాకర్‌ని రాత్రికి రాత్రి స్టార్ కమెడియన్‌గా మార్చేసిందీ చిత్రం. చిత్రమైన డైలాగ్ డిక్షన్‌తో, వైవిధ్యమైన శారీరకభాషతో కొన్నేళ్ల పాటు హాస్యప్రపంచాన్ని ఏలారు సుధాకర్. అలాగే ఈ సినిమాకు ముందు రాజ్-కోటి చిన్న చిత్రాల సంగీత దర్శకులు. వారిని తెలుగు సినీసంగీత ప్రపంచానికి రారాజుల్ని చేసేసిందీ చిత్రం. ‘అందం హిందోళం అధరం తాంబూలం..’, ‘బహుశా నిన్ను బందర్‌లో చూసి ఉంటా...’, ‘వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మా...’, ‘కన్నెపిల్ల తోటి పిల్లగాడికొచ్చెనమ్మ కీచులాట’, ‘ఎక్కు బండెక్కు మావ ఎక్కి లాగించుమావ’, ‘నొనొనొనొనొనొనొనొ నో.. నో.. నో.. నాట్యమిదా...’ ఈ పాటలు తెలుగునాట ఓ ప్రభంజనాన్నే సృష్టించాయనడం అతిశయోక్తి కాదు. అసలు ‘యముడికి మొగుడు’ వెండితెరపైకి ఎలా వచ్చాడనే వివరాల్లోకి వెళితే....

చిరంజీవి మద్రాసు పాండీబజార్‌లో చెప్పుల్లేకుండా తిరిగిన నాటి నుంచీ నారాయణరావు, సుధాకర్, హరిప్రసాద్‌తో స్నేహం ఉంది. కాలక్రమంలో చిరంజీవి ‘సుప్రీంహీరో’ స్థాయికి ఎదిగారు. సుధాకర్, నారాయణరావు, హరిప్రసాద్ నటులుగా బిజీ అయ్యారు. వారి కెరీర్లు మంచి ఊపు మీదున్న సమయంలోనే చిరంజీవి కథానాయకునిగా దమయంతి ఆర్ట్స్ పతాకంపై ‘దేవాంతకుడు’(1984) చిత్రాన్ని నిర్మించారు మిత్రుల్లో ఒకరైన నారాయణరావు. ఆ సినిమా వచ్చిన సరిగ్గా మూడేళ్ల తర్వాత మళ్లీ చిరంజీవితో సినిమా నిర్మించాలనుకున్నారాయన. ‘నువ్వు, సుధాకర్, హరిప్రసాద్ ముగ్గురూ కలిసి తీసుకోండి. అలా అయితే చేయడానికి నాకు అభ్యంతరం ఉండదు. పైగా నీతో పాటు వాళ్లిద్దరికి కూడా ఆర్థికంగా కాస్త వెసులుబాటు ఉంటుంది’ అన్నారు చిరంజీవి. ముగ్గురు మిత్రులు ప్రారంభించనున్న సంస్థకు ‘డైనమిక్ మూవీమేకర్స్’ అని చిరంజీవే నామకరణం చేశారు. ఇక కథాన్వేషణ మొదలైంది. రకరకాల కథలు వింటున్నారు. ‘ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు.

