Friday, May 3, 2013

1913 - 2013: వందేళ్ల భారతీయ సినిమాకు వందనం ... అభివందనం..

హిందువు గుడికి వెళ్తాడు... మహమ్మదీయుడు మసీదుకు వెళ్తాడు.. క్రైస్తవుడు చర్చికి వెళ్తాడు. కానీ, అన్ని మతాల వాళ్లూ వెళ్లే ప్లేస్... సినిమా థియేటర్.నిజం చెప్పాలంటే... సమాజంతో కలగలసిపోయి... మనుషుల భావోద్వేగాలతో పెనవేసుకుపోయిన సినిమానే ఓ మతం అయిపోయింది. ఓ చిన్న ప్రశ్న. సినిమా లేకపోతే మన జీవితం ఎలా ఉండేది?ఎంత ఆలోచించినా సమాధానం దొరికినట్టే దొరికి దొరక్కుండా పోతుంది.

20వ శతాబ్దం మనకు అందించిన అద్భుతం సినిమా. మొదట మాటల్లేని సినిమా. తర్వాత మాటలు నేర్చిన సినిమా. ఆటలు, పాటలు, రంగులు, హంగులు... ఇలా ఎన్నెన్ని హొయలో. ఊరూరా తిరుగుతూ మొదలైన సినిమా ఇప్పుడు ఉపగ్రహ ప్రసారం స్థాయికి ఎదిగింది. మన బంధువుల్ని గుర్తుపెట్టుకుంటాం. మన స్నేహితుల్ని గుర్తు పెట్టుకుంటాం. ప్రయాణంలో పరిచయస్తుల్ని,

ఓ చిన్న సాయం చేసినవాళ్లని కూడా గుర్తుపెట్టుకుంటాం. మరి.. ‘సినిమా’ అనే అద్భుతాన్ని మన
భారతీయులకు పరిచయం చేసినవాళ్లని ఒక్క క్షణమైనా గుర్తుపెట్టుకోవద్దా! సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఫాల్కేని స్మరించాలి. ఆయన తీసిన తొలి సినిమా ‘రాజా హరిశ్చంద్ర’ను గుర్తు పెట్టుకోవాలి. మాటల్లేని ఆ సినిమా చెప్పే జ్ఞాపకాలు, కలిగించే అనుభూతులు ఎప్పటికీ సజీవంగా ఉండిపోవాలి. ‘100’ అనేది సినిమావాళ్లకు ఇష్టమైన సంఖ్య.

ఓ సినిమా వంద రోజులాడితేనే వాళ్లకది సంక్రాంతి, ఉగాది, దసరా కింద లెక్క. మరి మన భారతీయ తొలి మూకీ సినిమా ‘రాజా హరిశ్చంద్ర’ విడుదలై నేటికి వందేళ్లు పూర్తి చేసుకుంటోంది. ఇది నిజంగా మనకు పండగ రోజే. వందేళ్లంటే పండు ముదుసలి కింద లెక్క. అవసాన దశలో... అవశేష దిశలో ఉన్నట్టు లెక్క. కానీ సినిమా... సమాజాన్ని చిలికితే వచ్చిన సృజన అనే అమృతాన్ని తాగింది. అందుకే సినిమా ఎప్పటికీ నిత్య యవ్వనంగానే ఉంటుంది.

శతసహస్రాయుష్మాన్ భవ.

* * * ప్రపంచంలోనే తొలి సినిమా ప్రదర్శన 1895 డిసెంబర్ 28న ప్యారిస్‌లో లూమియర్ సోదరుల ఆధ్వర్యంలో జరిగింది.

* * * మనదేశంలో తొలి సినిమా ప్రదర్శన 1896 జూలై 7న బొంబాయిలోని వాట్సన్ హోటల్‌లో జరిగింది.

* * * ప్రపంచంలో తొలి మూకీ సినిమా ‘ది గ్రేట్ ట్రయిన్ రాబరీ’ (1903). దీనికి నిర్మాత ఎడ్విన్ పోర్టర్.


‘షూటింగ్’ అని ఎందుకంటామో తెలుసా? మొదటి కెమెరా తుపాకీ ఆకారంలో ఉండేది. దాంతో బొమ్మను చిత్రీకరించారు. తుపాకి షూట్ చేస్తుంది కనుక, బొమ్మ తీయడాన్ని ‘షూటింగ్’ అన్నారు.

