Sunday, May 5, 2013

సినిమాకు 'వంద'నం


సరిగ్గా వందేళ్ల క్రితం 'రాజా హరిశ్చంద్ర'తో ప్రారంభమైన సినీ ప్రయాణం నేటితో నూరో మైలురాయి చేరుకుంది. ఈ వందేళ్ల పయనంలో సినిమా మాట నేర్చింది, సాంకేతికంగా ఎంతో అభివృద్ది చెందింది. గొప్పగొప్ప కళాకారులను, సాంకేతిక నిపుణులను పరిశ్రమకి అందించింది. భారతీయ సినిమా అభివృద్ధి కోసం కృషి చేసిన తెలుగు వారినీ, తెలుగు చిత్రపరిశ్రమని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించాలి. దేశవ్యాప్తంగా సినీప్రియులు పండుగ చేసుకుంటున్న సందర్భంగా అందుబాటులో ఉన్న కొంతమంది సినీ ప్రముఖుల నుంచి అభిప్రాయాలు సేకరించి అందిస్తున్నాం.

అది నా అదృష్టం:
- విజయనిర్మల
"భారతీయ సినిమా 100 ఏళ్ల పండుగ చేసుకోవడం ఆనందంగా ఉంది. నా చిన్నప ్పటి నుంచి ఈ రంగంలో ఉన్నాను. ఎస్వీ రంగారావు, సావిత్రి, జగ్గయ్య, జమున, శివాజీ గణేశన్ వంటి మహామహులతో పనిచేశాను. హీరోయిన్‌గా నటించాను. కృష్ణగారితో చేసిన సినిమాలు కోకొల్లలు. నేను 44 సినిమాలకు దర్శకత్వం చేస్తే అందులో 40 కృష్ణగారితో చేసినవే. ఈ జన్మకి ఇది చాలనిపిస్తోంది. ఇదంతా ఈ 100 ఏళ్లలో నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను.

ఇప్పుడున్న హీరోలు చాలా టాలెంటెడ్. మహేష్, ఎన్టీఆర్, నాగార్జున, అల్లు అరవింద్‌గారి అబ్బాయి అల్లు అర్జున్, చిరంజీవిగారి అబ్బాయి రామ్‌చరణ్ వంటి వారందరూ ఎంతో కృషి చేసి టాలెంట్‌తో పైకి వస్తున్నారు. నేటి సినిమాలో తల్లి, చెల్లెలు, వదిన పాత్రలకు ప్రాధాన్యం తగ్గిపోతోంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థను చూపించే సినిమాలు కనుమరుగైపోతున్నాయి. ఇటీవల వచ్చిన 'సతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సినిమాలు రావాలి.

ఇలాంటి సినిమాలతో మన సినిమా 200 సంవత్సరాల మైలు రాయిని చేరాలి. మాస్, ఫైట్, సాంగ్స్‌తో సినిమాలను సరిపెట్టకూడదు. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. మేం 'అల్లూరి సీతారామరాజు' చేసే సమయంలో ఇంత టెక్నాలజీ లేదు. అయినా మేం మా వంతు కృషి చేశాం. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానానికి తగ్గట్టు మానవీయ అంశాలను జోడించి సినిమాలు చేయాలి. సూర్యకాంతం, నిర్మలమ్మ వంటి నటీమణులు కరువైపోయారు. వారి స్థానాన్ని భర్తీ చేసేవారు కావాలి. రావాలి''

అందులో నేనూ భాగమైనందుకు ఆనందం
- కృష్ణంరాజు
భారతీయ సినిమా శత వసంతాలు పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అందులో నేనూ భాగమైనందుకు ఇంకా ఆనందంగా ఉంది. సినిమా అనే ఈ రంగుల ప్రపంచంలోకి అందరం పొట్ట చేతపట్టుకునొ వచ్చినవాళ్లమే. ఎవరి అదృష్టానికిఈ, ఎవరి అర్హతకు తగిన స్థానం వాళ్లకు లభించింది. విలన్‌గా నటించినా, హీరోగా చేసినా నాదైన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ ఒదులుకోలేదు. నా సీనియర్స్ ఆశీస్సులు పొందాను. సమవయస్కులతో స్నేహంగా మసిలాను. గోపీకృష్ణా బేనరుపై ఎన్నో విభిన్న చిత్రాలు నిర్మించాను. తెలుగులో విజయవంతమైన చిత్రాలను హిందీలో తీస్తే అక్కడ కూడా హిట్ అయ్యాయి. ఎలా చూసుకున్నా ఒక నిండైన, అర్ధవంతమైన జీవితాన్ని గడిపాను. నాకు ఇంత గొప్ప జీవితాన్ని సినీ కళామతల్లే ప్రసాదించింది. వందేళ్ల సినిమా చరిత్రలో నాకూ స్థానం లభించినందుకు గర్వంగా ఉంది.