ఈ పాయింట్‌కి యమ నేపథ్యాన్ని కలిపితే ఎలా ఉంటుంది’ అన్న సత్యానంద్ థాట్ నలుగురు మిత్రులకూ బాగా నచ్చింది. అంతే.. ఎన్టీఆర్ ‘రాముడు-భీముడు’, ‘యమగోల’ చిత్రాల కథలను ప్రేరణగా తీసుకొని తాము ముందు అనుకున్న పాయింట్ ద్వారా అద్భుతమైన కథ తయారు చేశారు సత్యానంద్. అల్లు అరవింద్ సలహా మేరకు రవిరాజా పినిశెట్టిని దర్శకునిగా తీసుకున్నారు. చిరంజీవికి నారాయణరావు సిఫార్స్ చేయడంతో ఈ చిత్రానికి రాజ్-కోటి సంగీత దర్శకులయ్యారు. వారి స్వరాలను విని ‘సినిమా సూపర్‌హిట్’ అని ముందుగానే జోస్యం చెప్పేశారు వేటూరి. అన్ని పాటలకూ తానే సాహిత్యాన్ని అందించారు. ఇక కథ విషయానికొస్తే... దుర్మార్గుల పన్నాగానికి బలైపోయిన కాళీ చచ్చి యమలోకానికి వెళతాడు. అక్కడ కాళీకి తనకింకా ఆయువు తీరలేదనే షాకింగ్‌న్యూస్ తెలుస్తుంది. పైగా తన శరీరం కూడా కాలి బూడిదైందని తెలుసుకున్న కాళీ నరకలోకానికే నరకం చూపిస్తాడు. ఈ గోల తట్టుకోలేక అచ్చు కాళీలాగే ఉండే బాలు అనే అమాయకుని శరీరంలోకి కాళీ ఆత్మను పంపిస్తాడు యముడు. అలా బాలు శరీరంలోకి ప్రవేశించిన కాళీ దుర్మార్గులను ఎలా తుదముట్టించాడు... అనేది కథ.

కాళీగా, బాలుగా పొంతనలేని రెండు పాత్రలను అద్భుతంగా పోషించారు చిరంజీవి. యముడిగా సత్యనారాయణ, చిత్రగుప్తునిగా అల్లు రామలింగయ్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఈ సినిమా సమయంలో అల్లువారి ఆరోగ్యం కాస్త మందగించింది. దాంతో ఆయన్ను ఎక్కువగా ఇబ్బందిపెట్టడం కరెక్ట్‌కాదని ‘విచిత్ర గుప్తుడు’ పాత్రను సృష్టించారు రవిరాజా. సుత్తివేలు చేసిన ఆ పాత్ర హాస్యప్రియులను బాగా ఆకట్టుకుంది. ప్రతినాయకులుగా రావుగోపాలరావు, గొల్లపూడి నటన నభూతో న భవిష్యత్. కథానాయికలు విజయశాంతి, రాధ ఒకరికొకరు పోటీపడి నటించారు. రంభగా గెస్ట్‌రోల్‌లో మెరిశారు అంబిక. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ‘యముడికి మొగుడు’ సొంతం. అప్పట్లో పెద్ద సినిమాలకు ఖర్చు లక్షల్లోనే ఉండేది. కానీ ‘యముడికి మొగుడు’ నిర్మాణ వ్యయం కోటీపాతికలక్షలయ్యింది. విడుదలైన తొలి రోజు నుంచే సూపర్‌హిట్ టాక్‌తో దూసుకుపోయాడు ‘యముడికి మొగుడు’. అప్పటి చిరంజీవి చిత్రాల్లో వసూళ్ల పరంగా ఆల్‌టైమ్ రికార్డ్‌ని సృష్టించాడు.

స్నేహానికి ప్రతీకగా మిగిలిపోయింది
‘‘మా స్నేహానికి ప్రతీకగా మిగిలిపోయిన సినిమా ‘యముడికి మొగుడు’. ఖర్చుకు వెనుకాడకుండా తీశాం. ఆర్ట్ డెరైక్టర్ చలం వేసిన భారీ సెట్లు ఈ సినిమాకు రిచ్‌నెస్ తెచ్చాయి. చిరంజీవితో తార వేయించిన డాన్సులు, రాజు మాస్టర్ ఫైట్స్ యువతరాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. తొలికాపీ చూడగానే.. యూనిట్‌కి మంచి పార్టీ ఇచ్చారు చిరంజీవి. ఈ సినిమా విషయంలో నేను మరచిపోలేని అంశం రచయిత డీవీ నరసరాజుగారి అభినందన. ‘గతంలో ఎన్టీఆర్ నటించిన ‘దేవాంతకుడు’, ‘యమగోల’కు రచన చేశాను. ఆ రెండూ ఘన విజయాలందుకున్నాయి. అలాంటి కథలతో మళ్లీ మళ్లీ అద్భతాలు సృష్టించొచ్చని మీరు రుజువు చేశారు. కంగ్రాట్స్’ అని ఫోన్ చేసి అభినందించారాయన. ఈ సినిమాను ఎనిమిది నెలల్లో పూర్తి చేశాం. ఆ తర్వాత మళ్లీ మా సంస్థలో సినిమా తీయడానికి మా ముగ్గురికీ కుదర్లేదు. చిరంజీవితో కూడా ఆ ప్రస్తావన మేం తేలేదు. వన్ సినిమా వండర్‌గా మిగిలిపోయింది మా ‘డైనమిక్ మూవీమేకర్స్’.
- జి. నారాయణరావు