ఫాల్కేకు పాదాభివందనం. అవును. మనమంతా దాదా సాహెబ్ ఫాల్కేకు జీవితాంతం రుణపడి ఉండాలి. ఆయన ఈ సినిమా సౌధానికి శంకుస్థాపన చేసిన ముహూర్తం బావుంది. ఈ నేలను తడిపి, మట్టిని తడిమి, విత్తు వేసి, నీళ్లు పోసి ఈ సినిమా అనే కలల కల్పవృక్షం ఇంతెత్తున ఎదగడానికి దాదా చిందించిన స్వేదం, పడ్డ శ్రమకు ఖరీదు కట్టే షరాబు లేడు.

ఎక్కడో త్రయంబకేశ్వరంలో ఓ సంస్కృత పండితుల కుటుంబంలో పుట్టిన ఫాల్కే కత్తికి అన్ని వైపులా పదునే. ఆయనకు ఆర్కిటెక్చర్ తెలుసు. ఫొటోగ్రఫీ తెలుసు. పెయింటింగ్ తెలుసు. డ్రాయింగ్ తెలుసు. ఏదైనా అనుకుంటే సాధించే వరకూ నిద్రపోడు.

ఆ రోజుల్లో జనానికి నాటకాలు తప్ప వేరే వినోదం తెలీదు. అలాంటి పరిస్థితుల్లో ఫాల్కే ‘లైఫ్ ఆఫ్ క్రైస్ట్’ (1910) అనే సినిమా చూశాడు. తెరమీద కదిలే బొమ్మల్ని చూసి వావ్... అద్భుతం అనుకున్నాడు. మనమూ ఇలాంటి సినిమా ఎందుకు తీయకూడదనిపించింది. అనుకోవడమే ఆలస్యం... లండన్ వెళ్లాడు. వాల్టన్ స్టూడియోలో శిక్షణ పొందాడు. విలమ్స్‌న్ కెమెరాతో పాటు కొన్ని పరికరాలు కొనుక్కుని బొంబాయి వచ్చేశాడు. దాదర్ రోడ్‌లో స్టూడియో స్టార్ట్ చేశాడు. అందుకోసం ఇన్సూరెన్స్ పాలసీని తనఖా పెట్టాడు. అప్పట్లో విదేశాల నుంచి చాలా సినిమాలు దిగుమతి అయ్యేవి. అన్నీ క్రైస్తవ గాథలే. భారతీయ పురాణ కథతో సినిమా చేద్దామని ఫాల్కే నిశ్చయించుకున్నాడు. అలా ‘రాజా హరిశ్చంద్ర’ సినిమా మొదలుపెట్టాడు.

హీరో ఓకే. హీరోయిన్ వేషానికే ముప్పుతిప్పలు పడాల్సి వచ్చింది. నృత్యాలు వచ్చినవాళ్లని, పాడడం తెలిసిన వాళ్లని యాక్ట్ చేయమని అడిగితే, ఛీ పొమ్మన్నారు. చివరకు దిక్కు తోచక వేశ్యల దగ్గరకు కూడా వెళ్లి అడిగాడు. ‘అమ్మో... సినిమానా? మా పరువేం కానూ’ అన్నారు వాళ్లు. అదీ... అప్పట్లో సినిమాకుండే ఇమేజ్. అదే ఇంకెవరైనా అయ్యుంటే నిరాశపడిపోయేవాళ్లు. ఫాల్కే మొండిఘటం. వెనక్కు తగ్గే రకం కాదు. నాటకాల్లో మగవాళ్లతో ఆడవేషాలు వేయించినట్లుగా, సినిమాల్లో కూడా వేయిస్తే పోలా అనుకున్నాడు. షూటింగ్ మొదలైంది. డెరైక్టర్ తనే. ప్రొడ్యూసర్ తనే. ఎడిటింగ్ తనే. లైటింగ్ అరేంజ్‌మెంట్స్ తనే. ఫాల్కే భార్య సరస్వతి తొమ్మిది మంది పిల్లల్ని చూసుకుంటూనే భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. లైట్లు పట్టుకునేది. ఆ లైట్లకు అడ్డుగా దుప్పట్లు పట్టుకునేది. యూనిట్ మొత్తానికీ భోజనం వండిపెట్టేది.