ఇప్పుడు ఎదగడం సులువు
- కె. రాఘవ, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్
ఇండస్ట్రీలో ఉండటానికి అప్పట్లో రకరకాల కష్టాలూ, బాధలూ పడ్డాం. ఇప్పుడు ఇండస్ట్రీకి రావడం కష్టమే కానీ, వచ్చాక ఎదగడం సులువు. ఇప్పడు ప్రచార, ప్రసార సాధనాలు ఎన్నో ఉన్నాయి. కానీ అప్పట్లో ఎక్కువ మౌత్ పబ్లిసిటీ మీదే ఆధారపడే వాళ్లం. డబ్బులిచ్చి విజయవాడ వంటి చోట్లకి మనుషుల్ని పంపి, అక్కడి టీకొట్ల వద్ద మౌత్ పబ్లిసిటీ ఇప్పించేవాళ్లం. 'అంజలినీ, ఏఎన్నార్‌నీ కెమెరా మింగేసిందంట' అని పబ్లిసిటీ ఇచ్చే వాళ్లం. జట్కాబండిపై మైకుతో చెప్పించేవాళ్లం.

వాటికి బేనర్లు కట్టేవాళ్లం. అవి జనానికి ఆసక్తి కలిగించేవి. ఇండస్ట్రీకి నేను మంచి సినిమాలిచ్చాను. దాసరి నారాయణరావునీ, కోడి రామకృష్ణనీ దర్శకులుగా అందించాను. 'సుఖదుఃఖాలు'తో కె. బాలచందర్‌ను రచయితగా తెలుగు పరిశ్రమకు పరిచయం చేశాను. వి.సి. గుహనాథన్‌ను పరిచయం చేశాను. ఇండస్ట్రీకి నేను చేసిన దానికి గుర్తింపుగా అన్నట్లు ప్రభుత్వం నాకు రఘుపతి వెంకయ్య అవార్డునిచ్చింది. అది తప్ప మిగతా అవార్డులేవీ నాకు రాలేదు. ఇప్పుడు ఆయా కమిటీల్లో ఉండేవాళ్లు తమ కుటుంబానికి చెందిన వాళ్లకే అవార్డులు ఇచ్చుకుంటున్నారు.


టెక్నాలజీ సినిమా రూపురేఖలనే మార్చేసింది
- రాజశ్రీ
వందేళ్ల సినిమా గురించి ఎంతని చెబుతాం. మహాసముద్రంలాంటి సినిమాలో నీటిబొట్టులాంటి వాళ్లం మేము. సినిమా అంటే హీరోహీరోయిన్లే కాదు, పాత్రధారులందరూ ప్రధానమే. అందరం కలిస్తేనే సినిమా. మేము పుట్టకముందే సినిమా పుట్టింది. మూకీ సినిమాలు తీసి పక్కనుండి డైలాగులు చెప్పేవారట. విఠలాచార్య ఎన్నో ట్రిక్కులు చేసి మాయ చేశారు. టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. గ్రాఫిక్స్ వచ్చేశాయి. 'చాలామంది సినిమాల్లో లేదా టీవీ సీరియల్లో నటించవచ్చు కదా అని అడిగేవారు. కానీ, నాకు అస్సలు ఇష్టం లేదు. 1977లోనే నటనకు గుడ్‌బై చెప్పేశాను. అప్పటినుండి కుటుంబం, పిల్లలే నా లోకం. అయినా సీనియర్ నటీనటులకు ఈ తరం గౌరవం ఇవ్వడం లేదని చాలా మంది చెబుతుంటే విన్నాను.

సెట్స్‌లో ఒంటరిగా కూర్చోవడం కంటే ఇంట్లో నలుగురితోనూ కలిసుండడమే ఉత్తమం కదా. అయినా ఈ తరం సినిమా గురించి విమర్శించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. కాలాన్ని బట్టి మార్పు సహజమే కదా. ఒక్కో తరం మారుతూనే ఉంటుంది. వస్త్రధారణ విషయంలో మా ముందు తరంవారు మమ్మల్ని విమర్శించేవారు. మేము ఈ తరాన్ని విమర్శిస్తున్నాం. మా రోజుల్లో కురచ దుస్తుల ధరించేవారు కొంతమందే ఉండేవారు. ఇప్పుడు హీరోయిన్లందరూ కురచ దుస్తుల్లోనే కనిపిస్తున్నారు. అయినా వస్త్రధారణే కాదు, నటన, చిత్రీకరణ విధానాలు కూడా ఎంతో మారిపోయాయి. టెక్నాలజీ సినిమా రూపురేఖలనే మార్చేసింది.