Sunday, December 2, 2012

టాప్ 10*తెలుగు సోషియో ఫాంటసీలు


1. దేవాంతకుడు (1960)

తెలుగులో తొలి సోషియో ఫాంటసీ. నరుడు యమలోకానికి వెళ్లడమనే కాన్సెప్ట్‌కి శ్రీకారం యముడిగా ఎస్వీఆరూ, నరుడిగా ఎన్టీఆరూ అదరహో.

2. యమగోల (1977)

‘డెత్ టేక్స్ ఏ హాలిడే’ అనే హాలీవుడ్ సినిమా ఇన్‌స్పిరేషనే కానీ, అంతా అచ్చ తెనుగు మసాలా. ‘చిలక కొట్టుడు కొడితే’ లాంటి కిర్రెక్కించే పాటలు. ఎన్టీఆర్ నటనకు వసూళ్ల వర్షం. నరకం నుంచి నేలకు దిగొచ్చిన యమధర్మరాజు-చిత్రగుప్తుడైన కైకాల, అల్లు కామెడీకి పొట్ట పగలాల్సిందే.

3. యముడికి మొగుడు (1988)

ఈ ‘యమ’ ఫార్ములా చిరంజీవికి అచ్చొచ్చింది. సినిమా సూపర్ హిట్టు. పాటలూ హిట్టే. యమధర్మరాజుగా కైకాల అదుర్స్. చిత్రగుప్తునిగా అల్లుకు తిరుగేముంది!

4. యమదొంగ (2007)

రాజమౌళి మేజిక్. తాత ఎన్టీఆర్‌ను గుర్తు చేసిన మనవడు ఎన్టీఆర్. స్వర్గంలో తాతా మనవళ్ల స్టెప్స్‌కు విజిల్సే విజిల్స్. యమధర్మరాజుగా మోహన్‌బాబు పర్‌ఫెక్ట్ ఫిట్.

5. జగదేక వీరుడు-అతిలోక సుందరి (1990)

స్వర్గాధిపతి దేవేంద్రుని కూతురు ఓ సామాన్య మానవుణ్ణి ప్రేమిస్తే? అలాంటి అందమైన స్వప్నమే ఈ సినిమా. తుఫాన్‌లోనూ వసూళ్ల తుఫాన్. ‘అబ్బనీ తియ్యని దెబ్బ’ లాంటి కమ్మని పాటలు చిరంజీవి, శ్రీదేవి కలయికే వండ్రఫుల్.

6. మగధీర (2009)

గ్రాఫిక్స్‌ని ఉపయోగించి రాజమౌళి చేసిన వండర్. రామ్‌చరణ్ రెండో సినిమాతోనే రికార్డుల మీద రికార్డులు. పునర్జన్మ నేపథ్యంలో అల్లుకున్న అందమైన ప్రేమకథ.

7. దేవి (1999)

తన భక్తురాల్ని కాపాడుకున్న ఓ నాగదేవత కథ. ఎమ్మెస్ రాజు భారీ వెంచర్. కోడి రామకృష్ణ గ్రాఫికల్ వండర్.

