Friday, May 3, 2013

చిరంజీవి కెరీర్‌లో ‘యమ’ క్రేజీ మూవీ

పిల్లల మనసుల్ని గెలిచే హీరో సూపర్‌స్టార్ అవుతాడు. భారతీయ సినిమా చరిత్రలో ‘నంబర్‌వన్ హీరో’ అనిపించుకున్న వారందరి ఇమేజ్‌లనూ ఒక్కసారి పరికిస్తే, అందులో నిజం ఎంత ఉందో అర్థమవుతుంది. ఎన్టీఆర్, ఎమ్జీయార్, కన్నడ రాజ్‌కుమార్, అమితాబ్, రజనీకాంత్, చిరంజీవి... వీరు హవా సాగించిన కాలాల్లో పిల్లల దృష్టిలో వీరే హీమ్యాన్లు, వీరే సూపర్‌మ్యాన్లు, వీరే స్పైడర్‌మ్యాన్లు. వాళ్లు ఎంచుకున్న పాత్రలు కావచ్చు, నటించిన సినిమాలు కావచ్చు, తెరపై వాళ్లు చేసిన సాహసాలు కావచ్చు... అవన్నీ పిల్లల దృష్టిలో వారిని మానవాతీతుల్ని చేశాయి.

ఇక చిరంజీవి విషయానికొస్తే... ఓ ఖైదీ, ఓ అడవిదొంగ, ఓ యముడికి మొగుడు, ఓ పసివాడి ప్రాణం, ఓ జగదేకవీరుడు అతిలోక సుందరి... ఈ సినిమాలన్నీ పిల్లల్ని విపరీతంగా అలరించినవే. వీటిల్లో ‘యముడికి మొగుడు’ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే... ఆ సినిమా వచ్చి నేటికి పాతికేళ్లయ్యింది. ఇన్నేళ్లు అవుతున్నా... జనరేషన్లు మారిపోతున్నా... నేటికీ ‘యముడికి మొగుడు’ అంటే ప్రేక్షకుల్లో యమక్రేజ్. ఆ క్రేజ్‌కి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని సినిమాలు కేవలం కొందరి జీవితాల్లో వెలుగులు నింపడానికే అన్నట్లు తయారవుతాయి. అలా తయారైన సినిమానే ‘యముడికి మొగుడు’. ఈ సినిమాకు ముందు ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన నటుడు సుధాకర్ విలన్ పాత్రలు చేసేవారు. అలాంటి సుధాకర్‌ని రాత్రికి రాత్రి స్టార్ కమెడియన్‌గా మార్చేసిందీ చిత్రం. చిత్రమైన డైలాగ్ డిక్షన్‌తో, వైవిధ్యమైన శారీరకభాషతో కొన్నేళ్ల పాటు హాస్యప్రపంచాన్ని ఏలారు సుధాకర్. అలాగే ఈ సినిమాకు ముందు రాజ్-కోటి చిన్న చిత్రాల సంగీత దర్శకులు. వారిని తెలుగు సినీసంగీత ప్రపంచానికి రారాజుల్ని చేసేసిందీ చిత్రం. ‘అందం హిందోళం అధరం తాంబూలం..’, ‘బహుశా నిన్ను బందర్‌లో చూసి ఉంటా...’, ‘వానజల్లు గిల్లుతుంటే ఎట్టాగమ్మా...’, ‘కన్నెపిల్ల తోటి పిల్లగాడికొచ్చెనమ్మ కీచులాట’, ‘ఎక్కు బండెక్కు మావ ఎక్కి లాగించుమావ’, ‘నొనొనొనొనొనొనొనొ నో.. నో.. నో.. నాట్యమిదా...’ ఈ పాటలు తెలుగునాట ఓ ప్రభంజనాన్నే సృష్టించాయనడం అతిశయోక్తి కాదు. అసలు ‘యముడికి మొగుడు’ వెండితెరపైకి ఎలా వచ్చాడనే వివరాల్లోకి వెళితే....

చిరంజీవి మద్రాసు పాండీబజార్‌లో చెప్పుల్లేకుండా తిరిగిన నాటి నుంచీ నారాయణరావు, సుధాకర్, హరిప్రసాద్‌తో స్నేహం ఉంది. కాలక్రమంలో చిరంజీవి ‘సుప్రీంహీరో’ స్థాయికి ఎదిగారు. సుధాకర్, నారాయణరావు, హరిప్రసాద్ నటులుగా బిజీ అయ్యారు. వారి కెరీర్లు మంచి ఊపు మీదున్న సమయంలోనే చిరంజీవి కథానాయకునిగా దమయంతి ఆర్ట్స్ పతాకంపై ‘దేవాంతకుడు’(1984) చిత్రాన్ని నిర్మించారు మిత్రుల్లో ఒకరైన నారాయణరావు. ఆ సినిమా వచ్చిన సరిగ్గా మూడేళ్ల తర్వాత మళ్లీ చిరంజీవితో సినిమా నిర్మించాలనుకున్నారాయన. ‘నువ్వు, సుధాకర్, హరిప్రసాద్ ముగ్గురూ కలిసి తీసుకోండి. అలా అయితే చేయడానికి నాకు అభ్యంతరం ఉండదు. పైగా నీతో పాటు వాళ్లిద్దరికి కూడా ఆర్థికంగా కాస్త వెసులుబాటు ఉంటుంది’ అన్నారు చిరంజీవి. ముగ్గురు మిత్రులు ప్రారంభించనున్న సంస్థకు ‘డైనమిక్ మూవీమేకర్స్’ అని చిరంజీవే నామకరణం చేశారు. ఇక కథాన్వేషణ మొదలైంది. రకరకాల కథలు వింటున్నారు. ‘ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు.