అయితే సమయపాలన పాటించకపోవడం ఈ తరం చేస్తున్న పెద్ద పొరబాటు. సమయపాలన పాటించాలంటే ఎన్టీఆర్, ఏఎన్నార్‌లే. వారి దగ్గర మేము ఎంతో నేర్చుకున్నాం. ఈ తరం అతివేగంతో ముందుకెళ్తున్న మాట వాస్తవమేగానీ, సమయపాలన పాటించక పోవడం బాధాకరం. ఏదేమైనా ఎన్టీఆర్, ఏఎన్నార్, నాగయ్య, ఎస్వీ రంగారావు, భానుమతి, కన్నాంబ వంటి నటీనటులు మళ్లీ రారు. ఎవర్‌గ్రీన్ తారలు వారు.

వందేళ్ల కాలం
గుర్తుండేలా ఉత్సవాలు
- సి. కల్యాణ్, అధ్యక్షుడు, దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి
భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకుంటున్న కాలంలో ఈ ఫీల్డులో ఉండటం గొప్ప అనుభూతి. చెన్నైలో జరగనున్న వందేళ్ల ఉత్సవాల కమిటీ ఛైర్మన్‌గా ఉన్నందుకు తెలుగువాడిగా గర్వపడుతున్నా. రాబోయే వందేళ్ల కాలం వరకూ గుర్తుండిపోయేలా ఈ ఉత్సవాల్ని జరపాలనీ, భారతీయ సినిమా రెండో శతాబ్ది చివరకు ప్రపంచంలోనే నెంబర్‌వన్ కావాలనీ ఆశిస్తున్నాం. జూలై 13 నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరపాలని నిర్ణయించాం.

ఉత్సవాల మొదటి రోజు ఉదయం మలయాళ చిత్రాలకీ, సాయంత్రం తమిళ చిత్రాలకీ, రెండో రోజు ఉదయం కన్నడ చిత్రాలకీ, సాయంత్రం తెలుగు చిత్రాలకీ కేటాయిస్తున్నాం. మూడో రోజు సాయంత్రం నిర్వహించే భారీ వేడుకలో దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల నుంచీ ప్రముఖులు పాల్గొనబోతున్నారు.

ఆ వేడుకకు రాష్ట్రపతినీ, నాలుగు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల్నీ, తెలుగు సినిమా రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగి, నేడు కేంద్ర పర్యాటక శాఖామంత్రిగా సమర్థవంతంగా పనిచేస్తున్న చిరంజీవినీ ఆహ్వానిస్తున్నాం. వారంతా ఈ వేడుకల్లో పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాం. ఇదివరకు తెలుగు సినిమా వజ్రోత్సవం గొప్పగా నిర్వహించుకున్నాం. ఇప్పుడు నాలుగు రాష్ట్రాల సినిమాల వారూ కలిసి సౌత్ రీజియన్‌గా చరిత్రలో గుర్తుండిపోయేలా రూ. 30 కోట్ల ఖర్చుతో భారతీయ సినిమా శతాబ్ది వేడుకని ఘనంగా నిర్వహించబోతున్నాం.


మనుగడకు అవకాశాలు తగ్గుతున్నాయి
- తమ్మారెడ్డి భరద్వాజ్, అధ్యక్షుడు, ఆం.ప్ర. చలనచిత్ర వాణిజ్య మండలి
సినిమా శతాబ్ది పూర్తి నాటికి ఇండస్ట్రీలో ఉన్నందుకు సంతోషంగా ఉన్నా, ఆ ఇండస్ట్రీలో ఇప్పుడొస్తున్న మార్పులకు కొంత బాధగానూ ఉంది. కాలంతో పాటే సినిమాల్లోనూ ఎన్నో మార్పులొచ్చాయి. అప్పట్లో స్వతంత్ర నిర్మాతలు ఉండేవారు. మనుగడకు అవకాశాలెక్కువగా ఉండేవి. ఇప్పుడూ స్వతంత్ర నిర్మాతలున్నా మనుగడకు అవకాశాలు స్వల్పమైపోయాయి. పద్ధతులు మారాయి. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఈ కొత్త పద్ధతుల్లో ఇమడలేక నానా ఇక్కట్లూ పడుతున్నారు.