సినిమా అంతా రెడీ. అప్పట్లో రీళ్లకు హోల్స్ ఉండేవి కావు. ప్రొజెక్టర్‌లో రీలు తిరగాలంటే హోల్స్ ఉండాల్సిందే. డార్క్‌రూమ్‌లో కూర్చుని తనే హోల్స్ పెట్టేవాడు ఫాల్కే. సినిమా రిలీజై ఫాల్కే పంట పండింది. ఫోర్డు కారు, ఆస్తులు కొన్నాడు. వరుసపెట్టి సినిమాలు తీశాడు. 1914లో తీసిన ‘మోహినీ భస్మాసుర’లో తల్లీకూతుళ్లయిన దుర్గాభాయ్ కామత్, కమలతో యాక్ట్ చేయించాడు. దాంతో సినిమాల్లో స్త్రీలు నటించొచ్చనే ధైర్యం పెరిగింది. ఫాల్కే తన కెరీర్‌లో 52 మూకీ చిత్రాలు, 7 లఘు చిత్రాలు, 6 డాక్యుమెంటరీ లఘు చిత్రాలు , 3 డాక్యుమెంటరీలు తీశాడు. 1937లో ‘గంగావతరణ్’ అనే టాకీ తీశాడు. అది బాగా నష్టపరిచింది. ఆస్తులన్నీ హరించుకుపోయి అప్పులే మిగిలాయి. 1930ల తర్వాత మూకీలు అంతరించడంతో పాటు, పరిశ్రమలో వచ్చిన మార్పులు ఫాల్కేని కలవరపెట్టాయి.

దాంతో బొంబాయి వదిలిపెట్టి నాసిక్ వెళ్లిపోయాడు. భారతీయ సినిమాకు శాశ్వత చిరునామా ఇచ్చిన ఫాల్కే చివరాఖరి స్టేజ్ చాలా దారుణం. ఓ దశలో విషం తాగి చనిపోవాలనుకున్నాడు. కానీ విషం బాటిల్ కొనుక్కోవడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి. పరిశ్రమా పట్టించుకోలేదు. ప్రభుత్వమూ పట్టించుకోలేదు. ఓ అనాధలాగానే చనిపోయాడు. ఇంతకన్నా విషాదం ఏముంటుంది? కేంద్రప్రభుత్వం ప్రతి ఏటా ఆయన పేరుతో ఓ సినీ ప్రముఖుడికి పురస్కారం ప్రదానం చేస్తోంది. దాంతోనే ఆయనకిచ్చే నివాళి పరిపూర్ణమా? భారతీయ సినిమాకు శతాబ్దపు ప్రయాణం ముగిసింది. మరో శతాబ్దంలోకి సగర్వంగా అడుగుపెడుతోంది. ఈ సందర్భంలోనైనా ఫాల్కేని స్మరించుకుందాం.

తొలి భారతీయ మూకీ 

ఈ వందేళ్లలో 1, 268 మూకీలు, సుమారు 50 వేల టాకీలు వచ్చాయి. వీటన్నింటికీ తొలి బీజం వేసింది... మార్గ నిర్దేశనం గావించింది ‘రాజా హరిశ్చంద్ర’. 40 నిమిషాలు ఉన్న ఈ సినిమా నిడివి 4 రీళ్లు మాత్రమే. 1913 ఏప్రిల్ 21న బొంబాయిలోని ఒలింపియా సినిమా హాలులో ప్రివ్యూ వేశారు. ఆ తర్వాత 12 రోజులకు మే 3, శనివారం నాడు బొంబాయిలోని కారొనేషన్ థియేటర్‌లో విడుదల చేశారు. ‘రాజా హరిశ్చంద్ర’కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రికార్డు స్థాయిలో 23 రోజులు ప్రదర్శితమైంది. అటుపై దేశంలోని ఇతర ప్రాంతాలకూ వెళ్లింది.
నిజానికి దీనికన్నా ముందే నాలుగు సినిమా ప్రయత్నాలు జరిగాయి.
1. బెంగాల్‌కు చెందిన హీరాలాల్ సేన్ 1904లో ‘అలీబాబా’ పేరుతో ఓ సినిమా తీశాడట. అదెందుకో బయటకు రాలేదు.

