Sunday, May 5, 2013

టాకీల తొలి రోజుల్లో వింతలు.. విశేషాలు

తొలి రోజుల్లో చిత్ర నిర్మాణ పద్ధతులను పరిశీలిస్తే చిత్రంగా అనిపిస్తుంది. ప్రారంభంలో సినిమాల నిర్మాణం తక్కువే. ఏడాదికి ఒకటో రెండో సినిమాలు నిర్మాణంలో ఉండేవి. ఆర్టిస్టుల సంఖ్య కూడా తక్కువే. వాళ్లంతా నెల జీతాలకు పని చేస్తుండేవారు. ఒక్కో సినిమాని తీయడానికి నాలుగు నుంచి ఆరు నెలల వరకూ సమయం పట్టేది. ఆ చిత్రం షూటింగ్ పూర్తయి, నిర్మాత 'రిలీజ్ ఆర్డర్' ఇచ్చేవరకూ ఆర్టిస్టులకు మరో సినిమాలో నటించడానికి వీలుండేది కాదు.

అగ్రిమెంట్ చేసుకొన్న సమయంలోపల సినిమా షూటింగ్ పూర్తి కాకపోతే అదనంగా డబ్బు చెల్లించేవారు. అలాగే ప్రతి కంపెనీకి ఒక కారు ఉండేది. అందులో ముఖ్యమైన ఆర్టిస్టులను మాత్రమే పికప్ చేసుకొనేవాళ్లు. సహాయ నటీనటులకు మాత్రం రెండు అణాలు (నాలుగు అణాలు కలిపితే ఓ పావలా) బస్ ఛార్జీల నిమిత్తం ఇచ్చేవారు. అదేవిధంగా 'షేవింగ్ ఖర్చు' నిమిత్తం మగవాళ్లకి ఒక అణా ఇచ్చేవారు.

షూటింగ్ ఇలా జరిగేది

సెట్లో దర్శకుడే సుప్రీమ్. ఆయన సెట్‌లోకి రాగానే అందరూ ఎంతో గౌరవించి, భయభక్తులతో మెలిగేవారు. నిర్మాణ విషయాల్లో నిర్మాత జోక్యం చేసుకోకుండా దర్శకునికి పూర్తి స్వేచ్ఛనిచ్చేవారు. హీరో, హీరోయిన్ ఎవరైనా దర్శకుని ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. అలాగే పాత్రలను బట్టి మేకప్, కాస్ట్యూమ్స్ నిర్ణయించేవారు. నటీనటులందరికీ ఒకే ఒక మేకప్‌మన్, టచెప్ బోయ్ ఉండేవారు. ఆర్టిస్టులందరినీ దర్శకుడు ఒక చోట సమావేశపరిచి. ఆ యా పాత్రధారులను డైలాగులు చెప్పమని అడిగేవారు. అంటే నాటక ప్రదర్శనకు ముందు జరిగే ఫైనల్ రిహార్సల్స్‌లా జరిగేదన్నమాట. ఆర్టిస్టులకు టైమింగ్స్ అని ఉండేవి కావు. ప్రతిరోజూ ఆర్టిస్టులంతా మేకప్ వేసుకుని తయారై ఉండేవారు. ఫ్లోరులో ఏ సెట్ (సెట్ అంటే ఆ రోజుల్లో నాటకలకు ఉపయోగించే సీనరీ కర్టెన్లన్నమాట) ఖాళీగా ఉంటే అక్కడకి ఆర్టిస్టులను పిలిచి షూటింగ్ జరిపేవారు. ఇప్పటిలా ఫ్లోరు పైభాగం రేకులతో కప్పి ఉండేదికాదు. చుట్టూ నాలుగు గోడలు తప్ప పై భాగమంతా ఖాళీగానే ఉండేది. అక్కడినుంచి ఎండ పడుతుంటే రిఫ్లెక్టర్ల వెలుగులో ఆర్టిస్టులు నటించేవారు.

ప్రారంభంలో తెలుగువారి షూటింగ్స్ ఎక్కువగా ఉత్తరాదిలో జరుగుతుండేవి. కొన్ని స్టూడియోల్లో తెలుగువారిని చాలా చిన్నచూపు చూసేవారు. హిందీ సినిమాలకు మొదట ప్రాధాన్యం ఇచ్చి, ఆ షూటింగ్స్ లేనప్పుడే తెలుగు సినిమాలకు ఇచ్చేవారు. కొంతమంది ఉత్తరాది స్టూడియో అధినేతలు చూపించే వివక్షను సహించలేకే పినపాల వెంకటదాసు దక్షిణాదిలో స్టూడియోని నిర్మించారు. ఆనాటి స్టూడియోల్లో వసతులు అంతంత మాత్రమే, కొన్ని చోట్ల తినడానికీ, విశ్రాంతి తీసుకోవడానికి సదుపాయాలు ఉండేవికావు. సెట్టులో పని లేనప్పుడు ఆర్టిస్టులు ఓ చెట్టుకిందో చతికిలపడేవారు.