8. అమ్మోరు (1995)

నిర్మాణానికే మూడేళ్లు. అష్టకష్టాలు పడి విదేశాల్లో గ్రాఫిక్స్. గ్లామర్ క్వీన్ రమ్యకృష్ణ సరికొత్త అమ్మోరు అవతారం. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిని మేకర్‌గా హీరోని చేసిన సినిమా.

9. ముత్యాలముగ్గు (1975)

ఉత్తర రామాయణాన్ని సోషలైజ్ చేస్తూ తీసిన సినిమా. ‘ముత్యమంతా పసుపు’లాంటి పాటలతోనే మనసు నిండిపోతుంది. రావుగోపాలరావు డైలాగులు డిస్కులుగా సంచలనం.

10. యమలీల (1994)

కమెడియన్ అలీ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి చేసిన లీల. తల్లి ప్రేమ, యమపాశం చుట్టూ తిరిగే కథ. ‘నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మా’ అంటూ హుషారైన పాటలు.

Sunday, November 11, 2012

పవిత్ర ప్రేమకు చిహ్నం 'మా పల్లెలో గోపాలుడు'


ప్రస్తుతం 'యాక్షన్‌ కింగ్‌'గా పేరుగాంచిన అర్జున్‌ని తెలుగు తెరకు హీరోగా పరిచయం చేస్తూ కోడి రామకృష్ణ దర్శకత్వంలో, నిర్మాత యస్‌.గోపాలరెడ్డి భార్గవ ఆర్ట్స్‌ పతాకంపై రూపొందించిన చిత్రం 'మా పల్లెలో గోపాలుడు'. 'ముద్దమందారం' సినిమా ద్వారా పరిచయమై వెలుగులో కొచ్చిన పూర్ణిమ ఇందులో కథానాయికగా నటించింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో 'స్వప్న' సినిమా ద్వారా హీరోగా పరిచయం కాబడిన 'రాజా' ఇందులో నెగిటివ్‌ క్యారెక్టర్‌ పోషించారు. ఈ మూడు ప్రధాన పాత్రల మధ్య చిత్రకథ మొత్తం నడుస్తుంది.

సినిమా కథ విషయానికొస్తే - బొటానికల్‌ టూర్‌కి స్నేహితురాండ్రతో పాటు వచ్చిన పూర్ణిమను చూసి పడవ నడిపే అర్జున్‌ అభిమానం పెంచుకుంటాడు. ఆమెతో పెళ్ళయితే బాగుండునని కలలుకంటాడు. ఆమెకూడా ఇతడంటే అభిమానంగా ఉంటుంది. అయితే ప్రేమకోణంలో ఆలోచించదు. ఆమెకు రాజాతో పెళ్ళవుతుంది. మొదట నిరాశ చెందినా, ఆమె తన అంతస్థుకి తగ్గవాడిని చేసుకుందని సమాధానపడి వారింట్లోనే పనివాడిగా చేరతాడు అర్జున్‌. పూర్ణిమని పెళ్లిచేసుకున్న రాజా అక్రమ మార్గాలలో డబ్బుని సంపాదించే అవినీతిపరుడు. అతగాడి అన్యాయానికి పూర్ణిమ స్నేహితురాలు బలైపోతుంది. ఈ సంగతిని తెలుసుకున్న పూర్ణిమ అతడి పడకగదిలో అడుగుపెట్టనని శపథం చేస్తుంది. ''అయితే నువ్వు వంటింటికే పరిమితమై పో!'' అని దర్జాగా చంద్రికను ఇంటికి తెచ్చుకుని కాపురం చేస్తుంటాడు. చంద్రికతోపాటు వేశ్యావృత్తి చేసే ఆమె అక్క వై.విజయకూడా పట్నం వచ్చి వారింట్లో మకాం పెడుతుంది. పూర్ణిమను చంద్రిక, వై.విజయ నానా కష్టాలు పెడుతూ అవమానిస్తుంటారు. అర్జున్‌ ఇవన్నీ చూస్తూ మనసులో బాధపడుతుంటాడు. ఈలోగా కొడుకు అర్జున్‌ని చూడాలని వచ్చిన గొల్లపూడి మారుతీరావు ఈ వ్యవహారమంతా చూసి, వై.విజయ, చంద్రికలకు ఉద్వాసన చెప్పాలని ప్రయత్నిస్తాడు. ఆ కక్షతో సోదరీమణులిద్దరూ పూర్ణిమ, అర్జున్‌లకు అక్రమ సంబంధం అంటగట్టి రాజాకు చాడీలు చెబుతారు. దీంతో అతడు పూర్ణిమను కొడుతుంటే భరించలేక అడ్డుకుని, చితకబాదుతూ, ''తనకు పూర్ణిమపై ఉన్న ప్రేమ నిజమేనని, కానీ ఆమెతో ఈ విషయం ఎప్పుడూ చెప్పలేదని, ఆమె పవిత్రమైనదని'' చెబుతాడు. ఇది విన్న పూర్ణిమ ''ఇప్పుడు నేను చేస్తున్నపనిని లోకం, సమాజం హర్షించకపోవచ్చు. కానీ ఇదే సరియైన న్యాయం'' అంటూ అర్జున్‌తో చేయికలిపి ఆ ఇంటినుండి బయటకు వస్తుంది.