2. రామచంద్ర గోపాల్ తోర్నే ‘భక్త పుండలీక్’ పేరుతో ఓ సినిమా తీశారు. 1912 మే 18న బొంబాయిలోని కారొనేషన్ సినిమా హాల్లో విడుదలైంది. ‘ది డెడ్‌మ్యాన్స్ చైల్డ్’ అనే విదేశీ చిత్రంతో కలిపి దీన్ని ప్రదర్శించారు. దీని నిడివి 22 నిమిషాలే ఉండడం, సాంకేతిక నిపుణులు చాలా మంది విదేశీయులు కావడం, ఫిలిం ప్రాసెసింగ్ లండన్‌లో జరగడం... ఈ కారణాల రీత్యా దీన్ని తొలి భారతీయ మూకీగా గుర్తించలేదు.

3. సావేదాదాగా పేరొందిన హరిశ్చంద్ర సఖారామ్ భట్వాడేకర్ దగ్గర కెమెరా కొని పటంకర్, దేవేకర్, కరండికర్ అనే ముగ్గురు కలిసి ‘సావిత్రి’ అనే సినిమా తీశారు. అయితే ఫిలిమ్ డెవలపింగ్‌లో తప్పిదం జరిగి, ఆ సినిమా కాస్తా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది.

4. బొంబాయిలోని గెయిటీ థియేటర్‌లో 1912 నవంబర్ 2న ‘యాన్ ఎపిసోడ్ ఫ్రమ్ రామాయణ’ సినిమా విడుదలైంది. అయితే దీన్ని ‘సినిమా డెలక్సీ’ అనే విదేశీ సంస్థ నిర్మించడంతో తొలి మూకీ ఖ్యాతి మిస్సయిపోయింది.

తొలి కథానాయకుడు
‘రాజా హరిశ్చంద్ర’లో హరిశ్చందునిగా టైటిల్ రోల్ పోషించిన దత్తాత్రేయ దామోదర్ దబ్కే మన తొలి భారతీయ కథానాయకుడు. ఆ తర్వాత మరో మూడు, నాలుగు సినిమాల్లో నటించి దర్శకుడిగానూ, ఛాయాగ్రాహకునిగానూ మారారాయన. 1924లో వచ్చిన ‘రాజా హరిశ్చంద్ర’కు ఆయనే దర్శకుడు.
తొలి బాలనటుడు

ఫాల్కే పెద్ద కొడుకు భాల్‌చంద్ర ‘రాజా హరిశ్చంద్ర’లో లోహితుడు వేషం వేశాడు. అతనే మన తొలి భారతీయ బాలనటుడు.

తొలి బాలనటి
‘కాళీయ మర్దన్’(1919)లో శ్రీకృష్ణుడి వేషం వేసిన మందాకిని మన తొలి బాల నటి. అప్పుడామె వయసు అయిదేళ్లు. ఫాల్కే పెద్ద కూతురామె.

తొలి దర్శకురాలు
అర్దేషిర్ ఇరానీ, నానుభాయ్ దేశాయ్ వంటి వారి దగ్గర సహాయ దర్శకురాలిగా పనిచేసిన ఉర్దూ మహిళ హెచ్.హెచ్.బేగమ్ ఫాతిమా సుల్తాన్. పలు మూకీ చిత్రాల్లో నటించడమే కాకుండా, కొన్ని సినిమాలు నిర్మించారు.
1926లో ‘బుల్ బులే పరిస్తాన్’ అనే మూకీ సినిమాని తొలిసారిగా డెరైక్ట్ చేశారామె. మూకీ స్టార్స్‌గా వెలుగొందిన జుబేదా, సుల్తానా, షెహజాది ఆమె కూతుళ్లే.

తొలి కథానాయిక(లు)


చరిత్రలో ఇదొక తమాషా అంశం. మన తొలి కథానాయిక స్త్రీ కాదు. పదహారణాల పురుషుడు. అవును మరి. అప్పట్లో స్త్రీలు సినిమాల్లో నటించడమంటే ఓ అపచారం కింద లెక్క. పడుపు వృత్తి చేసుకునేవాళ్లు సైతం సినిమాల్లో నటించడానికి భయపడేవారు. అప్పట్లో నాటకాల్లో స్త్రీ పాత్రలు పురుషులే ధరించేవారు. అదే పద్ధతిని సినిమాలోనూ అనుసరించారు ఫాల్కే. హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి పాత్రకు ఓ నాజూకైన కుర్రాడు కావాలనుకుని ఫాల్కే తెగ అన్వేషిస్తే అన్నా సాలుంకే కనిపించాడు.