ఈ పాయింట్‌కి యమ నేపథ్యాన్ని కలిపితే ఎలా ఉంటుంది’ అన్న సత్యానంద్ థాట్ నలుగురు మిత్రులకూ బాగా నచ్చింది. అంతే.. ఎన్టీఆర్ ‘రాముడు-భీముడు’, ‘యమగోల’ చిత్రాల కథలను ప్రేరణగా తీసుకొని తాము ముందు అనుకున్న పాయింట్ ద్వారా అద్భుతమైన కథ తయారు చేశారు సత్యానంద్. అల్లు అరవింద్ సలహా మేరకు రవిరాజా పినిశెట్టిని దర్శకునిగా తీసుకున్నారు. చిరంజీవికి నారాయణరావు సిఫార్స్ చేయడంతో ఈ చిత్రానికి రాజ్-కోటి సంగీత దర్శకులయ్యారు. వారి స్వరాలను విని ‘సినిమా సూపర్‌హిట్’ అని ముందుగానే జోస్యం చెప్పేశారు వేటూరి. అన్ని పాటలకూ తానే సాహిత్యాన్ని అందించారు. ఇక కథ విషయానికొస్తే... దుర్మార్గుల పన్నాగానికి బలైపోయిన కాళీ చచ్చి యమలోకానికి వెళతాడు. అక్కడ కాళీకి తనకింకా ఆయువు తీరలేదనే షాకింగ్‌న్యూస్ తెలుస్తుంది. పైగా తన శరీరం కూడా కాలి బూడిదైందని తెలుసుకున్న కాళీ నరకలోకానికే నరకం చూపిస్తాడు. ఈ గోల తట్టుకోలేక అచ్చు కాళీలాగే ఉండే బాలు అనే అమాయకుని శరీరంలోకి కాళీ ఆత్మను పంపిస్తాడు యముడు. అలా బాలు శరీరంలోకి ప్రవేశించిన కాళీ దుర్మార్గులను ఎలా తుదముట్టించాడు... అనేది కథ.

కాళీగా, బాలుగా పొంతనలేని రెండు పాత్రలను అద్భుతంగా పోషించారు చిరంజీవి. యముడిగా సత్యనారాయణ, చిత్రగుప్తునిగా అల్లు రామలింగయ్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఈ సినిమా సమయంలో అల్లువారి ఆరోగ్యం కాస్త మందగించింది. దాంతో ఆయన్ను ఎక్కువగా ఇబ్బందిపెట్టడం కరెక్ట్‌కాదని ‘విచిత్ర గుప్తుడు’ పాత్రను సృష్టించారు రవిరాజా. సుత్తివేలు చేసిన ఆ పాత్ర హాస్యప్రియులను బాగా ఆకట్టుకుంది. ప్రతినాయకులుగా రావుగోపాలరావు, గొల్లపూడి నటన నభూతో న భవిష్యత్. కథానాయికలు విజయశాంతి, రాధ ఒకరికొకరు పోటీపడి నటించారు. రంభగా గెస్ట్‌రోల్‌లో మెరిశారు అంబిక. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ‘యముడికి మొగుడు’ సొంతం. అప్పట్లో పెద్ద సినిమాలకు ఖర్చు లక్షల్లోనే ఉండేది. కానీ ‘యముడికి మొగుడు’ నిర్మాణ వ్యయం కోటీపాతికలక్షలయ్యింది. విడుదలైన తొలి రోజు నుంచే సూపర్‌హిట్ టాక్‌తో దూసుకుపోయాడు ‘యముడికి మొగుడు’. అప్పటి చిరంజీవి చిత్రాల్లో వసూళ్ల పరంగా ఆల్‌టైమ్ రికార్డ్‌ని సృష్టించాడు.

స్నేహానికి ప్రతీకగా మిగిలిపోయింది
‘‘మా స్నేహానికి ప్రతీకగా మిగిలిపోయిన సినిమా ‘యముడికి మొగుడు’. ఖర్చుకు వెనుకాడకుండా తీశాం. ఆర్ట్ డెరైక్టర్ చలం వేసిన భారీ సెట్లు ఈ సినిమాకు రిచ్‌నెస్ తెచ్చాయి. చిరంజీవితో తార వేయించిన డాన్సులు, రాజు మాస్టర్ ఫైట్స్ యువతరాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. తొలికాపీ చూడగానే.. యూనిట్‌కి మంచి పార్టీ ఇచ్చారు చిరంజీవి. ఈ సినిమా విషయంలో నేను మరచిపోలేని అంశం రచయిత డీవీ నరసరాజుగారి అభినందన. ‘గతంలో ఎన్టీఆర్ నటించిన ‘దేవాంతకుడు’, ‘యమగోల’కు రచన చేశాను. ఆ రెండూ ఘన విజయాలందుకున్నాయి. అలాంటి కథలతో మళ్లీ మళ్లీ అద్భతాలు సృష్టించొచ్చని మీరు రుజువు చేశారు. కంగ్రాట్స్’ అని ఫోన్ చేసి అభినందించారాయన. ఈ సినిమాను ఎనిమిది నెలల్లో పూర్తి చేశాం. ఆ తర్వాత మళ్లీ మా సంస్థలో సినిమా తీయడానికి మా ముగ్గురికీ కుదర్లేదు. చిరంజీవితో కూడా ఆ ప్రస్తావన మేం తేలేదు. వన్ సినిమా వండర్‌గా మిగిలిపోయింది మా ‘డైనమిక్ మూవీమేకర్స్’.
- జి. నారాయణరావు

No comments:

Post a Comment