ఈ సినిమాలో మిగతా పాత్రల్లో గొల్లపూడి మారుతీరావు, వై.విజయ, చంద్రిక, కల్పనారారు, ఆలీ, జట్టు నరసింహంలు నటించారు. ఇది 1985లో విడుదలై బాగా విజయవంతంగా నడిచింది. ఇందుకు ప్రధాన కారణాలుగా, హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ పవిత్రంగా ఉండటం, క్లయిమాక్స్‌ సంచలనంగా రూపొందించటం, అర్జున్‌ కరాటే ఫైట్స్‌ అని చెప్పుకోవచ్చు. కె.వి.మహదేవన్‌ సంగీత సారధ్యంలో, డా.సి.నారాయణరెడ్డి రచించిన ''రాణీరాణమ్మ.. ఆనాటి నవ్వుల ఏవమ్మా!'' , ''నేను ఈలవేస్తే గోలకొండ అదిరిపడతది'' అనే పాటలు కూడా ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. వై.విజయ పులుసు ఎపిసోడ్‌ కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఇందులో ఆలీ చిన్నవాడిగా కనిపిస్తాడు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిచే విరచితమైన 'పుష్పవిలాపం'లోని పద్యాలతో ఈ సినిమా మొదలవుతుంది.
తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో అక్షరాల సెంటిమెంట్స్‌తో ఎక్కువ సినిమాలు తీసిన సంస్థల్లో మొదటిది జగపతి సంస్థ. తర్వాత భార్గవ ఆర్ట్స్‌ బ్యానర్‌ని చెప్పుకోవచ్చు. ఈ పతాకంపై వచ్చిన సినిమాలన్నీ 'మ'తో మొదలవుతాయి.అన్నీ విజయవంతం అయ్యాయి కూడా. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే భార్గవ ఆర్ట్స్‌ చిత్రమంటే, కోడి రామకృష్ణ దర్శకుడు, కె.వి.మహదేవన్‌, సి.నారాయణరెడ్డి, గణేష్‌పాత్రోల కలయిక ఎక్కువగా ఉండేది. అలాంటి సంస్థ ద్వారా వచ్చిన ఈ సినిమా విజయవంతం అవడంతోపాటు, మంచి సందేశాత్మక చిత్రంగా కూడా పేరుగాంచింది.