కెమెరా కదలికలు తక్కువ
ప్రారంభంలో సినిమా అంటే దాదాపు నాటకంలానే ఉండేది. రెండు సీన్లు కలిపి ఒకే షాట్‌లా తీసేవారు. కెమెరా కూడా సాధ్యమైనంతవరకూ కదలిక లేకుండా ఒకే చోట ఉండేది. షూటింగ్ ఎలా చేయాలన్నది దర్శకుడు ముందుగానే నోట్స్ తయారు చేసుకుని వచ్చేవాడు. దాని ప్రకారం షాట్స్ తీసేవారు. దర్శకుడు చెప్పమన్నంతవరకూ చెప్పడం, ఆగమన్నప్పుడు ఆగడం ఆర్టిస్టుల పని. ఇదేమిటని కానీ, ఇలా ఎందుకు చేయాలని కానీ అడిగే ధైర్యం కానీ, అవకాశం కానీ ఆర్టిస్టులకు ఉండేదికాదు. సాధారణంగా మొదటి టేక్‌లోనే షాట్ ఓకే అయ్యేది. 'రెండో టేక్' అంటేనే ఆర్టిస్టులు సిగ్గుతో తలల దించుకునేవారట. ఎందుకంటే రంగస్థలం మీద ఆరితేరిన వాళ్లనే సినిమాల్లోకి తీసుకునేవారు. ముఖ్యంగా పద్యాలు, పాటలు పాడగలిగే వాళ్లకే అవకాశాలు లభించేవి. మధ్యలో కట్‌లు లేకుండా పాటంతా ఒకేసారి పాడాలి. ఆర్టిస్టులు పాడుతుంటే వాయిద్య బృందం ఓ మూల ఉండి సంగీతం సమకూర్చేవారు. మెల్లిగా మాట్లాడితే సౌండ్ రికార్డ్ కాదేమోనని నాటకాల్లో లాగానే ఆర్టిస్టులు బిగ్గరగా మాట్లాడుతుంటే 'మెల్లిగా మాట్లాడండి' అంటూ దర్శకుడు సూచనలు ఇచ్చేవారు.

సొమ్మసిల్లే సౌండ్ రికార్డిస్ట్
పాత రోజుల్లో శబ్దాన్ని రికార్డ్ చేసే రికార్డిస్ట్‌కు సెట్‌లో చాలా గౌరవం లభించేది. అతన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఆర్టిస్ట్ ప్రయత్నించేవారు. మైక్‌ని సెట్ మధ్యలో అమర్చేవారు. ఆర్టిస్టులు దాని చుట్టూ చేరి డైలాగులు చెప్పేవారు. సెట్‌లో శబ్దం రికార్డ్ అవుతున్నప్పుడు అంతా నిశ్శబ్దంగా ఉన్నా కెమెరాలో రీలు మాత్రం పెద్ద శబ్దం చేస్తూ తిరిగేది. అప్పటికింకా 'బ్లింప్' (కెమెరా పైన ఉండే తొడుగు. అది వేస్తే శబ్దం వినిపించదు) రాలేదు. అందుకే ఆ శబ్దం రికార్డ్ కాకుండా సౌండ్ రికార్డిస్ట్‌ని ఓ అద్దాల గదిలో ఉంచేవారు. చుట్టూ మూసేసి ఉండటంతో ఆ గదిలో గాలి ఆడేది కాదు. అంతే సౌండ్ రికార్డిస్ట్ ఉక్కిరిబిక్కిరి అయ్యేవాడు. ఇక పెద్ద షాట్ అయితే చెప్పనక్కర్లేదు. సొమ్మసిల్లి పడిపోయే సౌండ్ రికార్డిస్టుల కోసం 'ఫస్ట్ ఎయిడ్ బాక్స్' ఎప్పుడూ సిద్ధంగా ఉండేది.

సింగిల్ ప్రొజెక్టర్లే అన్నీ
ఆ రోజుల్లో అన్నీ సింగిల్ ప్రొజెక్టర్లే ఉండేవి. రీలు తరువాత రీలు లోడ్ చేసేవారు. ప్రారంభంలో రోజుకి రెండు ప్రదర్శనలు ఉండేవి. అదీ సాయంత్రం పూటే. కరపత్రాల్లో ' సాయంత్రం ఆరున్నర గంటలకు ప్రదర్శన ప్రారంభం' అని ఉన్నా జనంతో హాలు నిండేవరకూ సినిమా మొదలయ్యేది కాదు. అప్పట్లో ప్రొజెక్టర్లని చేత్తో తిప్పేవారు. ఒక వేళ ప్రొజెక్టర్ పాడయితే , తిరిగి బాగయ్యే జనం అలాగే కూర్చేనేవారు. ప్రదర్శనపరంగా ఇన్ని ఇబ్బందులున్నా ప్రతి సినిమా ప్రేక్షకాదరణ పొందేది.

మూకీ ముచ్చట
మూకీ సినిమాల్లో డైలాగులు ఉండవు కనుక తెరపై జరిగే కథాక్రమాన్ని ప్రేక్షకులకు బాగా అర్ధమయ్యేట్లు వివరించి చెప్పడానికి ఓ వ్యాఖ్యాత ఉండేవాడు. మంచి కంఠస్వరం కలిగి ఉండటం ఈ వ్యాఖ్యాతకు తప్పనిసరి. హాస్యోక్తులతో తన బాణీలో వ్యాఖ్యాత సంభాషణలు వివరిస్తుంటే ప్రేక్షకులు విరగబడి నవ్వేవారు. వ్యాఖ్యాత పక్కనే తబలా, హార్మొనియం ఉండేవి. మూకీ సినిమాలకు అవే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.

No comments:

Post a Comment