ఇతగాడు బొంబాయి గ్రాంట్ రోడ్డులోని ఓ హోటల్‌లో వంటవాడు. అతన్ని 15 రూపాయల నెల జీతానికి ఒప్పించి ఈ పాత్ర చేయించారు. తర్వాత అన్నా సాలుంకే చాలా మూకీల్లో యాక్ట్ చేశాడు. మరి కథానాయికగా చేసిన తొలి స్త్రీ ఎవరో తెలుసుకోవాలి కదా! ఆమె పేరు కమల. ఫాల్కే తీసిన రెండో మూవీ ‘భస్మాసుర మోహిని’(1913)లో ఆమే కథానాయిక.

తొలి బాక్సాఫీస్ హిట్
హిట్, సూపర్‌హిట్, బాక్సాఫీస్ హిట్, బ్లాక్ బస్టర్... అంటూ మనం సినిమా గురించి చాలా చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు మన దేశంలో తొలి బాక్సాఫీస్ హిట్ ఏదో తెలుసా? 1917లో వచ్చిన ‘లంకా దహన్’. దీని సృష్టికర్త కూడా ఫాల్కేనే. ‘రాజా హరిశ్చంద్ర’ తర్వాత ఫాల్కే తీసిన సినిమా ఇది. మొదటి ప్రపంచ యుద్ధం తాలూకు కష్టాలు, ముడి ఫిలిమ్ కొరత ఇత్యాది కారణాల రీత్యా నాలుగేళ్లు భారతీయ సినిమా ముందుకు కదల్లేదు. మళ్లీ ‘లంకా దహన్’తో అందరిలోనూ ఊపొచ్చింది. ఈ సినిమా టిక్కెట్ల కోసం జనం విపరీతంగా ఎగబడేవారు.

ఈ రద్దీ తట్టుకోలేక బొంబాయిలోని ‘వెస్ట్ ఎండ్’ (తర్వాత ‘నాజ్’గా మారింది) థియేటర్లో ఉదయం నుంచి రాత్రి వరకూ వరుసగా షోలు వేస్తూనే ఉండేవారు. ఆ రోజుల్లోనే పది రోజులకు 32 వేల రూపాయలు వసూలు చేసింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా జనాలు ఎడ్లబళ్లు కట్టుకుని మరీ వచ్చేవారు. థియేటర్ దగ్గర పోలీసుల్ని కాపలా పెట్టాల్సి వచ్చింది. ‘రాజా హరిశ్చంద్ర’లో హీరోయిన్‌గా చేసిన సాలుంకే ఇందులో సీతగానూ, రాముడిగానూ నటించడం విశేషం. ఈ లెక్కన మన తొలి ద్విపాత్రాభినయ నటుడు కూడా సాలుంకేనే అన్నమాట.

తొలి ఛాయాగ్రాహకుడు
‘రాజా హరిశ్చంద్ర’కు ఛాయాగ్రాహణం చేసిన ట్రింబాక్ బి.టెలాంగ్ మన తొలి కెమెరామేన్. ఆ తర్వాత ఆయన సత్యవాది రాజా హరిశ్చంద్ర, లంకా దహన్(1917) తదితర చిత్రాలకు పనిచేశారు.

తొలి భారతీయ టాకీ
మాటలు నేర్చిన మన తొలి సినిమా ‘ఆలం ఆరా’. ఖాన్ బహదూర్ అర్దేషిర్ ఇరానీ దీనికి కర్త, కర్మ, క్రియ. 1931 మార్చి 14న బొంబాయిలోని మెజిస్టిక్ థియేటర్‌లో తొలి ప్రదర్శన జరిగింది. ఆ చిత్ర ప్రదర్శనల ద్వారా వచ్చిన డబ్బుని గోతాముల్లోకి ఎక్కించి పోలీసుల కాపలాతో ఇరానీ ఇంటికి తీసుకెళ్లినట్టు చెబుతారు. పృథ్వీరాజ్‌కపూర్, జుబేదా, మాస్టర్ విఠల్ ఇందులో నటించారు.


No comments:

Post a Comment