Sunday, November 4, 2012

టాప్ 10 తెలుగు బాలల చిత్రాలు


1. లేతమనసులు (1966)
ఇద్దరు చిన్నారులు. అమ్మ దగ్గర ఒకరు. నాన్న దగ్గర ఇంకొకరు. వీళ్లద్దరూ కలిసి అమ్మానాన్నలను కలపాలి. మళ్లీ మళ్లీ విడిపోకుండా బ్రహ్మముడి వేయాలి. వేశారు కూడా. చూస్తుంటే కళ్లతో పాటు మనసు, మనసుతో పాటు ఆసాంతం మమేకం అయిపోతాం.

2. భక్త ప్రహ్లాద (1967)
అమ్మతనాన్ని తలపించే పోతన పద్యాల కమ్మదనం. తేనెలూరే సాలూరివారి స్వరాలు. ప్రహ్లాదునిగా రోజారమణి నటవిన్యాసం. మహానటుడు ఎస్వీఆర్ నటనావైదుష్యం. భాగవత గాథకు చిత్రపు నారాయణమూర్తి చేసిన అందమైన చిత్రికలు.

3. బాలరాజు కథ (1970)
అన్నాచెల్లెళ్ల అనురాగానికి నిలువెత్తు అద్దం. పసిహృదయాల అంతర్మథనం. మహాబలిపురం అందాలు. అసలు సిసలైన బాపుబొమ్మ.

4. మరోప్రపంచం (1970)
మరోప్రపంచాన్ని సృష్టించే సత్తా భావిభారతపౌరులైన పిల్లలకే ఉందని చెప్పిన కథ. కుల, మత, వర్గ, వర్ణ భేదాలకు అతీతంగా.. సమసమాజ స్థాపన కోసం పిల్లలనే ఆయుధాలుగా చేసుకున్న పెద్దల కథ.

5. పాపం పసివాడు(1972)
ఎండకన్నెరగని పసిబాలుడు ఎడారిలో ఇరుక్కుంటే? క్షణక్షణం భయం భయం. తెరపై పసివాడికీ... చూసే మనకు కూడా. గుండెల్ని పిండేసే విషాదం. సుఖాంతమయ్యే దాకా సీటు నుంచి కదలబుద్ది కాదు.

6. బాలభారతం (1972)
బాలభీముడు నాగాయుధ బలసంపన్నుడవడం. బొందితో స్వర్గానికి వెళ్లడం. కౌరవుల మట్టి ఏనుగుకు ప్రతిగా స్వర్గలోకం నుంచి ఐరావతాన్ని దించడం... ఎలా ఎన్నో ఆసక్తికర అంశాల సమ్మేళనం. కమలాకర కామేశ్వరరావు అపూర్వసృష్టి.

7. బాలమిత్రుల కథ (1972)
కులమత భేదాలకు అతీతమైనది స్నేహం అని చెప్పిన సినిమా. ‘గున్నమామిడి కొమ్మమీద’ పాట ఆల్‌టైమ్ హిట్.

8. భక్త ధృవమార్కండేయ (1982)
అధికభాగం చిన్నపిల్లలతో చేసిన తొలిప్రయోగం. ఓవైపు హరిభక్తుడైన ధృవుడు, మరోవైపు హరభక్తుడైన మార్కండేయుడు. రెండు కథలకు ఒకేసారి తెరరూపం. భానుమతి దర్శకత్వ ప్రతిభ.

9. రేపటి పౌరులు (1986)
గద్దల్లాంటి పెద్దలకి తగుబుద్దులు చెప్పిన బాలసైనికుల కథ. టి.కృష్ణ మార్కు విప్లవాత్మక మాయాజాలం. ఇక విజయశాంతి నటన సరేసరి.

10. రామాయణం (1996)
చిన్నిరాముడు, చిన్నారి సీతల కల్యాణ వైభోగం చూడటానికి రెండు కళ్లు చాలవు. రామునిగా జూనియర్ ఎన్టీఆర్ తెరంగేట్రం. గుణశేఖర్ మార్కు మేజిక్.
(ూఅభిరుచిని బట్టి ఈ టాప్ 10 మారుతుంటుంది)