ఆరుబయటి తెరల నుంచి టూరింగ్ టాకీసులకు, అక్కణ్ణించి పర్మనెంట్ సినిమా హాళ్లకూ వచ్చిన సినిమా ఆ తర్వాత కాంప్లెక్సులకూ, ఇప్పుడు మల్టీప్లెక్సులకూ మారింది. ప్రింట్ల పద్ధతి పోయి డిజిటలైజేషన్ వచ్చినందున ఖర్చు తగ్గుతుందనుకుంటే అంతకంటే ఎక్కువ ఖర్చవుతోంది. సినిమా తక్కువ సమయంలో పూర్తవ్వాల్సింది పోయి ఎక్కువ సమయం ఎందుకు తీసుకుంటున్నదో అర్థం కావడం లేదు. రోజు రోజుకూ టెక్నాలజీ వృద్ధి చెందుతోంది. పాతది పోయి కొత్తది వస్తోంది. థియేటర్లలో ప్రతి ఏటా ప్రొజెక్టర్లు మార్చుకోవాల్సిన స్థితి వస్తోంది. ఇప్పుడు నిజంగా మనం క్రాస్‌రోడ్స్‌పై ఉన్నాం.


ఇండస్ట్రీ ఎంతో ఇచ్చింది
- ఎం. బాలయ్య, నటుడు, నిర్మాత, దర్శకుడు
ఇండస్ట్రీలోకి 1957లో ఓ ఆర్టిస్టుగా ప్రవేశించాను. తర్వాత ఈ యాభై ఆరేళ్లలో నటునిగా, నిర్మాతగా, రచయితగా, దర్శకునిగా ఇంత దూరం ప్రయాణిస్తూ వచ్చా. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే చిత్తూరు నాగయ్య, రేలంగి, సీయస్సార్ ఆంజనేయులు, గుమ్మడి వంటి గొప్ప సహ నటులతో పనిచేసే అవకాశం నాకు లభించింది. తర్వాత నిర్మాతగా పది సినిమాలు తీశాను. అన్నీ కథాబలం ఉన్నవే.

వాటికి నేనే కథా రచయితని. నేను తీసిన 'చెల్లెలి కాపురం', 'ఊరుకిచ్చిన మాట' చిత్రాలకు ప్రభుత్వ అవార్డులు లభించాయి. ఏడు సినిమాలకు దర్శకత్వం వహించాను. మారుమూల ఇంజనీర్‌గా పనిచేస్తున్న నాకు ఇండస్ట్రీ ఓ ప్రత్యేకతని ఇచ్చింది. నన్ను పూజించింది. అభివృద్ధి చేసింది. తెలుగు సినిమా పితామహుడైన రఘుపతి వెంకయ్య అవార్డు నాకు దక్కేట్లు చేసింది. అందుకు చిత్రసీమకు సర్వదా కృతజ్ఞుణ్ణి. ఇప్పటికీ నేను కథలు రాస్తుంటాను. కానీ వాటిని తీసుకునేవాళ్లే కనిపించడం లేదు.

ఇది ప్రత్యేక సందర్భం
శుక్రవారం భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో దానికి గుర్తింపుగా ఓ సినిమా తీసి ఉండాల్సిందనే కోరికని వ్యక్తం చేశాడు బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్. "వందేళ్ల భారతీయ సినిమాపై ఓ సినిమా తీయాలనుకున్నా. కానీ తీయలేకపోయా. భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకుంటున్నందుకూ, ఈ ఇండస్ట్రీలో ఓ భాగమైనందుకూ సంతోషంగా ఉంది.

ఇదే సందర్భంలో నటునిగా నేనూ పాతికేళ్లు పూర్తి చేసుకున్నందుకు ఇది ఓ ప్రత్యేక సందర్భంగా అనిపిస్తోంది'' అని ఆయన చెప్పాడు. సినిమా శతాబ్దికి నివాళిగా నాలుగు చిన్న కథలతో నలుగురు పేరుపొందిన దర్శకులు దివాకర్ బెనర్జీ, కరణ్ జోహార్, జోయా అఖ్తర్, అనురాగ్ కాశ్యప్ 'బాంబే టాకీస్' అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ సినిమా శుక్రవారమే విడుదలవుతోంది.

ఈ సినిమా టైటిల్ ట్రాక్‌లో పలువురు పేరుపొందిన బాలీవుడ్ తారలు నటించారు. అమీర్‌ఖాన్‌తో ప్రారంభమయ్యే ఆ సినిమా షారుఖ్‌ఖాన్‌తో ముగుస్తుంది. ఈ పాటలో కరీనా కపూర్, కరిష్మా కపూర్, రణవీర్ సింగ్, అనిల్ కపూర్, ప్రియాంకా చోప్రా, మాధురీ దీక్షిత్, విద్యా బాలన్, శ్రీదేవి, రణబీర్ కపూర్ వంటివాళ్లు కనిపిస్తారు. ఆ పాట చేసినందుకూ, అందులో భాగమైనందుకూ గొప్పగా భావిస్తున్నానని అమీర్ తెలిపాడు.

No comments:

Post a Comment